సుప్రీం కోర్టును రాష్ట్రపతి ముర్ము అడిగిన 14 ప్రశ్నలు ఇవే.. !

సుప్రీం కోర్టును రాష్ట్రపతి ముర్ము అడిగిన 14 ప్రశ్నలు ఇవే.. !

న్యూఢిల్లీ: సుప్రీం కోర్టుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 14 ప్రశ్నలు సంధిస్తూ.. న్యాయ వ్యవస్థ పరిధి, గవర్నర్, రాష్ట్రపతి అధికారాలపై వివరణ కోరుతూ రాసిన లేఖ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. తమిళనాడు అసెంబ్లీలో పాస్ అయిన బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ నెలల తరబడి పెండింగ్‎లో పెట్టడాన్ని తప్పుపడుతూ సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ జేబీ పార్థీవాలా, జస్టిస్ ఆర్. మహాదేవన్‎తో కూడిన బెంచ్ 2025 ఏప్రిల్లో సంచలన తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే.

రాష్ట్రాల గవర్నర్లు పంపే బిల్లులపై రాష్ట్రపతి తప్పనిసరిగా 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాల్సిందేనని సుప్రీంకోర్టు తొలిసారిగా గడువును నిర్దేశించిన విషయం విదితమే. ఆర్టికల్ 201 ప్రకారం రాష్ట్రపతి కూడా జ్యుడీషియల్ రివ్యూకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు వెలువరించిన ఈ తీర్పుపై వివరణ కోరుతూ సుప్రీం కోర్టుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తాజాగా లేఖ రాశారు. ఆ లేఖలో సుప్రీం కోర్టును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పష్టత కోరుతూ అడిగిన 14 ప్రశ్నలు ఇవే..

సుప్రీంను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అడిగిన 14 ప్రశ్నలు:

1. రాష్ట్ర అసెంబ్లీ పంపించిన బిల్లును.. గవర్నర్ స్వీకరించిన తర్వాత ఆర్టికల్ 200 కింద రాజ్యాంగం సూచించిన నిబంధనలు ఏంటి..?
2. రాష్ట్ర ప్రభుత్వం బిల్లులపై నిర్ణయం తీసుకునే సమయంలో గవర్నర్.. కేబినెట్ నిర్ణయం, సలహాల మేరకు మాత్రమే వ్యవహరించాలా..?
3. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 కింద గవర్నర్ తీసుకున్న విచక్షణాధికార నిర్ణయం న్యాయ పరిశీలనకు లోబడి ఉంటుందా..?
4. ఆర్టికల్ 200 కింద గవర్నర్ నిర్ణయాలు కోర్టుల సమీక్ష, విచారణల నుంచి ఆర్టికల్ 361 కాపాడుతుందా..?
5. గవర్నర్ ఎంత సమయంలో నిర్ణయం తీసుకోవచ్చు అనే విషయంపై రాజ్యాంగంలో స్పష్టమైన కాల పరిమితి లేనప్పుడు.. బిల్లులపై నిర్ణయం తీసుకోవటానికి గవర్నర్లకు న్యాయ వ్యవస్థ గడువు విధించవచ్చా..?
6. ఆర్టికల్ 201 కింద రాష్ట్రపతి విచక్షణాధికారాన్ని న్యాయ పరంగా సమీక్షించవచ్చా..?
7. రాజ్యాంగబద్దమైన ఆదేశాలు లేనప్పుడు.. న్యాయపరంగా సూచించిన గడువునకు, కాలానికి  రాష్ట్రపతి కట్టుబడి ఉంటారా..?
8. రాష్ట్ర ప్రభుత్వం పంపించిన బిల్లులను గవర్నర్ రిజర్వ్ చేసినప్పుడు.. నిర్ణయం తీసుకోకుండా ఉన్నప్పుడు రాష్ట్రపతి తప్పనిసరిగా ఆర్టికల్ 143 కింద సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరాలా..?
9. బిల్లు చట్టంగా మారే ముందు.. గవర్నర్ లేదా రాష్ట్రపతి నిర్ణయాలలో కోర్టులు జోక్యం చేసుకోవచ్చా..?
10. రాష్ట్రపతి లేదా గవర్నర్ నిర్ణయాలను తీసుకోవటానికి లేదా మార్పులు చేయటానికి ఆర్టికల్ 142 కింద అనుమతి ఉందా..?
11. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లు గవర్నర్ ఆమోదం లేకుండా చట్టంగా మారుతుందా..?
12. రాజ్యాంగ సవరణ ప్రశ్నలను ఆర్టికల్ 145(3) కింద ముందుగా రాజ్యాంగ ధర్మాసనానికి సూచించాలా..?
13. ఆర్టికల్ 142 కింద.. రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా.. కోర్టు తీర్పులను అనుమతిస్తుందా..?
14. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వివాదాలను.. సుప్రీంకోర్టు పరిధిని నిర్దేశించే ఆర్టికల్ 131 పరిధిలో కాకుండా పరిష్కరించవచ్చా..?