కాళేశ్వరంపై ఇప్పుడెందుకు మాట్లాడ్తలేవ్?

కాళేశ్వరంపై ఇప్పుడెందుకు మాట్లాడ్తలేవ్?

మక్తల్, వెలుగు :  కాళేశ్వరం మహా అద్భుతమన్న సీఎం కేసీఆర్ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ గురించి ఎందుకు మాట్లాడడం లేదని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు మునిగిందో కేసీఆర్ కు దమ్ముంటే  సీబీఐతో దర్యాప్తు చేయించాలని ఆమె డిమాండ్​ చేశారు. ప్రాజెక్ట్  సైడ్ వాల్స్ ఎందుకు కూలిపోయాయో, పంపుహౌజ్ లు మునిగి ఎంత  నష్టం వాటిల్లిందో కేసీఆర్​ సమాధానం చెప్పాలన్నారు. తన పాదయాత్రలో భాగంగా షర్మిల శుక్రవారం నారాయణపేట జిల్లా లింగంపల్లి, ఉప్పర్​పల్లి మీదుగా మక్తల్​ పట్టణానికి చేరుకున్నారు. మక్తల్​లో జరిగిన బహిరంగ సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో 80 శాతం ప్రాజెక్టులను మేఘా కృష్ణారెడ్డికే ఇచ్చారని, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో రూ.70 వేల కోట్ల అవినీతి జరిగిందని ఓ జీఎస్టీ  డైరెక్టర్ రిపోర్ట్ ఇచ్చినా ఇప్పటికీ చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.

ఈ ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై తాము మాత్రమే మాట్లాడుతున్నామని చెప్పారు. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా పచ్చగా ఉండాలని వైఎస్​ఆర్​ కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్ట్ లు ప్రారంభించి 80 శాతం పనులు పూర్తి చేశారని, మిగిలిన పనులను కూడా కేసీఆర్  పూర్తి చేయలేదని విమర్శించారు. రూ.35 వేల కోట్లతో పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు చేపడితే కేసీఆర్ ఆ వ్యయాన్ని రూ.55 వేల కోట్లకు పెంచారన్నారు. కమీషన్ల కోసమే కాళేశ్వరంపై శ్రద్ధ పెట్టారని, అందుకే పాలమూరు ప్రాజెక్ట్ అటకెక్కిందన్నారు. అభివృద్ధి పేరు చెప్పి పార్టీ మారిన మక్తల్ ఎమ్మెల్యే.. భూ కబ్జాలు, ఇసుక దందాల కోసం పోలీసులను ఎమ్మెల్యే కుక్కల్లా వాడుకొంటున్నారని ఫైర్​ అయ్యారు.