సింగరేణి వ్యాప్తంగా.. బయోమెట్రిక్ అటెండెన్స్

సింగరేణి వ్యాప్తంగా.. బయోమెట్రిక్ అటెండెన్స్
  • ఫ్రీ మస్టర్లకు చెక్ ​పెట్టేందుకు యాజమాన్యం ప్లాన్
  • హెడ్డాఫీస్ ​సహా ఆరు జిల్లాల్లోని జీఎం ఆఫీసులు, హాస్పిటళ్లు, స్టోర్లలో బయోమెట్రిక్​ మెషీన్లు ఏర్పాటు
  • త్వరలో అండర్​ గ్రౌండ్​ మైన్లలో పెట్టేందుకు సన్నాహాలు 

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి వ్యాప్తంగా బయోమెట్రిక్ అటెండెన్స్​విధానాన్ని అమల్లోకి తెచ్చేందుకు యాజమాన్యం సన్నాహాలు చేస్తోంది. ఫ్రీ మస్టర్లకు చెక్​పెట్టేందుకు ప్లాన్​చేస్తోంది. కరోనాకు ముందు వరకు కేవలం కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కార్పొరేట్ ఆఫీస్, ఆరు జిల్లాల్లోని జీఎం ఆఫీసుల్లో మాత్రమే బయోమెట్రిక్ విధానం ఉండేది. 

కరోనా కారణంగా టెంపరరీగా నిలిపివేసింది. తాజాగా కార్పొరేట్​ఆఫీస్​సహా 11 ఏరియాల్లోని జీఎం ఆఫీసులు, 9 ఏరియాల్లోని హాస్పిటళ్లు, సివిల్, వర్క్ షాపులు, స్టోర్లు, విద్యుత్తు కేంద్రాల్లో బయోమెట్రిక్​ అటెండెన్స్ విధానాన్ని ప్రారంభించింది. సింగరేణి వ్యాప్తంగా 23 అండర్ గ్రౌండ్, 19 ఓపెన్​కాస్ట్ మైన్లు ఉన్నాయి. వీటిలో సుమారు 43 వేల మంది కార్మికులు, ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం బయోమెట్రిక్​విధానం 11 వేల మంది ఉద్యోగులు, కార్మికుల పరిధిలోకి రానుంది. త్వరలోనే అండర్​గ్రౌండ్​మైన్లలోనూ ఇంప్లిమెంట్​చేసేందుకు యాజమాన్యం ప్లాన్​చేస్తోంది.  

ఇక పైరవీలకు తావుండదు

ఇప్పటివరకు సింగరేణిలో ప్రతి ఉద్యోగి డ్యూటీకి వచ్చినప్పుడు తన నంబర్(ఎంప్లాయ్​కోడ్) చెబితే హాజరు నమోదు చేసేవారు. మస్టర్​వేసేవారితో ఉన్న పరిచయాలను అడ్డం పెట్టుకుని, చాలా మంది డ్యూటీకి రాకుండానే అటెండెన్స్​వేయించుకునేవారు. ఫ్రీ మస్టర్​ను నిరోధించేందుకు యాజమాన్యం కరోనాకు ముందు బయోమెట్రిక్​విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసింది. కొత్తగూడెం ఏరియా వీకే-7 అండర్​గ్రౌండ్​మైన్​లో ఫేస్​ రికగ్నైజేషన్​ పద్ధతిని తీసుకొచ్చింది. దీంతో ఒకరి హాజర మరొకరు చెప్పే అవకాశం ఉండదు. తాజాగా జీఎం ఆఫీసులు, డిపార్ట్​మెంట్లు, ఆసుపత్రుల్లో బయోమెట్రిక్​విధానం అమల్లోకి తీసుకరావడంతో ఇక నుంచి ఉద్యోగులు, కార్మికులు డ్యూటీలకు వచ్చే టైమ్, వెళ్లే టైమ్ లో హాజరు నమోదవుతుంది. ప్రతి ఒక్కరూ 8 గంటల పాటు డ్యూటీలు నిర్వహించాలి. ఇప్పటి వరకు హాజరు వేసే క్లర్కుల అవసరం 
తగ్గనుంది. 

10 నుంచి 15 మంది..

సింగరేణిలో పనిచేయకుండానే ఫ్రీ మస్టర్లు పొందుతున్న  వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. డెయిలీ 10 నుంచి 15 మంది పనిచేయకుండానే ఇండ్లకు వెళ్లిపోతున్నారు. ప్రధానంగా గెలిచిన సంఘాలకు సంబంధించి పిట్ నుంచి ఏరియా స్థాయి పదవుల్లో ఉన్నవారు, వారి అనుచరులు అత్యధికంగా ఫ్రీ మస్టర్​పొందుతున్నారు. ఇప్పటికే ఫ్రీ మస్టర్ల వ్యవహారంపై పలుచోట్ల కార్మిక సంఘాల మధ్య విభేదాలు తలెత్తాయి. కొందరు అప్పనంగా వేతనాలు పొందుతున్నారంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇటీవల మందమర్రి ఏరియాలోని సీహెచ్​పీలో ఫ్రీ మస్టర్ల వ్యవహారం విమర్శలకు తావిచ్చింది. ఇదే ఏరియాలో అత్యధిక మంది లీడర్లున్న మైన్​నుంచి డ్యూటీలు చేయకుండా హాజరు వేసుకొని సొంత పనులు చక్కదిద్దుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.  ఉదయం గనిపైకి వచ్చి తిరిగి బయటకు వెళ్తున్న కొంత మందికి డ్యూటీలు నిర్వహించినట్లు రికార్డుల్లో నమోదువుతున్నాయి. 

ఒక్కొక్కరికి రూ.3 వేలు

సింగరేణి వ్యాప్తంగా డెయిలీ 150 నుంచి 200 మంది వరకు ఫ్రీ మస్టర్లు పొందుతున్నట్లు కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి.  ఒక్కో మస్టరుపై సింగరేణి రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు చెల్లిస్తోంది. ఇలా రోజూ రూ.3 లక్షల నుంచి 4 లక్షల వరకు భారీగా ఆదాయం కోల్పోతుంది. ఫ్రీ మస్టర్లను వదిలేసి, మిగిలిన వారితో రోజుకు 8 గంటలు పనిచేయిస్తున్నారని కార్మికులు మండిపడుతున్నారు. ఇటీవల కొన్ని ఏరియాల్లో ఫ్రీ మస్టర్లు పొందుతున్న కొందరు డ్యూటీ టైంలో విందులు, రాజకీయ పార్టీల కార్యక్రమాల్లో పాల్గొన్న వీడియోలు సోషల్​మీడియా చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలో యాజమాన్యం బయోమెట్రిక్ ను తిరిగి అమల్లోకి తీసురావడం ఫ్రీ మస్టర్లకు చెక్​పెట్టేందుకేనని ప్రచారం జరుగుతోంది. 

సమయ పాలన పాటించాల్సిందే

సింగరేణి ఐటీ వింగ్ నుంచి వచ్చిన ఆదేశాలతో జీఎం ఆఫీస్ సహా డిపార్ట్​మెంట్లు, హాస్పిటళ్లు, స్టోర్లలో బయోమెట్రిక్ విధానాన్ని  అమల్లోకి తెస్తున్నాం. ఇక నుంచి ఉద్యోగులు, ఆఫీసర్లు సమయపాలన పాటించాల్సిందే.

‌‌‌‌‌‌‌‌- జి.మోహన్​రెడ్డి, మందమర్రి ఏరియా సింగరేణి జీఎం