రాష్ట్రపతి ఎన్నికలో విశేషాలెన్నో

రాష్ట్రపతి ఎన్నికలో విశేషాలెన్నో
  • అదే నెల 21న ఓట్ల లెక్కింపు.. ఈ నెల  15న నోటిఫికేషన్​
  • షెడ్యూల్ విడుద‌‌‌‌ల చేసిన కేంద్ర ఎన్నిక‌‌‌‌ల సంఘం
  • ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఓటు హక్కు.. మొత్తం ఓటర్లు 4,809
  • జులై 24తో ముగియనున్న రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ పదవీకాలం

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రపతి ఎన్నిక‌‌‌‌కు షెడ్యూల్ విడుద‌‌‌‌లైంది. జులై 18న పోలింగ్​ ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. గురువారం ఢిల్లీలోని నిర్వాచన్​ స‌‌‌‌ద‌‌‌‌న్​లో చీఫ్​ ఎలక్షన్​ కమిషనర్​ రాజీవ్ కుమార్ షెడ్యూల్ రిలీజ్ చేశారు. ఆర్టికల్ 324 ప్రకారం రాష్ట్రపతి ఎన్నికలను నిర్వహించ‌‌‌‌నున్నామని, ఇప్పటి వరకు 15 సార్లు విజయవంతంగా ఈ ఎన్నికలు జరిగాయని చెప్పారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ పదవీకాలం జులై 24తో ముగియనుంది. రాష్ట్రపతిని ఎలక్టోరల్​ కాలేజీ ఎన్నుకుంటుంది. ఇందులో ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఓటు హక్కు ఉంటుంది.

 పార్లమెంట్, అసెంబ్లీల్లో పోలింగ్​

జూన్ 15న ఎన్నిక‌‌‌‌ల‌‌‌‌ నోటిఫికేష‌‌‌‌న్ విడుద‌‌‌‌లవుతుందని చీఫ్​ ఎలక్షన్​ కమిషనర్​ రాజీవ్​ కుమార్​ తెలిపారు. నామినేష‌‌‌‌న్ దాఖ‌‌‌‌లుకు చివ‌‌‌‌రి తేదీ జూన్ 29. నామినేష‌‌‌‌న్ల ప‌‌‌‌రిశీల‌‌‌‌న జూన్ 30 న జ‌‌‌‌రుగుతుంది. నామినేష‌‌‌‌న్ల ఉప సంహ‌‌‌‌ర‌‌‌‌ణ‌‌‌‌కు జులై 2 వ‌‌‌‌ర‌‌‌‌కు అవ‌‌‌‌కాశం క‌‌‌‌ల్పించారు. జులై 21న ఢిల్లీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. జులై 18న పార్లమెంటులో, అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో పోలింగ్ జరుగుతుంది. ఎంపీలు పార్లమెంటులో, ఎమ్మెల్యేలు తమ అసెంబ్లీల్లో ఓటు వేయవచ్చని, అయితే ఎంపీలు కనీసం 10 రోజులు ముందుగా సమాచారం ఇచ్చి దేశంలో మరెక్కడైనా (ఏ అసెంబ్లీలోనైనా) ఓటు హక్కు వినియోగించుకోవచ్చని రాజీవ్​ కుమార్​ పేర్కొన్నారు. 

మొత్తం ఓట్ల విలువ 10,86,431

రాష్ట్రపతిని ఎన్నుకునే ఎల‌‌‌‌క్టోర‌‌‌‌ల్ కాలేజీలో దేశంలోని అన్ని రాష్ట్రాల శాస‌‌‌‌న స‌‌‌‌భ్యులు, లోక్ స‌‌‌‌భ, రాజ్య స‌‌‌‌భ ఎంపీలు, ఢిల్లీ, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల శాస‌‌‌‌న స‌‌‌‌భ్యులకు ఓటు హ‌‌‌‌క్కు ఉంటుంది.  పార్లమెంటు, అసెంబ్లీల్లోని నామినేటెడ్ సభ్యులకు, ఎమ్మెల్సీల‌‌కు ఓటు హ‌‌క్కు ఉండ‌‌దు. మొత్తం ఓటర్లు 4,809 మంది కాగా, ఇందులో ఉభయ సభల ఎంపీలు  776 మంది, అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేలు 4,033 మంది. మొత్తం ఓట్ల విలువ 10,86,431. ఇందులో ఎంపీల ఓట్ల విలువ 5,43,200.  ఎమ్మెల్యేల ఓట్ల విలువ  5,43,231.  కొత్తగా రాజ్యసభ సభ్యులుగా చేరిన వారి పేర్లను జాబితాలో సవరిస్తామ‌‌ని రాజీవ్  కుమార్  స్పష్టం చేశారు. సీక్రెట్ బ్యాలెట్ విధానంలో ప్రాధాన్యతా ఓటు పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. ఓటును బహిర్గతం చేస్తే ఆ ఓటు చెల్లుబాటు కాదన్నారు. ఓటు సమయంలో ఎన్నికల సంఘం ప్రత్యేక పెన్ను ఏర్పాటు చేస్తుందని, దానితోనే ఓటు వేయాల్సి ఉంటుందన్నారు. వేరే పెన్ను ఉపయోగిస్తే ఆ ఓటు చెల్లదన్నారు. ఈ ఎన్నిక‌‌ల‌‌కు రాజ్యసభ సెక్రటరీ జనరల్  రిటర్నరింగ్ ఆఫీసర్‌‌గా వ్యవహరిస్తారని చెప్పారు. 

రూ. 15 వేలు డిపాజిట్​

రాష్ట్రపతిగా నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థిని కనీసం 50 మంది సభ్యులు ప్రతిపాదించాల్సి, మరో 50 మంది సమర్థించాల్సి ఉంటుంది. అలాగే క్యాండిడేట్ రూ. 15 వేలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే నామినేషన్ చెల్లుబాటు అవుతుంద‌‌ని రాజీవ్​ కుమార్​ స్పష్టం చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విప్ జారీ చేయడానికి వీల్లేదని పేర్కొన్నారు. ఓటు కోసం ముడుపులు ఇస్తే ఎన్నికలు చెల్లుబాటు కావని సుప్రీంకోర్టు తీర్పు చెబుతున్నదని ఆయన గుర్తు చేశారు. కొవిడ్​ –19 ప్రొటోకాల్ అమలుచేయడంతో పాటు పర్యావరణానికి నష్టం కలిగించే ఏ పదార్థాలను ఈ ఎన్నికల్లో ఉపయోగించకుండా ఏర్పాట్లు చేశామ‌‌న్నారు. పోలింగ్ ముగిసిన త‌‌ర్వాత అన్ని రాష్ట్రాల నుంచి బ్యాలెట్ బాక్స్ ల‌‌ను ఢిల్లీకి చేరుతాయ‌‌ని చెప్పారు. కాగా,  రాష్ట్రపతి ఎన్నికల్లో తెలంగాణకు అసిస్టెంట్ రిట‌‌ర్నింగ్ అధికారులుగా సీహెచ్ ఉపేంద‌‌ర్ రెడ్డి (జాయింట్ సెక్రటరీ, స్టేట్ అసెంబ్లీ), వీఎన్ ప్రస‌‌న్న కుమారీ (డిప్యూటీ సెక్రటరీ, స్టేట్ అసెంబ్లీ)ని కేంద్ర ఎన్నిక‌‌ల సంఘం నియ‌‌మించింది.  అసెంబ్లీ బిల్డింగ్ లోని క‌‌మిటీ హాల్ నెంబ‌‌ర్ 1 లో రాష్ట్రప‌‌తి ఎన్నికల పోలింగ్​ జరుగనుంది. 

ఎంపీ, ఎమ్మెల్యే ఓట్ల విలువ ఎంతంటే..?

  • రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన ఓట్ల విలువను లెక్కించడానికి 1971 జనాభా లెక్కలను ప‌‌రిగ‌‌ణ‌‌నలోకి తీసుకుంటారు.ఎంపీలు, ఎమ్మెల్యేలకు వేర్వేరు ఓటు విలువ‌‌లు ఉంటాయి. ఈ ఓటు విలువ వివిధ రాష్ట్రాల్లో ఉండే జ‌‌నాభా పై ఆధారపడి ఉంటుంది. ఎమ్మెల్యే ఓటు విలువ = రాష్ట్రం మొత్తం జ‌‌నాభా/ ఎన్నికైన మొత్తం ఎమ్మెల్యేల సంఖ్య x  1/1000.
  • ఎంపీ ఓటు విలువ = అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేల మొత్తం విలువ‌‌(28 రాష్ట్రాలు+3 కేంద్ర పాలిత ప్రాంతాలు)/  ఎన్నికైన ఎంపీల సంఖ్య.
  • ఉమ్మడి ఏపీలో ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ -148. ఇప్పుడు తెలంగాణలో ఎమ్మెల్యే ఓటు విలువ 132.
  • అత్యధికంగా యూపీ ఎమ్మెల్యే ఓటు విలువ 208, అతి త‌‌క్కువ‌‌గా సిక్కిం ఎమ్మెల్యే ఓటు విలువ 7. 

రాష్ట్రపతి ఎన్నికలో విశేషాలెన్నో..

  • రాష్ట్రపతి ఎన్నిల‌‌కు రొటేష‌‌న్ ప‌‌ద్ధతిలో లోక్ స‌‌భ  సెక్రట‌‌రీ జ‌‌న‌‌ర‌‌ల్, రాజ్య స‌‌భ సెక్రట‌‌రీ జ‌‌న‌‌ర‌‌ల్ రిట‌‌ర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. 
  •  ఎన్నికపై ఏదైనా వివాదం త‌‌లెత్తితే దాన్ని సుప్రీంలోనే స‌‌వాల్ చేయాల్సి ఉంటుంది.
  •  అయితే,  ఎల‌‌క్టోర‌‌ల్ కాలేజీలో ఖాళీ ఏర్పడినంత మాత్రాన దానిని కోర్టులో స‌‌వాల్ చేయ‌‌లేం. 1961 లో చేసిన‌‌ 11వ రాజ్యాంగ స‌‌వ‌‌ర‌‌ణ ఈ అంశాన్ని చెప్తున్నది. 
  • ఇప్పటివరకు 15 సార్లు రాష్ట్రపతి ఎన్నికలు జరుగగా.. 1977 లో నీలం సంజీవరెడ్డి మాత్రమే ఏక‌‌గ్రీవంగా ఎన్నిక‌‌య్యారు.  ఈ ఎన్నిక‌‌ల్లో 37 మంది నామినేష‌‌న్ దాఖ‌‌లు చేయ‌‌గా.. 36 మంది నామినేష‌‌న్లను రిట‌‌ర్నింగ్ అధికారి రిజెక్ట్ చేశారు.
  • కొత్త రాష్ట్రపతితో సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ప్రమాణం చేయిస్తారు. ఒక‌‌వేళ రాష్ట్రపతి రాజీనామా చేయాల్సి వ‌‌స్తే, ఉప రాష్ట్రపతికి రాజీనామా లేఖ అందించాల్సి ఉంటుంది. 
  • అతి త‌‌క్కువ కాలం రాష్ట్రపతిగా జాకీర్ హుస్సేన్  సేవ‌‌లందించారు. (1967–69)
  • ఇప్పటివరకు ఆరుగురు వైస్​ప్రెసిడెంట్లకు ప్రెసిడెంట్లుగా అవ‌‌కాశం ద‌‌క్కింది.
  • తొలి మ‌‌హిళా ప్రెసిడెంట్​గా ప్రతిభా పాటిల్​ పనిచేశారు.

పోలింగ్​లో పాల్గొనే సభ్యుల వివరాలు
ఎంపీలు (ఉభయ సభలు)     - 776
అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేలు  -   4,033
మొత్తం ఓటర్లు -  4,809
మొత్తం ఓట్ల విలువ‌‌...
ఎంపీలది  -  5, 43, 200
ఎమ్మెల్యేలది  -  5,43, 231
మొత్తం ఓట్ల విలువ - 10, 86, 431
రాష్ట్రపతి ఎన్నిక‌‌ల‌‌ షెడ్యూల్ ....
నోటిఫికేష‌‌న్  -  జూన్ 15   
నామినేష‌‌న్ దాఖ‌‌లుకు చివ‌‌రి తేది    జూన్ 29
నామినేష‌‌న్ల ప‌‌రిశీల‌‌న -  జూన్ 30 
నామినేష‌‌న్ల విత్ డ్రా  - జులై 2
పోలింగ్  - జులై 18
ఓట్ల లెక్కింపు - జులై 21