తొలిసారి రాష్ట్రానికి ప్రెసిడెంట్​ ముర్ము

తొలిసారి రాష్ట్రానికి ప్రెసిడెంట్​ ముర్ము
  •     శంషాబాద్‌‌లో ఘన స్వాగతం పలికిన గవర్నర్​తమిళిసై, మంత్రి సత్యవతి
  •     ప్రత్యేక హెలికాప్టర్‌‌లో శ్రీశైలం వెళ్లి.. సాయంత్రం తిరిగొచ్చిన ముర్ము
  •     హకీంపేటలో పుష్పగుచ్ఛం ఇచ్చి ఆహ్వానించిన సీఎం కేసీఆర్
  •     ఈ నెల 30 దాకా హైదరాబాద్‌‌లోనే ప్రెసిడెంట్
  •     రాజ్​భవన్‌‌లో గవర్నర్ ఇచ్చిన విందుకు కేసీఆర్ దూరం


హైదరాబాద్/ కంటోన్మెంట్/ శ్రీశైలం, వెలుగు: శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం తొలిసారి హైదరాబాద్‌‌కు వచ్చారు. ఉదయం 10:40 గంటలకు ఆమె శంషాబాద్‌‌ ఎయిర్‌‌పోర్టుకు చేరుకున్నారు. గవర్నర్ తమిళిసై, మంత్రి సత్యవతి రాథోడ్‌‌తో పాటు ఉన్నతాధికారులు ప్రెసిడెంట్‌‌కు ఘన స్వాగతం పలికారు. తర్వాత రాష్ట్రపతి ప్రత్యేక హెలికాప్టర్‌‌లో శ్రీశైలం బయలుదేరి వెళ్లారు. మల్లికార్జునస్వామిని దర్శించుకుని.. సాయంత్రం తిరిగి సిటీకి చేరుకున్నారు. ఈ నెల 30 వరకు సికింద్రాబాద్‌‌ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ముర్ము బస చేయనున్నారు. పలు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. 

శ్రీశైలం పర్యటన తర్వాత రాష్ట్రపతి హకీంపేట  ఎయిర్​ఫోర్స్ స్టేషన్‌‌కు సాయంత్రం 5 గంటలకు చేరుకున్నారు. ఉదయం ముర్మును ఆహ్వానించేందుకు శంషాబాద్ ఎయిర్​పోర్ట్‌‌కు వెళ్లని కేసీఆర్.. సాయంత్రం హకీంపేటకు వెళ్లి స్వాగతం పలికారు. తర్వాత రాష్ట్రపతికి త్రివిధ దళాలు గౌరవ వందనం చేశాయి. ఎయిర్ స్టేషన్‌‌లోనే ఏర్పాటు చేసిన సభాస్థలికి చేరుకొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతికి సీఎం పుష్పగుచ్ఛం అందించి శాలువాతో సత్కరించారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులను, అధికారులను ప్రెసిడెంట్‌‌కు సీఎం పరిచయం చేశారు. రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు. 

క్యూలో బీఆర్ఎస్ నేతల తర్వాత బండి సంజయ్ నిలుచున్నారు. ఆయన రాష్ట్రపతి వద్దకు వస్తున్న క్రమంలో సీఎం కేసీఆర్.. బండి సంజయ్‌‌ని ముందుకు రావాలంటూ పిలిచి మరీ పరిచయం చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా రావటంతో.. ఆయన్ను పరిచయం చేశారు. చాలా కాలం తర్వాత సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై రాష్ట్రపతి పర్యటనలో కలిశారు. ప్రెసిడెంట్‌‌కు ఆహ్వానం పలికిన తర్వాత ఇద్దరూ మాట్లాడుకుంటూ ముందుకు కదిలారు.

గవర్నర్ విందుకు కేసీఆర్, కేటీఆర్ హాజరుకాలే

రాష్ట్రపతి గౌరవార్థం గవర్నర్ తమిళిసై ఇచ్చిన విందుకు మళ్లీ సీఎం కేసీఆర్ డుమ్మా కొట్టారు. హకీంపేట ఎయిర్‌‌‌‌స్టేషన్‌‌లో గవర్నర్‌‌‌‌తో సీఎం మాట్లాడుతూ కనిపించడంతో.. రాజ్ భవన్‌‌లో జరిగే విందుకు హాజరవుతారని అంతా భావించారు. కానీ అట్నుంచి అటే నేరుగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌‌కు కేసీఆర్ వెళ్లిపోయారు. దీంతో రాజ్​భవన్‌‌కు, ప్రగతి భవన్‌‌కు మధ్య ఉన్న గ్యాప్ ఏ మాత్రం తగ్గలేదని మరోసారి స్పష్టమైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. రాష్ట్ర కేబినెట్‌‌లో నంబర్ 2 గా చెప్పే కేటీఆర్ కూడా గవర్నర్ విందుకు హాజరుకాలేదు. 

అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు, హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ దంపతులు, మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డి, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్‌‌.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, బీఎస్పీ స్టేట్ ప్రెసిడెంట్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, సీపీఐ రాష్ర్ట కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తదితరులు హాజరయ్యారు. రాజ్ భవన్‌‌లో మంత్రి నిరంజన్ రెడ్డి, రేవంత్ రెడ్డి మధ్య ఆత్మీయ సంభాషణ చోటుచేసుకుంది. రేవంత్ భుజంపై చేయి వేసి మరీ మంత్రి వెంట పిలుచుకుని వెళ్లారు.

శ్రీశైలం మల్లన్నకు రుద్రాభిషేకం

ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకొని, నల్లమల చెంచులు తమ జీవన విధానాలను మెరుగుపరుచుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఏపీ నంద్యాల జిల్లాలోని శ్రీశైల క్షేత్రంలో ఆమె పర్యటించారు. హైదరాబాద్ నుంచి ఉదయం గవర్నర్​ తమిళిసైతో కలిసి బయల్దేరి వెళ్లారు. సున్నిపెంట హెలిప్యాడ్ వద్దకు చేరుకొని.. అక్కడి నుంచి శ్రీశైలానికి రోడ్డు మార్గంలో వెళ్లారు. ప్రసాద్ స్కీమ్ కింద రూ.43 కోట్లతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ముందుగా రత్నగర్భ గణపతి స్వామిని ముర్ము దర్శించుకు న్నారు. అక్కడి నుంచి మల్లికార్జున స్వామి ఆలయానికి చేరుకొని రుద్రాభిషేకం చేశారు. 

మల్లికా గుండంలో ప్రతిబింబించే ఆలయ విమాన గోపురాన్ని తిలకించారు. అక్కడి నుంచి భ్రమరాంబ దేవి ఆలయానికి చేరుకొని కుంకుమార్చన చేశారు. తర్వాత శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా చెంచు విద్యార్థులు ఆమెకు నృత్యంతో స్వాగతం పలికారు. అక్కడే చెంచు మహిళలతో రాష్ట్రపతి ముఖాముఖి నిర్వహించారు. సాయంత్రం నాలుగు గంటలకు సున్నిపెంట నుంచి హెలికాప్టర్ ద్వారా తిరిగి హైదరాబాద్‌‌కు బయల్దేరారు. ఈ కార్యక్రమంలో ముర్ము వెంట కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి, ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఉన్నారు.

టూర్ షెడ్యూల్ ఇదీ..

  • మంగళవారం ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ విద్యాసంస్థల విద్యార్థులు, ఫ్యాకల్టీతో సమావేశమవుతారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గవర్నర్ హాజరవుతారు.  
  • తర్వాత బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లి లంచ్ చేస్తారు.
  •  మధ్యాహ్నం 3 గంటలకు సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో అఖిల భారత పోలీస్ సర్వీస్ 74వ బ్యాచ్ ట్రైనీ అధికారులతోపాటు భూటాన్, నేపాల్, మారిషస్, మాల్దీవులు దేశాల అధికారులతో భేటీ అవుతారు. 
  •   ఈ నెల 28న భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామి ఆలయం, ప్రపంచ వారసత్వ సంపదగా పేరొందిన రామప్ప దేవాలయాన్ని సందర్శిస్తారు. అదే రోజు ప్రసాద్ పథకాన్ని ప్రారంభిస్తారు.
  •     మిశ్ర ధాతు నిగం లిమిటెడ్ (మిథాని)కి సంబంధించిన వైడ్ ప్లేట్ మిల్ ప్లాంట్‌‌ను వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారు.
  •     ఈనెల 29న ఉదయం షేక్‌‌పేటలోని జి.నారాయణమ్మ ఇన్‌‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మహిళా కళాశాలను సందర్శిస్తారు. విద్యార్థులు, ఫ్యాకల్టీతో సమావేశమవుతారు. సాయంత్రం 5 గంటలకు శంషాబాద్‌‌లోని శ్రీరామ్‌‌నగర్‌‌లో సమైక్యతామూర్తి (శ్రీ రామానుజాచార్య) విగ్రహాన్ని సందర్శిస్తారు.
  •     ఈనెల 30న ఉదయం రంగారెడ్డి జిల్లాలోని కన్హా శాంతి వనంలో శ్రీరామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‌ రాష్ట్రాలకు చెందిన అంగన్‌‌వాడీ, ఆశా వర్కర్లను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తర్వాత సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, శ్రీ రామచంద్ర మిషన్ కలిసి చేపడుతున్న ‘హర్ దిల్ ధ్యాన్, హర్ దిన్ ధ్యాన్’ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం ఒంటి గంటకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో విందు ఇస్తారు.