ఎర్రకోటపై రెపరెపలాడిన త్రివర్ణ పతాకం.. 12వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధాని మోడీ

ఎర్రకోటపై రెపరెపలాడిన త్రివర్ణ పతాకం.. 12వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: ఎన్నో త్యాగాల ఫలితమే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అని, స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు నివాళులర్పిస్తున్నానని ప్రధాని మోడీ అన్నారు. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎర్రకోటపై ప్రధాని మోడీ శుక్రవారం (ఆగస్ట్ 15) జాతీయ జెండా ఎగరేశారు. తద్వారా ఎర్రకోటపై అత్యధిక సార్లు (12వ సారి) మువ్వెన్నెల జెండా ఎగరేసిన మూడో ప్రధానిగా రికార్డ్ సృష్టించారు. 

అంతకుముందు ఆయన రాజ్ ఘాట్‎లో నివాళులర్పించి అనంతరం ఎర్రకోటకు చేరుకున్నారు. రెడ్ ఫోర్టులో ప్రధానికి త్రివిధ దళాలు గౌరవ వందనం చేశాయి. అనంతరం మోడీ జాతీయ జెండా ఎగరేశారు. తర్వాత అమర వీరులకు నివాళిగా భారత భద్రతా దళాలు ఎంఐ-17 హెలికాప్టర్‌తో ఎర్రకోటపై పూల వర్షం కురిపించాయి. అనంతరం మోడీ జాతినుద్దేశించి ప్రసంగించారు.

సమైక్య భావంతో దేశం ఉప్పొంగే, ప్రతి ఇంటిపై మువ్వెన్నెల జెంగా ఎగిరే సమయమిదన్నారు. ఇది 140 కోట్ల మంది సంకల్ప పండుగ అని పేర్కొన్నారు. ఒకే దేశం.. ఒకే రాజ్యాంగం కలను సాకారం చేశామన్నారు. ప్రపంచంలోని మన శ్రేయోభిలాషులందరికి అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. ప్రకృతి విపత్తులో అసువులుబాసిన వారికి నివాళులర్పిస్తున్నానన్నారు. దేశ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నామని చెప్పారు.