Ganga Vilas Cruise Yatra:50 రోజులు..4వేల కి.మీల పడవ ప్రయాణం

Ganga Vilas Cruise Yatra:50 రోజులు..4వేల కి.మీల పడవ ప్రయాణం
  • 50 రోజుల్లో 4 వేల కి.మీ. ప్రయాణం
  • బంగ్లాదేశ్​లో 15 రోజులు పయనించి గువహటి దగ్గర రీ ఎంట్రీ
  • జాతీయ పార్కుల గుండా జర్నీ

వారణాసి: రివర్​ క్రూయిజ్​ యాత్రల్లో ప్రపంచంలోనే ఎక్కడా లేని సుదీర్ఘ యాత్ర మరో నాలుగు రోజుల్లో మన దేశంలో ప్రారంభం కాబోతోంది. 50 రోజుల పాటు దాదాపు 4 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించే ఈ క్రూయిజ్​ పేరు ‘గంగా విలాస్’.. ఉత్తరప్రదేశ్​ లోని వారణాసి నుంచి మొదలయ్యే ఈ యాత్ర వివిధ చారిత్రక ప్రదేశాలను చుట్టుకుంటూ బంగ్లాదేశ్​లోకి ప్రవేశిస్తుంది. బంగ్లాదేశ్​లోనే 15 రోజుల పాటు ప్రయాణించి తిరిగి మన దేశంలోకి ఎంటరై అస్సాంలోని దిబ్రూగఢ్​కు చేరుతుంది. అక్కడితో 50 రోజుల రివర్  క్రూయిజ్​ జర్నీ పూర్తవుతుంది. ఈ యాత్రను వచ్చే శుక్రవారం(ఈ నెల 13న) ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభింపజేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ఈ యాత్రకు టికెట్​ ధర ఎంత అనే వివరాలను ఇటు నిర్వాహకులు కానీ అటు అధికారులు కానీ వెల్లడించలేదు. నిజానికి ఈ యాత్ర ఎప్పుడో ప్రారంభం కావాల్సింది. గతంలో పనులు పూర్తికాక ఒకసారి.. కరోనా లాక్​ డౌన్​ కారణంగా మరోసారి టూర్​ ప్రారంభం వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ నెల 13న  గంగా విలాస్​ ప్రయాణం మొదలుకానుంది. ఈ యాత్రలో పాల్గొనే ఫారినర్ల ద్వారా మన దేశంలోని పర్యాటక స్థలాల వివరాలు ప్రపంచానికి తెలుస్తాయని అధికారులు చెప్పారు. ఈ రివర్​ క్రూయిజ్​ మొదలయ్యాక మన దేశానికి వచ్చే టూరిస్టుల సంఖ్య కూడా పెరుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, గంగా విలాస్​ టూర్​ కు సంబంధించిన టికెట్లన్నీ ఇప్పటికే అమ్ముడు పోయాయని, వచ్చే 2 నెలల దాకా ఫారిన్​ టూరిస్టులే ఈ టికెట్లు బుక్​ చేసుకున్నారని అనధికార వర్గాల సమాచారం.

వారణాసిలో ప్రారంభం..

రవిదాస్​ ఘాట్​లో గంగా విలాస్ టూర్​ మొదలవుతుంది. ఇందులో 80 మంది ప్రయాణించొచ్చు. అంటారా లగ్జరీ రివర్​ క్రూయిజెస్, జేఎం బాక్సిరివర్ ​క్రూయిజెస్​లు ప్రభుత్వ భాగస్వామ్యంతో ‘గంగా విలాస్’ యాత్రను నిర్వహిస్తున్నాయి.

టూర్​ విశేషాలు..
    గంగా విలాస్  రివర్​ క్రూయిజ్​​ మన దేశంలోని రెండు ప్రముఖ నదులు గంగ, బ్రహ్మపుత్ర నదుల్లో పయనిస్తుంది.
    వారణాసి నుంచి బయలుదేరి ఘాజీపూర్, బక్సర్, పాట్నా గుండా ప్రయాణించి కోల్​కతా చేరుతుంది.
    బంగ్లాదేశ్​లోకి ప్రవేశించిన తర్వాత దాదాపు 15 రోజుల పాటు ఆ దేశంలోని నదులమీదుగా ముందుకు సాగుతుంది. 
    గువహటి వద్ద మన దేశంలోకి తిరిగి ఎంటరవుతుంది. అక్కడి నుంచి దిబ్రూగఢ్​కు చేరుకుంటుంది.
    సుందర్బన్​ డెల్టా, కజిరంగా నేషనల్​ పార్క్​సహా దేశంలోని పలు జాతీయ పార్కులు, శాంక్చురీల గుండా ఈ యాత్ర కొనసాగుతుంది