కాంగ్రెస్​ పాలనలో నార్త్ఈస్ట్ ను పట్టించుకోలే : మోదీ

కాంగ్రెస్​ పాలనలో నార్త్ఈస్ట్ ను పట్టించుకోలే : మోదీ
  •     మేం గత 5 ఏండ్లలోనే ఎంతో అభివృద్ధి చేసినం: మోదీ
  •     అదే అభివృద్ధి కాంగ్రెస్ చేయాలంటే 20 ఏండ్లు పట్టేది 
  •     బెంగాల్ లో ఫేక్ కార్డులతో ఉపాధి నిధుల దోపిడీ

ఈటానగర్/కజిరంగ/సిలిగురి: ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధిని కాంగ్రెస్ విస్మరించిందని ప్రధాని మోదీ మండిపడ్డారు. తమ ప్రభుత్వం వచ్చాకే ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ‘‘మేం నార్త్ ఈస్ట్ రీజియన్ లో గత ఐదేండ్లలో ఎంతో అభివృద్ధి చేశాం. ఈ అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ కు అయితే 20 ఏండ్లు పట్టేది” అని విమర్శించారు. శనివారం అరుణాచల్ ప్రదేశ్ లోని ఈటానగర్ లో నిర్వహించిన ‘‘వికసిత్ భారత్.. వికసిత్ నార్త్ ఈస్ట్” ప్రోగ్రామ్ లో మోదీ పాల్గొన్నారు. 

మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ లో చేపట్టిన రూ.55,600 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అరుణాచల్ లో నిర్మించిన ప్రతిష్టాత్మక సేలా టన్నెల్ ను జాతికి అంకితమిచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ..  ‘‘కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు బార్డర్ ఏరియాల్లో అభివృద్ధిని విస్మరించింది. సేలా టన్నెల్ ను ఎప్పుడో కట్టి ఉండొచ్చు. కానీ కట్టలేదు. 

వాళ్ల ప్రాధాన్యాలు వేరుగా ఉండేవి. ‘అరుణాచల్ లో రెండే లోక్ సభ సీట్లు ఉన్నయ్.. అలాంటప్పుడు అంత అభివృద్ధి చేయాల్సిన అవసరమేముంది?’ అన్నట్టుగా కాంగ్రెస్ తీరు ఉండేది” అని విమర్శించారు. ‘‘ఎవరైనా అరుణాచల్ ప్రదేశ్ ను సందర్శిస్తే నేనిచ్చిన గ్యారంటీ ఏంటో స్పష్టంగా చూడొచ్చు. ‘మోదీ గ్యారంటీ’ ఎలా అమలవుతున్నది అనేది నార్త్ ఈస్ట్ మొత్తం ఇప్పుడు చూస్తున్నది” అని పేర్కొన్నారు. ‘‘2019లో సేలా టన్నెల్ కు నేను శంకుస్థాపన చేసినప్పుడు ‘ఎలక్షన్ అజెండా’ అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. కానీ అది తప్పు అని ఇప్పుడు రుజువైంది” అని పేర్కొన్నారు. 

బెంగాల్ లో అవినీతి సర్కార్.. 

కేంద్రం ఇస్తున్న ఉపాధి హామీ పథకం నిధులను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దోచుకుంటున్నదని మోదీ ఆరోపించారు. ఇందుకోసం టీఎంసీ ఫేక్ జాబ్ కార్డులను సృష్టించిందని ఫైర్ అయ్యారు. శనివారం రాష్ట్రంలోని సిలిగురిలో నిర్వహించిన సభలో మోదీ మాట్లాడారు. రూ.4,500 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.

చైనా బార్డర్ కు దగ్గర్లో అరుణాచల్ ప్రదేశ్ లో నిర్మించిన సేలా టన్నెల్ ప్రపంచంలోనే పొడవైన రెండు వరుసల టన్నెల్. దీన్ని కీలకమైన తవాంగ్ సెక్టార్ లో రూ.825 కోట్లతో బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్వో) నిర్మించింది. ఇది అస్సాంలోని తేజ్ పూర్, అరుణాచల్ లోని తవాంగ్ ను కలుపుతుంది. కీలకమైన సమయాల్లో బార్డర్ కు ఆయుధాలు, ఆర్మీని త్వరగా తరలించేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇందులో సింగిల్ ట్యూబ్ టన్నెల్ పొడవు కిలోమీటర్. రెండో టన్నెల్ లో రెండు సొరంగాలు ఉంటాయి. దీని పొడవు ఒకటిన్నర కిలోమీటర్. ఇందులో ఒకటి వెహికల్స్ కు, ఇంకొకటి ఎమర్జెన్సీ సర్వీసులకు కేటాయించారు. రెండింటి మధ్య 1,200 మీటర్ల లింక్ రోడ్డు ఉంది. ఈ టన్నెల్ ను సముద్ర మట్టానికి 13 వేల అడుగుల ఎత్తులో నిర్మించారు. 

జోర్హాట్ లో బర్ఫుకన్ విగ్రహం.. 
 
మొఘల్ సేనలపై పోరాడిన అస్సాం యోధుడు లచిత్ బర్ఫుకన్ 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని జోర్హాట్ లో మోదీ ఆవిష్కరించారు. రాష్ట్రంలో రూ.17,500 కోట్ల విలువైన పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.  అస్సాం పర్యటనలో ప్రధాని మోదీ సరదాగా గడిపారు. శనివారం ఉదయం ఆయన కజిరంగ నేషనల్ పార్క్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఏనుగు ఎక్కి ఎంజాయ్ చేశారు. ఏనుగులకు చెరుకు గడలు తినిపించారు. 

అక్కడి మహిళా సిబ్బందితో మాట్లాడారు. అనంతరం జీపులో జంగిల్ సఫారీకి వెళ్లారు. అభయారణ్యంలో పులి, జింక, ఖడ్గమృగం, వివిధ రకాల పక్షులను ప్రధాని చూసినట్టు అధికారులు తెలిపారు. ఆయన దాదాపు రెండు గంటల పాటు పార్క్ లో ఉన్నట్టు చెప్పారు. అలాగే పార్క్ కు దగ్గర్లోని తేయాకు తోటకు కూడా మోదీ వెళ్లారు. అద్భుతమైన తేయాకు తోటలకు అస్సాం ప్రసిద్ధి చెందిందని, అస్సాం టీ ప్రపంచమంతటా వ్యాపించిందని ప్రధాని కొనియాడారు.