
- చట్ట రూపం దాల్చిన బిల్లు
- మూడు దశాబ్దాల నిరీక్షణకు తెర
మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టంగా మారింది. ఇప్పటికే లోక్‌సభ, రాజ్యసభ ఆమోదం పొందిన ఈ బిల్లును శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. దీంతో బిల్లు చట్ట రూపం దాల్చింది.
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టంగా మారింది. ఇప్పటికే లోక్‌సభ, రాజ్యసభ ఆమోదం పొందిన ఈ బిల్లును శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. దీంతో బిల్లు చట్ట రూపం దాల్చింది. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లును ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ పేరుతో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సెప్టెంబర్19న లోక్‌సభలో, 21న రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఉభయ సభల్లో ఆమోదం పొందిన బిల్లుపై ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ శుక్రవారం తెల్లవారుజామున సంతకం చేసి
ఆమోదం కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించారు. బిల్లును రాష్ట్రపతి ఆమోదించడంతో మూడు దశాబ్దాల నిరీక్షణకు తెరపడినట్లయింది. సెప్టెంబరు 26న ఢిల్లీలో దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం బీజేపీ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాని మోదీ.. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించడం ప్రజాస్వామ్యానికి మాత్రమే కాకుండా పార్టీ సిద్ధాంతాలకు దక్కిన ఖ్యాతిగా కొనియాడారు. రాజకీయాల్లో మహిళలకు సముచిత భాగస్వామ్యం లేకుండా సమ్మిళిత సమాజం
ప్రజాస్వామ్య సమైక్యత గురించి మాట్లాడలేమని మోదీ అన్నారు. కాగా, లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే మహిళా రిజర్వేషన్ చట్టం అమల్లోకి రానుంది.