మీలో నాకు దేవుడు కనిపిస్తున్నాడు: దీపా షా

మీలో నాకు దేవుడు కనిపిస్తున్నాడు: దీపా షా
  • కరోనాపై పుకార్లు నమ్మవద్దని పిలుపు
  • డాక్టర్ల సూచనలు పాటిస్తే చాలని వెల్లడి
  • షేక్ హ్యాండ్ వద్దని.. నమస్తే పెట్టడాన్ని మళ్లీ ప్రారంభించాలని విజ్ఞప్తి
  • జన్ ఔషధి దివస్ లో ప్రధాని భావోద్వేగం

ఎప్పుడూ హుషారుగా కనిపించే ప్రధాని నరేంద్ర మోడీ కంటతడిపెట్టారు. ఎప్పుడూ గంభీరంగా వినిపించే ఆయన గొంతు కొన్ని క్షణాలు మూగబోయింది. మాటల ప్రవాహం ఒక్కసారిగా ఆగిపోయింది. కారణం.. ఓ మహిళ చెప్పిన మాటలు.. అవి ఆయన గుండెను కదిలించింది. కన్నీళ్లను తెప్పించాయి.‘నేను దేవుడిని చూడలేదు.. కానీ మీలో దేవుడిని చూశాను” అని ఆమె అనగానే ప్రధాని ఎమోషనల్ అయ్యారు. గద్గద స్వరంతో బదులిచ్చారు. తల దించుకుని తనను తను సముదాయించుకున్నారు.

మీ గొంతు విన్నాక ఇంకా బాగయ్యా…

జన్ ఔషధి దివస్ సందర్భంగా శనివారం ఢిల్లీలో ఓ కార్యక్రమం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్‌‌ ద్వారా జన ఔషధి కేంద్రాల యజమానులు, ప్రధాన మంత్రి జన ఔషధి పరియోజన(పీఎంబీజేపీ) లబ్ధిదారులతో మాట్లాడారు. డెహ్రాడూన్‌‌కు చెందిన దీపా షా ఈ సందర్భంగా తన పరిస్థితిని వివరించారు. ‘‘నాకు 2011లో పక్షవాతం వచ్చింది. నేను మాట్లాడలేకపోయేదాన్ని. హాస్పిటల్‌లో చేరాను. మందులు చాలా ఖరీదైనవి. నేను ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధి పరియోజన ద్వారా మందులు తీసుకోవడం మొదలుపెట్టాను. గతంలో నా మందుల కోసం రూ.5,000 ఖర్చయ్యేది. ఇప్పుడు ఈ పథకం ద్వారా రూ.1,500 మాత్రమే ఖర్చవుతోంది. దాదాపు 3,500 మిగులుతోంది. ఆదా అయిన డబ్బుతో పండ్లు, ఇతర వస్తువులు కొంటున్నా’’ అని తెలిపారు. ‘‘నేను దేవుడిని చూడలేదు. కానీ మీలో నాకు దేవుడు కనిపిస్తున్నాడు. ఇప్పుడు మీ గొంతు విన్నాక నేను ఇంకా బాగయ్యాను” అని చెబుతూ దీప కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా మోడీ కూడా ఎమోషనల్ అయ్యారు. కొన్ని క్షణాలపాటు తల దించి తనను తాను సంబాళించుకున్నారు. ఆమె మాటలు శ్రద్ధగా విన్నారు. ‘‘ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రితోపాటు నాకు సాయం చేసిన వారందరికీ థ్యాంక్స్ చెబుతున్నా. ఒకానొక సందర్భంలో డాక్టర్లు కూడా నేను బతకనని చెప్పారు. కానీ బతికాను.. జనరిక్ మందుల వల్ల నా ఖర్చులు కూడా తగ్గాయి” అని దీప వివరించారు.

జనరిక్ మందులపై రూమర్లు నమ్మకండి

‘మీ సంకల్ప శక్తితోనే వ్యాధిని ఓడించారు. మీ ధైర్యమే మీ దేవుడు’’ అని దీపను ఉద్దేశిస్తూ మోడీ అన్నారు. జనరిక్ మందులపై వస్తున్న రూమర్లను నమ్మవద్దని ప్రజలను కోరారు. ‘‘జనరిక్ మెడిసిన్లపై కొందరు పుకార్లు వ్యాప్తి చేస్తూ ఉంటారు. ‘జనరిక్ మెడిసిన్లలో ఏదో మోసం ఉంటేనే అంత తక్కువ ధరకి అమ్ముతున్నారు’ అని నోటికొచ్చినట్లు చెబుతుంటారు. జనరిక్ మెడిసిన్లు వాడటం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని ఇప్పుడు మిమ్మల్ని (దీపా షా) చూస్తే అందరికీ కాన్ఫిడెన్స్ వస్తుంది. క్వాలిటీ విషయంలో ఇతర మెడిసిన్లతో పోలిస్తే జనరిక్ మెడిసిన్లు ఏ మాత్రం తక్కువ కాదు. అత్యుత్తమ ల్యాబోరేటరీలు వాటిని సర్టిఫై చేస్తాయి. ఈ మెడిసిన్లు ‘మేడ్ ఇన్ ఇండియా’, ‘మేక్ ఇన్ ఇండియా’. అంతేకాదు చాలా చౌక కూడా” అని మోడీ వివరించారు.

ప్రతినెల కోటి మందికి ప్రయోజనం

‘‘జన్ ఔషధి డే అనేది.. ఓ పథకాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మాత్రమే ఉద్దేశించినది కాదు.. లక్షలాది మంది ప్రజలు, లక్షల కుటుంబాలను కనెక్ట్ అయ్యేందుకు కూడా” అని మోడీ అన్నారు. జనరిక్ మెడిసిన్లకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉందని, డాక్టర్లు ప్రిస్క్రిప్షన్​లో జనరిక్ మందులే తప్పనిసరిగా రాసివ్వాలని ఆదేశాలిచ్చామని చెప్పారు. ప్రతి నెల కోటి కుటుంబాలు జనరిక్ మందుల ద్వారా లబ్ధి పొందుతున్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా 6 వేలకుపైగా జన్ ఔషధి సెంటర్లు ఉన్నాయని, ప్రజలు రూ.2,000 కోట్ల నుంచి 2,500 కోట్ల వరకు సేవ్ చేసుకుంటున్నారని చెప్పారు.

ప్రపంచం ‘నమస్తే’ పెడుతోంది

కరోనా వైరస్‌‌పై వస్తున్న పుకార్లను నమ్మవద్దని ప్రజలకు ప్రధాని మోడీ కోరారు. ఈ విషయంలో డాక్టర్ల సలహాలు మాత్రమే పాటించాలని సూచించారు. ఎవరికీ షేక్ హ్యాండ్ ఇవ్వొద్దని, బదులుగా నమస్తే పెట్టాలని సూచించారు. ‘‘ఇప్పుడు ప్రపంచం మొత్తం నమస్తే పెట్టడం అలవాటు చేసుకుంటోంది. షేక్ హ్యాండ్స్ కారణంగా ఎవరైనా నమస్తే పెట్టడాన్ని ఆపేసి ఉంటే.. ఇప్పుడు తిరిగి ప్రారంభించండి” అని కోరారు. ‘‘ఇలాంటి పరిస్థితుల్లో రూమర్లు త్వరగా వ్యాప్తి చెందుతాయి. అవి తినొద్దు.. ఇవి తినొద్దు.. అని చెబుతుంటారు. ఇవి తింటే కరోనా తగ్గుతుంది.. అని అంటుంటారు. ఇలాంటి పుకార్లకు చోటివ్వకూడదు” అని సూచించారు. ఏమి చేసినా.. డాక్టర్ సూచన మేరకే చేయాలని కోరారు.

ఏటా మార్చి 7న

జనరిక్ మందులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మార్చి 7న జన ఔషధి దినోత్సవాలను కేంద్రం జరుపుతోంది. 700 జిల్లాల్లో 6,200 జన ఔషధి సెంటర్లు ఉన్నాయి. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద రిటైల్ ఫార్మా చెయిన్‌‌గా గుర్తింపు పొందింది. 900 రకాల మెడిసిన్లు, 154 రకాల సర్జికల్ ఇన్​స్ర్టుమెంట్స్ అందుబాటులో
ఉన్నాయి.