ఇయ్యాలే సిద్దిపేటలో రైలు కూత.. వర్చువల్​గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ

ఇయ్యాలే సిద్దిపేటలో రైలు కూత.. వర్చువల్​గా ప్రారంభించనున్న ప్రధాని మోదీ
  •     నెరవేరనున్న జిల్లా వాసుల కల
  •     ఇక సిద్దిపేట టు సికింద్రాబాద్ ప్యాసింజర్ రైల్​ సేవలు
  •     అందుబాటులోకి 8 బోగీలతో రెండు పుష్​పుల్ ట్రైన్లు

సిద్దిపేట, వెలుగు: ఎన్నో ఏండ్ల నాటి సిద్దిపేట జిల్లా వాసుల కల నెరవేరబోతోంది. మంగళవారం ఇక్కడి నుంచి సికింద్రాబాద్​కు పుష్–-పుల్​ప్యాసింజర్ రైలు పరుగులు తీయనుంది. ప్రధాని నరేంద్ర మోదీ నిజామాబాద్​నుంచి మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్​గా ప్రారంభించనున్నారు. ఇందుకోసం రైల్వేశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. సిద్దిపేట నుంచి సికింద్రాబాద్​116 కిలోమీటర్లు ఉండగా, రైల్వే శాఖ టికెట్​ధరను రూ.60గా నిర్ణయించింది. మొత్తం ఎనిమిది బోగీలతో నడిచే ప్యాసింజర్​రైలు వారంలో ఆరు రోజులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. సిద్దిపేట నుంచి మొదలై దుద్దెడ, లకుడారం, గజ్వేల్, నాచారం, అప్పాయపల్లి, మనోహరాబాద్, మేడ్చల్, గుండ్లపోచంపల్లి, బొల్లారం, మల్కాజిగిరి మీదుగా సికింద్రాబాద్ చేరుకుంటుంది. మెదక్‌‌ జిల్లా మనోహరాబాద్ టు కొత్తపల్లి రైల్వే లైన్​ఏర్పాటులో భాగంగా మూడో దశలో సిద్దిపేట రైల్వేస్టేషన్ నిర్మించారు. మొత్తం నాలుగు జిల్లాలను కలుపుతూ రూ.1,200 కోట్ల వ్యయంతో 151.36 కిలోమీటర్ల మేర రైల్వే లైన్ నిర్మిస్తున్నారు. ఇందులో సిద్దిపేట రైల్వే స్టేషన్​ముందుగా అందుబాటులోకి వచ్చింది.

2 ఫ్లాట్​ఫాంలు.. 5 ట్రాకులు

సిద్దిపేట రైల్వేస్టేషన్​లో రైళ్ల రాకపోకల కోసం మొత్తం ఐదు ట్రాకులు నిర్మించాలని నిర్ణయించగా ప్రస్తుతం నాలుగు అందుబాటులోకి వచ్చాయి. మూడు ప్యాసింజర్​ రైళ్లకు, ఒకటి గూడ్స్ రైళ్ల కోసం వినియోగించనున్నారు. అలాగే రెండు ఫ్లాట్​ఫాంలు నిర్మించారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా స్టేషన్​ను, ట్రాకులను నిర్మించారు. మొదటి మూడు ట్రాకులను ప్యాసింజర్‌‌ రైళ్లు, నాలుగో లైనును గూడ్స్‌‌, ఐదో లైన్​ను ప్యాకింగ్‌‌, రిపేర్లు, ఇంజన్ల సైడింగ్‌‌ కోసం వినియోగించనున్నారు. రూ.6కోట్ల వ్యయంతో సిద్దిపేట రైల్వేస్టేషన్​ను జీ+ వన్ పద్ధతిలో నిర్మిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్​లో ర్యాంప్, మెట్లతోపాటు లిఫ్ట్​ను ఏర్పాటు చేస్తున్నారు. టికెట్ కౌంటర్, స్టేషన్ మేనేజర్ ఆఫీస్, సిగ్నలింగ్ కంట్రోల్ రూమ్​తో పాటు ప్లాట్ ఫామ్  ఫ్లోరింగ్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. కొన్ని పనులు నడుస్తున్నాయి.

2017లో భూమి పూజ

మనోహరాబాద్‌‌ ‌‌కొత్తపల్లి  రైల్వే లైన్‌‌ ‌‌పనులకు 2017 మార్చిలో భూమిపూజ చేశారు. మొత్తం నాలుగు దశల్లో పనులు చేయాలని నిర్ణయించారు. మొదటి దశలో మనోహరాబాద్‌‌ ‌‌‒ గజ్వేల్‌‌‌‌ మధ్య 32 కిలోమీటర్లు, రెండో దశలో గజ్వేల్‌‌‌‌‒ దుద్దెడ మధ్య 32 కిలో మీటర్లు, మూడో దశలో దుద్దెడ ‒ సిరిసిల్ల మధ్య రైల్వే లైన్​లో భాగంగా సిద్దిపేట రైల్వే స్టేషన్ నిర్మాణాన్ని పూర్తిచేశారు.  సిద్దిపేట జిల్లాలో రైల్వే లైన్‌‌‌‌ నిర్మాణానికి మొత్తం 1,413 ఎకరాల భూసేకరణ చేశారు. మనోహరాబాద్ నుంచి సిద్దిపేట వరకు దాదాపు 70 గ్రామాల మీదుగా రైల్వే లైన్ నిర్మించారు. మనోహరాబాద్‌‌‌‌నుంచి కొత్తపల్లి రైల్వేలైన్‌‌‌‌ పూర్తయితే జిల్లాలోని పుణ్య క్షేత్రాలకు జర్నీ ఈజీ అవుతుంది. నాచారం లక్ష్మీనరసింహస్వామి, కొమురవెల్లి మల్లికార్జునస్వామి భక్తులకు ఇబ్బందులు ఉండవు. ఇప్పటికే గజ్వేల్ రైల్వేస్టేషన్​ను గూడ్స్​రవాణా కేంద్రంగా తీర్చిదిద్దగా, సిద్దిపేట రైల్వే స్టేషన్ ను ప్యాసింజర్ ట్రైన్ల స్టార్టింగ్ పాయింట్​గా తీర్చిదిద్దుతున్నారు. సికింద్రాబాద్​రైల్వే స్టేషన్​పై ఒత్తిడి తగ్గించడానికి  భవిష్యత్తులో సిద్దిపేట నుంచి తిరుపతి, బెంగళూరుకు ప్యాసింజర్ రైళ్లు ఏర్పాటు చేసే ఆలోచనలో అధికారులు ఉన్నారు.

3 నెలల్లో ఎలక్ట్రిఫికేషన్ పనులు

మనోహరాబాద్ నుంచి సిద్దిపేట వరకు రైల్వేలైన్ ఎలక్ట్రిఫికేషన్​కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 150 కోట్లతో మూడు నెలల్లో పనులు ప్రారంభమమ్యే అవకాశం ఉంది. అప్పటివరకు డీజిల్ ఇంజన్ ట్రైన్లను నడపనున్నారు. మంగళవారం సిద్దిపేట నుంచి ప్యాసింజర్ రైలు ప్రారంభోత్సవం సందర్భంగా బీజేపీ శ్రేణులు సంబరాలకు సిద్ధం అవుతున్నారు. సిద్దిపేటలో మంత్రి హరీశ్​రావు, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు జెండా ఊపి ట్రైన్​ను ప్రారంభించనున్నారు.