
సూర్యాపేట, తుంగతుర్తి, వెలుగు : ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అర్హులందరికీ రేషన్ కార్డు ఇస్తుందని సివిల్ సప్లై కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో నూతన రేషన్ కార్డుల పంపిణీ, సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాట్లను ఆదివారం కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తో కలిసి ఆయన పరిశీలించారు.
అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 5,61,343 కొత్త రేషన్ కార్డులకు 27, 83,346 మంది కొత్త సభ్యులను నమోదు చేశామన్నారు. దీనికిగాను ఏడాదికి ప్రభుత్వంపై రూ.1,151 కోట్ల అదనపు భారం పడుతుందన్నారు. రేషన్ కార్డు రాలేదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 3,24,165 రేషన్ కార్డులు ఉండగా, కొత్తగా 23,870 కార్డులను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. బయోమెట్రిక్ విధానం ద్వారా పారదర్శకంగా పథకాన్ని అమలు చేస్తామన్నారు.
సీఎం పర్యటనకు భారీ బందోబస్తు..
తిరుమలగిరి మండల కేంద్రంలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ నరసింహ తెలిపారు. ఆదివారం తిరుమలగిరిలో బహిరంగ సభ ప్రాంగణం, హెలిప్యాడ్, భద్రతా ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ 1200 మంది పోలీసు సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సామాన్యులు, బహిరంగ సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ఆయన వెంట అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, డీఎస్పీలు ప్రసన్నకుమార్, శ్రీధర్, శ్రీనివాస్ రావు, సురేశ్ కుమార్, మొగలయ్య, రవి, వెంకట్ రెడ్డి, సీఐలు, ఎస్సైలు, సిబ్బంది ఉన్నారు.