పాకిస్థాన్‎కు చావుదెబ్బ.. సింధూ జలాల ఒప్పందంపై ప్రధాని మోడీ సంచలన ప్రకటన

పాకిస్థాన్‎కు చావుదెబ్బ.. సింధూ జలాల ఒప్పందంపై ప్రధాని మోడీ సంచలన ప్రకటన

న్యూఢిల్లీ: భారత స్వాతంత్ర దినోత్సవం వేళ సింధూ నది జలాల ఒప్పందంపై సంచలన ప్రకటన చేశారు ప్రధాని మోడీ. నిలిపివేయబడిన సింధూ నది జలాల ఒప్పందం పునరుద్ధరణ ఇక ఎప్పటికీ జరగదని తేల్చి చెప్పారు. ఇక ఎప్పటికీ సింధూ జలాలపై చర్చల ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టారు. మళ్లీ చెబుతున్నా.. నీరు, రక్తం కలిసి ప్రవహించవని.. సింధు జలాల ఒప్పందంలో మరో మాట లేదని పాకిస్థాన్‎కు తేల్చి చెప్పారు. సింధూ జలాలను భారత భూభాగానికి మళ్లించాలన్న ఆలోచనలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. నీటి కొరత ఉన్న ప్రాంతాలకు సింధూ జలాలు తరలిస్తామని తెలిపారు.

సింధూ నది నీరు భారతీయ రైతుల హక్కు అని, దేశ హితం, రైతుల హితం కోసం ఈ ఒప్పందాన్ని అంగీకరించడం లేదని క్లారిటీ ఇచ్చారు. 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎర్రకోటపై ప్రధాని మోడీ శుక్రవారం (ఆగస్ట్ 15) జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. పహల్గామ్‌లో ఉగ్రవాదులు నరమేధం సృష్టించారని.. భార్య ముందే భర్తను.. పిల్లల ముందే తండ్రిని చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు మతం అడిగి మరీ మారణహోమం సృష్టించారని.. ఆపరేషన్‌ సిందూర్‌తో ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపామని  గుర్తు చేశారు. మన సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చాం.. పాక్‌లోకి చొచ్చుకెళ్లి మరీ మన జవాన్లు ముష్కరులను మట్టుబెట్టారని పేర్కొన్నారు. మన సైన్యం ఉగ్రస్థావరాలను కూడా ధ్వంసం చేసిందని చెప్పారు. ఉగ్రవాదులను, వారికి మద్ధతిచ్చేవారిని మేం వేర్వేరుగా చూడటంలేదని స్పష్టం చేశారు. 

ఆపరేషన్‌ సిందూర్‌ హీరోలకు నా సెల్యూట్‌.. మన సైనికులు ఊహకందని విధంగా శత్రువులను దెబ్బతీశారని ప్రశంసించారు. పహల్గామ్‌లో దాడి చేసిన ఉగ్రవాదులకు గట్టి గుణపాఠం చెప్పారన్నారు. ఉగ్రవాదం మానవాళి మనుగడకే ముప్పు అని పేర్కొన్నారు. పాకిస్థాన్ అణుబాంబు బెదిరింపులకు భారత్ భయపడే ప్రసక్తే లేదన్నారు. ఇకపై అణుబాంబు బెదిరింపులను సహించేదిలేదని.. ఎన్నో ఏళ్లుగా అణుబాంబుల పేరిట బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇకపై ఎవరి బ్లాక్‌మెయిల్‌ నడవదని.. బ్లాక్‌మెయిల్‌కు పాల్పడితే ధీటుగా జవాబిస్తామని హెచ్చరించారు.