
న్యూఢిల్లీ: టీవీకే చీఫ్ విజయ్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ‘ఎక్స్’లో వారు సంతాపం తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు. ఈ దుర్ఘటన చాలా దురదృష్టకరమని ముర్ము పేర్కొన్నారు. అలాగే తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, సీఎం స్టాలిన్ కూడా ఈ ఘటనపై సంతాపం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. పోలీసులు, డాక్టర్లకు సహకరించాలని ప్రజలకు ఆయన ‘ఎక్స్’లో విజ్ఞప్తి చేశారు.
తొక్కిసలాట జరిగిన కొద్దిసేపటికే సీఎం ఎమర్జెన్సీ మీటింగ్ నిర్వహించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, జైశంకర్, హెచ్ డీ కుమారస్వామి, ఎంపీ కమల్ హాసన్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, డీఎంకే ప్రతినిధి శరవణన్ అన్నాదురై తదితరులు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. డీఎంకే లీడర్, మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ.. కరూర్లోని ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. గాయపడిన వారి గురించి ఆరా తీశారు.