ప్రజల దృష్టి మరల్చేందుకే.. మోదీ వ్యాఖ్యలపై ఖర్గే ఫైర్

ప్రజల దృష్టి మరల్చేందుకే.. మోదీ వ్యాఖ్యలపై ఖర్గే ఫైర్
  •     ఫస్ట్ ఫేజ్ లో ఓడిపోతామని తెలిసిపోయిందని ఆరోపణ
  •     ప్రధాని సహనం కోల్పోయి మాట్లాడుతున్నరని విమర్శ
  •     మోదీ వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేతలు

న్యూఢిల్లీ: ఫస్ట్ ఫేజ్ ఎన్నికల్లో ఇండియా కూటమికే మెజార్టీ స్థానాలు దక్కనున్నాయని తెలియడంతో ప్రధాని మోదీ సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి వారి దృష్టి మళ్లించేందుకు మోదీ కొత్త నాటకం ఆడుతున్నారని విమర్శించారు. మోదీ హేట్ స్పీచ్ వెనుక చాలా పెద్ద కారణమే ఉందన్నారు. ‘‘మేము అధికారంలోకి వస్తే మహిళలకు సంబంధించిన బంగారం లెక్కలు అడుగుతామంటూ మోదీ చేసిన కామెంట్లను ఖండిస్తున్నాం. దీన్ని మా మేనిఫెస్టోలో పెట్టినట్టు మోదీ అన్నారు. 

ఆయన చేసిన వ్యాఖ్యల్లో నిజంలేదు. అధికారం కోల్పోతున్నామని భయపడి మాపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు’’అని ఖర్గే మండిపడ్డారు. విద్వేషపూరిత స్పీచ్ ఇవ్వడమే బీజేపీ, ఆర్ఎస్ఎస్​ ట్రైనింగ్​లో స్పెషాలిటీ అని ఆరోపించారు. ‘‘దేశ సంపదపై మొదటి హక్కు ముస్లింలకు ఉందంటూ మన్మోహన్ సింగ్ ఎప్పుడో అన్నారని మోదీ చెప్తున్నారు. ఎక్కువ పిల్లలున్నవారికి, చొరబాటుదారులకు దేశ సంపద పంచడానికి కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తోందన్నారు. అయితే, ఈ వ్యాఖ్యల్లో నిజం లేదు’’ అని ఖర్గే క్లారిటీ ఇచ్చారు. మోదీ చెప్పినవన్నీ నమ్మే స్థితిలో 143 కోట్ల భారతీయులు లేరని తెలిపారు.

బంగారం అమ్ముకునేలా చేశారు: జైరామ్ రమేశ్

మోదీ ప్రధాని అయ్యాక ఇక్కడి మహిళలు తమ బంగారాన్ని అమ్ముకునే పరిస్థితి వచ్చిందని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరామ్ రమేశ్ అన్నారు. బంగారాన్ని తాకట్టు పెట్టుకుని సమస్యలు పరిష్కరించుకోవాల్సిన దుస్థితికి భారతీయ మహిళలను ప్రధాని మోదీ దిగజార్చారని విమర్శించారు. ఈ విషయంలో మోదీ చరిత్రలో నిలిచిపోతారని ఎద్దేవా చేశారు. అసలు మహిళల వద్ద బంగారమే లేదన్నారు. ‘‘మోదీ అనాలోచిత నిర్ణయాల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నది. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, కరోనా టైమ్​లో ఇష్టమొచ్చినట్టు విధించిన లాక్​డౌన్, కరోనా రిలీఫ్ ప్యాకేజీలు ప్రజలను మరింత పేదరికంలోకి నెట్టాయి. పొదుపు చేసే పరిస్థితి లేదు. ఉన్న బంగారాన్ని అమ్ముకుని, తాకట్టు పెట్టుకుని బతుకుతున్నారు. గడిచిన ఐదేండ్లలో గోల్డ్ లోన్లు 300శాతం పెరిగాయి’’ అని మండిపడ్డారు.

ఏ ప్రధాని కూడా ఇలా మాట్లాడలేదు: కపిల్ సిబల్

దేశ సంపదను కాంగ్రెస్ పంచేస్తుందంటూ మోదీ చేసిన కామెంట్లను తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ అన్నారు. ఏ ప్రధాని కూడా ఇలా మాట్లాడలేదని మండిపడ్డారు. ‘‘మోదీ స్పీచ్ విని కోట్లాది మంది ప్రజలు బాధపడ్డారు. మస్లింలు, చొరబాటుదారులంటూ విద్వేషపూరితమైన ప్రసంగం చేశారు. ఇది ఎలాంటి రాజకీయం? ఇందులో సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ ఎక్కడుంది? ఒక వైపు రాముడి సిద్ధాంతాల గురించి మాట్లాడుతూ.. మరో వైపు ఓ వర్గాన్ని ద్వేషించడం ఇదెక్కడి కల్చర్? ’’ అని కపిల్ సిబల్​ డిమాండ్ చేశారు. 

కాగా, ప్రధాని మోదీ వ్యాఖ్యలు సమాజంలో విద్వేషాన్ని, విభజనను పెంచేలా ఉన్నాయని, ఎన్నికల కోడ్ కు వ్యతిరేకమని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. మోదీపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరింది. ఈమేరకు ఆ పార్టీ సీనియర్ నేతలు అభిషేక్ మను సింఘ్వి, గురుదీప్ సప్పల్, సుప్రియా శ్రీనటె ఆధ్వర్యంలో ఓ బృందం ఈసీని కలిసి ఫిర్యాదు అందించింది.