గో రక్షణ చేపడుతున్న ఆలయ పూజారి

గో రక్షణ చేపడుతున్న ఆలయ పూజారి

ఆవుల పోషణ భారం కావడంతో చాలా మంది రైతులు వాటిని సాకడం లేదు. కబేళాలకు అమ్ముతున్నారు.  ఇలాంటి సమయంలో  ఒక పురోహితుడు రోడ్ల మీద ఉండే ఆవులను చేరదీసి.. వాటిని సంరక్షిస్తున్నాడు. వాటి కడుపులో పేరుకుపోయిన ప్లాస్టిక్​ వ్యర్థాలను బయటకి తీయించటమే కాకుండా.. ఏడేళ్లుగా వనపర్తిలో 120 ఆవులు, దూడల సంరక్షణ బాధ్యత తీసుకున్నారు.

వనపర్తి, వెలుగు: గోశాలలో పూజలు, హోమాల ద్వారా వచ్చే మొత్తాన్ని గోవుల సంరక్షణ కోసమే ఖర్చుపెడుతున్నాడు సౌమిత్రి రామాచార్యులు. వరంగల్​ జిల్లా స్టేషన్​ఘన్​పూర్​ మండలం తాటికొండ గ్రామానికి చెందిన సౌమిత్రి రామాచార్యులు.. వనపర్తిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో అర్చకత్వం చేసేందుకు ఇరవై ఏళ్ల క్రితం వచ్చారు. అయితే, జిల్లాలో వరుస కరువులు రావడంతో ఆవులను సంరక్షించలేక, వాటిని కబేళాలకు పంపించలేక.. చాలా మంది రైతులు  వేంకటేశ్వర స్వామి ఆలయానికి  దానంగా ఇచ్చారు. ఇలా దాదాపు వందకు పైగా ఆవులు ఆలయానికి చేరాయి.
ఒక రోజు రాత్రి.. పుట్టిన దూడలను బతికుండగానే వీధి కుక్కలు పీక్కు తినటం చూశారు రామాచార్యులు. దీంతో ఆవులను సంరక్షించాలనుకున్నారు.
తెలిసిన వాళ్ల నుంచి 2012లో పట్టణ శివారులో కొంత స్థలం సేకరించి అందులో  గోశాల ఏర్పాటు చేశారు. మున్సిపల్​, పోలీస్​ శాఖ ఆధ్వర్యంలో రక్షించిన ఆవులను ఇక్కడికి తరలించారు.
రైతుల నుంచి గడ్డి సేకరించి వాటికి మేత వేయడంతో పాటు ఆవులను సంరక్షించేందుకు నలుగురిని నియమించారు. అయితే, మేతకు తోలుకెళ్తున్నప్పుడు వీధుల్లో ఏది పడితే అది తినడం వల్ల కొన్ని ఆవుల జీర్ణ వ్యవస్థ పాడైపోయింది. పశువుల డాక్టరుకు చూపిస్తే.. ఆవుల కడుపుల్లో ప్లాస్టిక్​ వ్యర్థాలు పేరుకుపోయాయని తెలిసింది. దీంతో వాటికి ఆపరేషన్లు చేసి వాటిని తొలగించారు.

గోవుల దత్తత

గోశాలలో ఆవులు, కోడెలు ఎక్కువ కావడంతో వాటిని అవసరమైన రైతులకు దత్తత ఇచ్చేందుకు రామాచార్యులు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వాటిని సాకడానికి అన్ని వసతులు, వనరులు ఉన్న రైతులు ఐదు వేల రూపాయలు డిపాజిట్​ చేస్తే దత్తత ఇస్తున్నారు.

ఆవులను పాడి కోసం వినియోగించుకుంటూ.. కోడెలను వ్యవసాయ అవసరాలకు వాడుకునేలా ఒప్పందం కదుర్చుకుంటున్నారు.
అయితే, వీటిని  ఎట్టి పరిస్థితులలో అమ్మకూడదని, అవసరాలు తీరిన తర్వాత తిరిగి గోశాలలో వాటిని వదిలేసే విధంగా ముందుగానే ఒప్పందం చేసుకుంటున్నారు.

గోశాలకు మంచి రేటింగ్‌

వనపర్తి గోశాల దేశంలోని మెరుగైన గోశాలల్లో 40వ స్థానం దక్కించుకుం ది. ఇక్కడకు వచ్చిన ప్రతిసారి చినజీయర్ స్వామి గోశాలలో పూజలు చేస్తుం టారు. కంచి కామకోటి పీఠాధిపతి, అహోబిళ పీఠాధిపతి తదితరులు గోశాల నిర్వహణను అభినందిం చారు.

దాతలే గోశాల సభ్యులు

గోశాల నిర్వహణలో దాతలను  సభ్యులుగా చేర్చుకుంటున్నారు రామాచార్యులు. ఒక్కో గోవుకి ఏడాదికి అయ్యే ఖర్చుని భరించే దాతల పేరుతోనే ఆవుని పెంచుతున్నారు.  వారి ఇళ్లల్లో జరిగే శుభకార్యాల సందర్భంగా వాళ్ల పేరున గో పూజలు చేస్తున్నారు. వనపర్తి మున్సిపాలిటీ పరిధిలోని రాజనగరం శివారులో ఉన్న ఈ గోశాలను సందర్శించేందుకు చాలామంది వస్తుంటారు. మరి కొంతమంది గోశాలలో పూజలు, హోమాలు చేస్తుంటారు. ‘ఆవు మూత్రం, పేడతో జీవామృతం తయారు చేసే యూనిట్​ను  స్థాపించే ఆలోచన ఉంది. ఇప్పటికే డెభ్బై శాతం పశు సంపద మానవాళికి దూరమైంది. కాబట్టి ఆవులను సంరక్షించడం మనందరి బాధ్యత’ అంటారు రామాచార్యులు.