కాంగ్రెస్ ఉండొద్దని.. గాంధీనే కోరుకున్నడు

కాంగ్రెస్ ఉండొద్దని.. గాంధీనే కోరుకున్నడు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ లేకుంటే దేశ పరిస్థితి ఏమయ్యేదని పలువురు చేసిన వ్యాఖ్యలను మోడీ రాజ్యసభలో ఉటంకించారు. ఇండియా అంటే ఇందిర, ఇందిర అంటే ఇండియా లాంటి కామెంట్స్ పై ఆయన తనదైన శైలిలో స్పందించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని తీసేయాలని జాతిపిత మహాత్మా గాంధీ కోరుకున్నారని మోడీ గుర్తు చేశారు. గాంధీ కోరుకున్నట్లు కాంగ్రెస్ ఉండకపోతే.. కుటుంబ పాలన నుంచి ప్రజాస్వామ్యానికి విముక్తి లభించేదన్నారు. 

కాంగ్రెస్ లేకుంటే.. ఇన్ని ఇక్కట్లు ఉండేవి కాదు

‘కాంగ్రెస్ లేకుంటే ఎమర్జెన్సీ ఉండేది కాదు. అవినీతి వ్యవస్థాగతంగా పాతుకుపోయేది కాదు. ఆ పార్టీ లేకుంటే సిక్కుల మారణకాండ ఉండేది కాదు. ఏళ్లకు ఏళ్లు పంజాబ్ తీవ్రవాదంతో అట్టుడికేది కాదు. కశ్మీరీ పండిట్లు తమ జన్మభూమిని వదిలివెళ్లాల్సి వచ్చేది కాదు. ఇల్లు, కరెంటు, నీళ్లు, రోడ్లు లాంటి మౌలిక సదుపాయాల కోసం సామాన్య ప్రజలు ఇన్నేళ్లు వేచి ఉండాల్సిన అవసరం ఉండేది కాదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు దేశాన్ని అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు మేం డెవలప్ మెంట్ చేస్తుంటే.. ప్రతిపక్షంలో ఉండి అడ్డంకులు సృష్టిస్తున్నారు’ అని కాంగ్రెస్ పార్టీపై మోడీ విమర్శలు గుప్పించారు.  

కాంగ్రెస్ పేరు మార్చాలె

‘కాంగ్రెస్ కు దేశం మీద కూడా ఏవో అభ్యంతరాలు ఉన్నట్లున్నాయి. భారత్ అనే ఊహ రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని కాంగ్రెస్ అంటోంది. అలాంటప్పుడు ఆ పార్టీ పేరు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని ఎందుకు పెట్టారో చెప్పాలి? ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు పార్టీ పేరును ఫెడరేషన్ ఆఫ్ కాంగ్రెస్ గా మార్చుకోవాలి. మీ పార్టీ మాజీ నేతలు చేసిన తప్పులను మీరు సరిచేయండి’ అని మోడీ వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ పై ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు అభ్యంతరం తెలిపారు. దీంతో సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. 

తెలుగు రాష్ట్రాల విభజన తీరు సరికాదు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తీరుపై కూడా రాజ్యసభలో మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఏపీని విభజించే సమయంలో పార్లమెంటులో మైకులు కట్ చేశారు. తలుపులు మూసేశారు. మిర్చి స్ప్రే చేశారు. ఎలాంటి చర్చా జరగలేదు. ఈ తీరు సరైనదేనా? ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? అటల్ జీ ప్రభుత్వం కూడా మూడు రాష్ట్రాల (ఛత్తీస్ గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్)ను ఏర్పాటు చేసింది. ఆ ప్రక్రియ శాంతియుతంగా జరిగింది. అందరూ కలసి చర్చించి, నిర్ణయాలు తీసుకున్నారు. ఆంధ్ర, తెలంగాణ విషయంలోనూ ఇలాగే జరిగి ఉండాల్సింది. మేం తెలంగాణ వ్యతిరేకులం కాదు. కానీ కాంగ్రెస్ అహంకారం వల్లే అప్పుడు కఠిన పరిస్థితుల మధ్య రాష్ట్ర విభజన జరిగింది. దాని వల్ల ఇప్పటికీ ఏపీ, తెలంగాణలు పలు సమస్యలను ఎదుర్కొంటున్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ కు దాని వల్ల రాజకీయంగానూ ఒరిగిందేమీ లేదు. 

మరిన్ని వార్తల కోసం:

బిగ్ బాస్ ఫేం సరయు అరెస్ట్

పేదల కోసం ఎంత ఖర్చు చేసేందుకైనా రెడీ

వారసత్వ రాజకీయాలను దాటి కాంగ్రెస్ ఆలోచించట్లే