సరిహద్దుల్లో.. శాంతి ముఖ్యం 

సరిహద్దుల్లో.. శాంతి ముఖ్యం 
  • ఇండియా‑చైనా సంబంధాలపై ప్రధాని మోదీ

న్యూఢిల్లీ/యునైటెడ్ నేషన్స్: రెండు దేశాల మధ్య సంబంధాలు నిలబడాలంటే సరిహద్దుల్లో శాంతి, ప్రశాంతత ఎంతో ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘‘సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవించడం.. చట్టాలను పాటించడం.. విభేదాలు, వివాదాలను శాంతియుతంగా పరిష్కరించడంపై మాకు నమ్మకం ఉంది. అదే సమయంలో మా దేశ సార్వభౌమాధికారం, గౌరవాన్ని కాపాడుకోవడానికి మేం పూర్తి సిద్ధంగా ఉంటాం. కట్టుబడి ఉంటాం” అని స్పష్టం చేశారు. ఇండియా - చైనా సంబంధాలపై స్పందిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం అమెరికా పర్యటనకు బయల్దేరి వెళ్లిన ప్రధాని.. అంతకుముందు ‘వాల్‌‌ స్ట్రీట్ జర్నల్‌‌’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ‘‘ఇండియా ఏ దేశానికీ ప్రత్యామ్నాయం కాదు.. ప్రపంచంలో తనకు దక్కాల్సిన సరైన స్థానాన్ని పొందడమే లక్ష్యంగా పెట్టుకుంది” అని స్పష్టం చేశారు. అమెరికాతో సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంత బలంగా ఉన్నాయన్నారు. రెండు దేశాల నేతల మధ్య అపూర్వమైన నమ్మకం ఉందని చెప్పారు. ప్రపంచ వేదికపై మరింత ఉన్నతమైన, లోతైన, విస్తృతమైన స్థానం, పాత్ర ఇండియాకు ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు.

స్వతంత్ర భారతంలో తొలి ప్రధానిని

ఇండియా స్వాతంత్ర్యం పొందిన తర్వాత జన్మించి, ప్రధాని పదవిని చేపట్టిన తొలి వ్యక్తిని తానేనని మోదీ అన్నారు. ‘‘అందుకే నా ఆలోచనా విధానం, నా ప్రవర్తన, నేను చెప్పేవి, చేసేవి.. నా దేశం సంప్రదాయాల నుంచి ప్రేరణ పొందినవి, ప్రభావితమైనవి. నేను వాటి నుంచి బలాన్ని పొందుతాను. నా దేశం ఎలా ఉందో అలానే ప్రపంచానికి చూపుతాను.. అలానే నేనూ” అని వివరించారు. 

మేం శాంతి వైపు

రష్యా, ఉక్రెయిన్ యుద్ధంపై మోదీ స్పందిస్తూ.. ‘‘మేం న్యూట్రల్‌‌గా ఉన్నామని కొందరు అన్నారు. కానీ మేం తటస్థంగా లేము. మేము శాంతి వైపు ఉన్నాం. అంతర్జాతీయ చట్టాలను, దేశాల సార్వభౌమత్వాలను అన్ని దేశాలు గౌరవించాలి” అని స్పష్టం చేశారు. దౌత్యం, చర్చల ద్వారా వివాదాలని పరిష్కరించుకోవాలని, యుద్ధాల ద్వారా కాదని హితవు పలికారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌‌స్కీతో పలుమార్లు మాట్లాడినట్లు చెప్పారు. యుద్ధాన్ని ఆపేందుకు చేయగలిగినదంతా చేస్తామని తెలిపారు. శాశ్వతమైన శాంతి, స్థిరత్వం కోసం చేసే నిజమైన ప్రయత్నాలకు భారత్​ మద్దతిస్తుందని స్పష్టం చేశారు.

26/11 మృతులకు గుర్తుగా చెట్టు

మోదీ పర్యటన సందర్భంగా.. 26/11 ముంబై టెర్రర్ బాధితులకు గుర్తుగా ఒక చెట్టును ఐక్యరాజ్యసమితి అంకితం చేసింది. మూడవ ఐక్యరాజ్యసమితి తీవ్రవాద వ్యతిరేక వారోత్సవం సోమవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ‘యూఎన్ విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం సొలిడారిటీ ట్రీ’ని అంకితం చేశారు. యూఎన్ ప్రధాన కార్యాలయంలోని నార్త్‌‌ఈస్ట్ లాన్‌‌లో, మహాత్మా గాంధీ విగ్రహం పక్కన ఈ మొక్కను నాటారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు యూఎన్‌‌ను ప్రధాని సందర్శిస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఐక్యరాజ్యసమితి మారాలి

ఐక్యరాజ్యసమితి లాంటి ప్రపంచ సంస్థల్లో మార్పులు రావాల్సి ఉందని ప్రధాని అన్నారు. ‘‘కీలక సంస్థల్లో సభ్యత్వాన్ని చూడండి.. అవి నిజంగా ప్రజాస్వామ్య విలువల స్వరాన్ని సూచిస్తున్నాయా? ఆఫ్రికా లాంటి వాటికి వాయిస్ ఉందా? భారతదేశం ఇంత భారీ జనాభాను కలిగి ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన స్పాట్. కానీ ఇండియాకు సభ్యత్వం ఉందా?” అని ప్రశ్నించారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో (యూఎన్‌‌ఎస్‌‌సీ) కౌన్సిల్‌‌లో ప్రస్తుత సభ్యత్వంపై ఎవల్యూషన్ జరగాలని, భారతదేశం ఉండాలా వద్దా అనేదాన్ని ప్రపంచాన్ని అడగాలని అన్నారు.

ఇదో అవకాశం

ఇండియా, అమెరికా భాగస్వామ్యం వైవిధ్యాన్ని సుసంపన్నం చేయడానికి తన పర్యటన ఒక అవకాశమని ప్రధాని అన్నారు. ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవ డంలో రెండు దేశాలు కలిసి బలంగా ఉన్నాయని చెప్పారు. ప్రెసిడెంట్ బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ నుంచి అందిన ప్రత్యేక ఆహ్వానం.. రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య భాగస్వామ్య శక్తి, చైతన్యానికి ప్రతిబింబమని చెప్పారు. ఈ టూర్​లో బిజినెస్ లీడర్లను కలిసే అవకాశం దొరకుతుందని, ఇండియన్ కమ్యూనిటీతో ఇంటరాక్ట్ అవుతానని మోదీ ట్వీట్ చేశారు.

ఎలాన్‌‌‌‌‌‌‌‌ మస్క్‌‌‌‌తో  భేటీ కానున్న మోదీ!

తన పర్యటనలో 25 మందికి పైగా కీలక వ్యక్తులను ప్రధాని కలుసుకోనున్నారు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్, ఆస్ట్రోఫిజిసిస్ట్ నీల్ డిగ్రేసీ టైసన్, నోబెల్ బహుమతి గ్రహీత పౌల్ రూమెర్ తదితరులతో భేటీ కానున్నారు. నికోలస్ నస్సిమ్ తాలెబ్, ఇన్వెస్టర్ రే దాలియో, ఫాలు షా, జెఫ్ స్మిత్, మైఖేల్ ఫ్రోమన్, డేనియల్ రస్సెల్, ఎల్‌‌‌‌బ్రిడ్జ్ కోల్బీ, పీటర్ అగర్, స్టీఫెన్ క్లాస్కో, చంద్రికా టాండన్ తదితరులతో ప్రధాని సమావేశం కానున్నారని అధికారులు తెలిపారు. .