సమ్మర్‌‌‌‌‌‌‌‌లో నిరంతర కరెంట్ సరఫరాకు సన్నాహాలు

సమ్మర్‌‌‌‌‌‌‌‌లో నిరంతర కరెంట్ సరఫరాకు సన్నాహాలు
  • విద్యుత్​ వినియోగం పెరుగుతున్నట్టు అధికారుల వెల్లడి
  • వేసవిలో ఇబ్బందులు రాకూడదనే  ఫీడర్ల మరమ్మతులు 

హైదరాబాద్, వెలుగు : గ్రేటర్​పరిధిలో ఈ సారి వేసవిలో ఎండల ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉన్నందువల్ల విద్యుత్ అధికారులు ఇప్పటి నుంచే ఫీడర్ల మరమ్మతు పనులు మొదలెట్టారు.  కొన్ని రోజులుగా సమ్మర్​ ప్రిపరేషన్​ పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు.  ఈ కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో కొద్ది టైమ్‌‌‌‌ కరెంట్ సరఫరాలో అంతరాయం కలుగుతోంది.  గ్రేటర్​పరిధిలో 3 వేలకు పైగా11 కెవీ ఫీడర్లు ఉన్నాయి.  వీటి ద్వారానే నిత్యం డొమెస్టిక్​ వినియోగదారులకు విద్యుత్​సరఫరా చేస్తున్నారు.  కొన్ని రోజులుగా రోజుకు 100 నుంచి 120 ఫీడర్లను తనిఖీలు చేసి అవసరమైన రిపేర్లు చేస్తున్నారు.  

పనులు జరిగే ప్రాంతాల్లో ముందస్తు సమాచారం ఇచ్చి కొంత సమయం పాటు విద్యుత్​సరఫరా నిలిపివేస్తున్నామని టీఎస్​ఎస్పీడీసీఎల్​ మెట్రోజోన్​ చీఫ్​ ఇంజనీర్​ లక్ష్మీనర్సింహులు తెలిపారు.  సమ్మర్​ ప్రిపరేషన్​ ద్వారా వేసవికి ముందు ఫీడర్లను పరిశీలించడం, ఫీడర్లు ట్రిప్​ అయితే సరిదిద్దడం,  ఆయా ప్రాంతాల్లో విద్యుత్​ తీగలపై పెరిగిన చెట్లను కొట్టి వేయడం లాంటి పనులు చేపడుతున్నారు.  ఇలాంటి పనులు చేసే సమయంలో కొద్దిటైం కరెంట్ సరఫరా నిలిపివేస్తున్నారు.  

ఈసారి భారీగా పెరగనున్న వాడకం

గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం వేసవిలో విద్యుత్​వినియోగం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.  గతేడాది హైదరాబాద్​, రంగారెడ్డి, మేడ్చల్​ జిల్లాల పరిధిలో  ఏప్రిల్, మే నెలలో రోజుకు గరిష్ఠంగా 79  మిలియన్​ యూనిట్ల విద్యుత్‌‌‌‌ వినియోగం జరిగింది. ఒక్క  హైదరాబాద్​ నగరంలోనే  గరిష్ఠంగా 22  నుంచి 25 మిలియన్​ యూనిట్ల విద్యుత్‌‌‌‌  వినియోగించారు. ఈ సారి  ఫిబ్రవరి నెల ప్రారంభానికే ఎండ వేడిమి ప్రారంభం కావడంతో విద్యుత్​ వినియోగం పెరుగుతోందని అధికారులు చెబుతున్నారు.  గతేడాది ఫిబ్రవరిలో రోజుకు 17 నుంచి 18  మిలియన్​ యూనిట్ల విద్యుత్​ వినియోగించగా..  

ప్రస్తుతం 21 నుంచి 22 మిలియన్​ యూనిట్ల వరకు వాడే అవకాశం ఉంది.  ఈ సారి గ్రేటర్​ పరిధిలో 80 నుంచి 90 మిలియన్​ యూనిట్లు దాటిపోయే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.  దీనికి కారణం కొత్త కనెక్షన్లు పెరగడమేనని అంటున్నారు.  ప్రస్తుతం గ్రేటర్​పరిధిలో మూడు జిల్లాల్లో కలిపి  రూ.18 లక్షల ఎల్‌‌‌‌టీ కనెక్షన్లు (డొమెస్టిక్​) ఉండగా, మరో నాలుగు లక్షల వరకు కమర్షియల్​ కనెక్షన్లు ఉన్నాయి.

 భారీగా విద్యుత్​ వినియోగిస్తే ఫీడర్ల పై లోడ్​ పెరుగుతుంది. పలు సందర్భాల్లో ట్రిప్​కావడం వల్ల విద్యుత్​ సరఫరాకు అంతరాయం కలుగుతుంది.  తిరిగి వాటిని సరిదిద్దడానికి కొంత సమయం పడుతుంది.  మొత్తానికి గతేడాది కంటే ఈసారి విద్యుత్​ వినియోగం మాత్రం ఊహించినదాని కంటే ఎక్కువగానే వినియోగించే అవకాశం ఉంది.