
ఢాకా: యాభై ఏండ్ల కిందట 1971 బంగ్లాదేశ్ యుద్ధంలో పాకిస్తాన్ కూల్చేసిన ఢాకా శ్రీ రమణ కాళీ ఆలయాన్ని మన ప్రెసిడెంట్ రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం ప్రారంభించారు. బంగ్లాదేశ్ ప్రెసిడెంట్ ఎం.అబ్దుల్ హమీద్ ఆహ్వానం మేరకు కోవింద్ ఆ దేశంలో పర్యటిస్తున్నారు. బంగ్లా ఇండిపెండెన్స్ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ టూర్లో భాగంగా ఇటీవల పునరుద్ధరించిన శ్రీరమణ కాళీ ఆలయాన్ని కోవింద్ ప్రారంభించారు. అంతకుముందు తన భార్య, ఫస్ట్ లేడీ సవితా కోవింద్‌తో కలిసి పూజలు చేశారు. తర్వాత బంగ్లాదేశ్‌లోని ఇండియన్లను ఉద్దేశించి మాట్లాడారు. ఇండియా, బంగ్లాదేశ్ కల్చరల్, స్పిరిచువల్ బంధానికి ఈ చారిత్రక ఆలయం చిహ్నమని కోవింద్ అన్నారు. కాళీమాత ఆశీస్సుల వల్లే గుడిని ప్రారంభించే గొప్ప గౌరవం దక్కిందన్నారు. లిబరేషన్ వార్ సందర్భంగా పాకిస్తాన్ చేతిలో ధ్వంసమైన ఆలయాన్ని బాగుచేసేందుకు ఇండియా, బంగ్లాదేశ్ ప్రభుత్వాలు, ప్రజలు సహకరించాయని తనకు తెలిసిందన్నారు. పాకిస్తాన్ ఆక్రమణల్లో జనం పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని ఆయన గుర్తుచేశారు.