మేడారం అభివృద్ధిని గత పాలకులు పట్టించుకోలేదు ..పూజారులు, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా మార్పులు

మేడారం అభివృద్ధిని  గత పాలకులు పట్టించుకోలేదు ..పూజారులు, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా మార్పులు
ములుగు, వెలుగు : మేడారం జాతరను గత పాలకులు పట్టించుకోలేదని మంత్రి సీతక్క విమర్శించారు. ప్రస్తుత సీఎం రేవంత్‌‌రెడ్డి మేడారంపై స్పెషల్‌‌ ఫోకస్‌‌ పెట్టారని, ఇందులో భాగంగా ఇక్కడ జరుగుతున్న పనుల పరిశీలన కోసం ఈ నెల 13 లేదా 14న స్వయంగా రానున్నారని చెప్పారు. మంత్రి సీతక్క బుధవారం ములుగులో మీడియాతో మాట్లాడారు. పూజారులు, భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా గద్దెల మార్పులు చేస్తామన్నారు. 

ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలకు అద్దంపట్టేలా పనులు చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు. ఈ విషయంపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారంచేస్తున్నారని మండిపడ్డారు. గత జాతరల టైంలో భక్తులకు ఎదురైన సమస్యలను పరిష్కరించాలన్న ఉద్దేశంతోనే మార్పులు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతీ జాతరకు భక్తుల సంఖ్య పెరుగుతున్నందున ట్రాఫిక్‌‌, దర్శనం టైంలో ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. 

ములుగు మండలం మదనపల్లిలో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేశారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో భాగంగానే అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం ములుగు మున్సిపాలిటీ పరిధిలోని మాధవరావుపల్లిలో ఆత్మహత్య చేసుకున్న మైదం మహేశ్‌‌ ఫ్యామిలీని పరామర్శించి, ముగ్గురు పిల్లల పేరున రూ.4 లక్షల ఫిక్స్‌‌డ్‌‌ డిపాజిట్ చేసిన పేపర్స్‌‌ను అందజేశారు.