గిరిజన వికాసం: గత ప్రభుత్వం అడవి బిడ్డలను పట్టించుకోలేదు..కాంగ్రెస్​ ప్రభుత్వం గిరిజనుల సమస్యలపై ఫోకస్

గిరిజన వికాసం: గత ప్రభుత్వం అడవి బిడ్డలను పట్టించుకోలేదు..కాంగ్రెస్​ ప్రభుత్వం గిరిజనుల సమస్యలపై ఫోకస్

తరతరాలుగా అడవి తల్లి ఇచ్చిన ఉత్పత్తులను అమ్ముకొని జీవితాలు గడపడమే ఇన్నేళ్లుగా గిరిజన బిడ్డలకు మిగిలింది.  గిరిజన రైతుల జీవితాల్లో మార్పులు తీసుకురావాలన్న ఆలోచనల్లో భాగంగా సోనియా గాంధీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2006లో రికగ్నైజేషన్​ ఆఫ్​ ఫారెస్ట్​ రైట్స్​  చట్టాన్ని తీసుకువచ్చారు. 

2008 నాటికి దేశవ్యాప్తంగా ఈ పథకం అమలుకు సంబంధించి పూర్తి రోడ్ మ్యాప్​ను ఖరారు చేశారు.  కేంద్రం తెచ్చిన కొత్త చట్టాన్ని అందిపుచ్చుకోవాలనే ఆలోచనతో నాటి సీఎం రాజశేఖర్ రెడ్డి 2008లో 3 లక్షల ఎకరాల్లో సాగు చేసుకుంటున్న 90 వేల మంది పోడు రైతులకు  భూమిహక్కు పత్రాలు రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేశారు. 

ఈ భూములను అభివృద్ధి చేసేందుకు గిరి వికాసం పేరిట ఆనాడు ఓ పథకాన్ని అమలులోకి తెచ్చారు. అయితే, అటవీ భూముల్లో వందల అడుగుల్లో బోర్లు వేయడం, త్రీ ఫేస్ విద్యుత్తు లైన్లు వేయడానికి అడవి అధికారులు అడ్డంకులు చెబుతూ వచ్చారు. ఫలితంగా నాడు గిరిజనుల ఆశలు పూర్తిస్థాయిలో ఫలించలేదు.   

ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని పూర్తిగా పక్కన పడేసింది.  ఈనేపథ్యంలో  డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఎస్​టీఎస్​డీఎఫ్​ నోడల్ సమావేశాలు నిర్వహిస్తూ గిరిజనుల సమస్యలపై  అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఇందిర సౌర గిరి జల వికాసం

పోడు రైతులకు పట్టాలు ఇచ్చినప్పటికీ వారి భూములకు నీరు, విద్యుత్ సౌకర్యం లేకపోవడం మూలంగా అవి నిరుపయోగంగా ఉన్నాయని, ఆ సౌకర్యాలు కల్పించాలంటూ పోడు రైతులు కోరుతున్నట్టు అధికారులు డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకువచ్చారు. దీంతో  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో  పరిశీలించారు.  

ఉమ్మడి ఖమ్మం జిల్లా పాల్వంచ సమీపంలో 80 మంది రైతులు రెడ్ కో  సహకారంతో సోలార్ విద్యుత్ ఆధారంగా పంటలు సాగు చేస్తున్నారని అధికారులు వివరించారు.  వారు వరుసగా మూడేళ్లపాటు మంచి ఫలితాలు సాధించినా ఆ తర్వాత  నిర్వహణ లోపాలతో సాగు తగ్గినట్టు నివేదించారు.  ఈక్రమంలో  డిప్యూటీ సీఎం ఆదేశం మేరకు గిరిజన శాఖ అధికారులు అటవీశాఖ ఉన్నతాధికారులతో పలుమార్లు భేటీ నిర్వహించారు.  సోలార్ ద్వారా విద్యుత్ సౌకర్యం కల్పించడం, సోలార్ పంప్ సెట్ల వినియోగానికి ఎక్కువలో ఎక్కువగా 200 అడుగులకు మించి బోర్లువేసే అవకాశము ఉండదని గిరిజన అధికారులు అటవీశాఖ అధికారులకు వివరించారు. 

అటవీ విస్తీర్ణాన్ని కాపాడేందుకు దోహదపడే అవకాడో, వెదురు, పామాయిల్ వంటి పంటలే పోడు రైతుల ద్వారా సాగు చేయిస్తామని సమావేశంలో వివరించారు. ఈ పద్ధతుల్లో అయితే తమకు ఎలాంటి ఇబ్బంది లేదంటూ అటవీశాఖ అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.  పోడు రైతుల ఇబ్బందులను పరిష్కరించేందుకు  ఉన్న అవకాశాలు డిప్యూటీ సీఎం సీఎం రేవంత్ రెడ్డికి వివరించగా ముందుకు వెళ్లాలంటూ సూచించడంతో ప్రక్రియ వేగవంతమైనది. ఫలితంగా పోడు రైతులకు సాగు క్రమంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోయాయి. ఇందిర సౌర గిరిజన వికాసం పథకం పురుడు పోసుకుంది.

సాగులోకి 6 లక్షల ఎకరాల పోడుభూములు

గిరిజనులు అత్యధికంగా ఉండే ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు వారి జీవన స్థితిగతులపై పూర్తి అవగాహన ఉంది. పట్టాలు ఉన్నప్పటికీ సాగు చేసుకునేందుకు వెళితే గత 10 సంవత్సరాలు పాలించిన నాయకులు మహిళలని కూడా చూడకుండా వారిని చెట్టుకు కట్టేసి కొట్టారని ఫొటోలు, వీడియోలతో సహా పాదయాత్ర సమయంలో డిప్యూటీ సీఎంకు చూపించి ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనులకు పూర్తి సహకారం అందిస్తామని వాగ్దానం చేశారు. 

 ప్రభుత్వమే పూర్తిగా ఉచితంగా సోలార్ ద్వారా బోరు వేయించడం, విద్యుత్తు, పంపుసెట్లు ఏర్పాటుచేసి నీటి సౌకర్యం కల్పిస్తూ గిరిజన రైతులు సాగు చేసుకునేందుకు పామాయిల్, అవకాడో,   వెదురు వంటి మొక్కలను ఉద్యాన శాఖ ద్వారా ఉచితంగా అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. చివరకు ఇందిర సౌర గిరి జల వికాసం పేరుతో ఓ బృహత్తర పథకాన్ని వెలుగులోకి తెచ్చారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్ మండలం మాచారంలో  ఈనెల 18న ఈ పథకానికి సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ప్రారంభించనున్నారు.

ఐదేండ్లలో రూ.12,600 కోట్ల ఖర్చు

 ఆరు లక్షల ఎకరాలకు ఇందిరా గిరి జల వికాసం పథకం అమలు చేయనున్నారు. ఈ పథకం కోసం వచ్చే ఐదు సంవత్సరాల్లో  రూ.12,600 కోట్లను ఖర్చు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సంవత్సరంలో రూ.600 కోట్లు ఖర్చు చేయనుండగా తదుపరి 4 సంవత్సరాల పాటు ఏడాదికి మూడు వేల కోట్ల చొప్పున ఖర్చు చేయనున్నారు. ఈ పథకం అమలుకు గిరిజనుల స్పెషల్ డెవలప్​మెంట్ ఫండ్​ను వినియోగించనున్నారు. 

ఈ పథకం కింద పోడు పట్టాలు పొందిన భూముల్లో బోర్లు వేయడం వాటికి సోలార్ పంపుసెట్లు అందించడం సహా గిరిజన రైతులు సాగు చేసుకునేందుకు అవసరమైన మొక్కలు ఉద్యాన శాఖ ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తారు.  రెండున్నర ఎకరాలు లేదా ఒక హెక్టార్ కంటే ఎక్కువ భూమి ఉన్న గిరిజన రైతులకు ఒక యూనిట్​ అందజేస్తారు. ఇంతకంటే తక్కువ భూమి ఉంటే కనుక సమీపంలోని రెండు నుంచి ఐదు మంది గిరిజన రైతులకు ఒక గ్రూప్​ఏర్పాటు చేసి యూనిట్ మంజూరు చేస్తారు.  అలాగే ఉపాధి హామీ పథకం కింద భూమిని అభివృద్ధి చేయడం, బోర్ వేసేందుకు సర్వే, బోరు బావుల తవ్వకం,  5 హెచ్ పి లేదా 7.5 హెచ్​పి సోలార్ పంపుసెట్లు సోలార్ ప్యానల్ ఏర్పాటు ద్వారా నీటి సౌకర్యం కల్పించడం, వ్యవసాయ శాఖ ద్వారా విత్తనాలు యంత్రాలు హార్టికల్చర్ శాఖ ద్వారా డ్రిప్పు స్ప్రింక్లర్ల సౌకర్యం ఏర్పాటు చేయనున్నారు.      

- మారబోయిన మధుసూదన్, సీపీఆర్ఓ టూ డిప్యూటీ సీఎం–