లిక్కర్​ బ్యాన్​తో మహిళలపై నేరాలకు అడ్డుకట్ట

లిక్కర్​ బ్యాన్​తో మహిళలపై నేరాలకు అడ్డుకట్ట

ఎన్నో కఠిన చట్టాలు తెచ్చినా చివరికి ఎన్ కౌంటర్లు చేసినా మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు ఆగడం లేదు. నిత్యం దేశంలో ఏదో చోట లైంగిక దాడులు, అత్యాచారాలు, హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అసలు వీటికి మూల కారణాలు ఏమిటి? ఇలాంటివి పునరావృతం కాకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఎలాంటి విధివిధానాలు రూపొందించుకోవాలి? వీటిలో తల్లిదండ్రుల పాత్ర ఎంత? అనేది చాలా కీలకం. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను పరిశీలిస్తే ప్రతి కేసులోనూ మద్యం మత్తులో దాడులు జరిగినట్టు పోలీసులు మీడియా ముందు చెబుతున్న పరిస్థితి. కొన్ని కేసుల్లో మద్యం, డ్రగ్స్, గుట్కా, సిగరెట్ లాంటి వాటికి బానిసగా మారి ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని చెబుతున్నారు. మహిళలపై లైంగిక దాడులను అరికట్టాలంటే ముందుగా సంపూర్ణ మద్యనిషేధం అమలు చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బెల్టుషాపులు కొనసాగుతున్నాయి. ఈ బెల్టు షాపుల వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని యువత మద్యానికి బానిసైపోతోంది. గ్రామాల్లో మద్యం ఏరులై పారుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. గ్రామాలు దేశానికి పట్టుగొమ్మలని చెప్పడమే తప్ప ఆచరణలో మాత్రం వాటిని అభివృద్ధి చేసే ఆలోచన పాలకులకు లేదు. రాజకీయ నాయకులు తమ ఉనికిని కాపాడుకోవడానికి గ్రామాల్లో ప్రజలకు నిత్యం అవసరమయ్యే విద్య, వైద్యం, కూడు, గూడు, గుడ్డ లాంటివి పక్కన పెట్టేసి మద్యాన్ని మాత్రం ఏరులై పారిస్తున్నారు. వీటితో పాటు ఇంటర్నెట్​లో విచ్చలవిడిగా అందుబాటులో ఉన్న అశ్లీల దృశ్యాలు, పోర్న్​ సైట్లను తొలగించాలి. మత్తు పదార్థాలను నియంత్రించేందుకు కఠిన చర్యలు తీసుకోవాలి. వీటి ద్వారా ఇలాంటి ఘటనలను కొంత మేరకైనా నివారించవచ్చు.
                                                                                                                                                                      - ఎం.సత్యనారాయణ, హైదరాబాద్