
- ప్రారంభించిన పీఎం మోదీ, షేక్ హసీనా
అగర్తల: భారత్, బంగ్లాదేశ్ మధ్య మూడు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ, బంగ్లా పీఎం షేక్ హసీనాతో కలిసి బుధవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఖుల్నా–మోంగ్లా పోర్ట్ రైల్వే లేన్, త్రిపురలోని అగర్తల–బంగ్లాదేశ్ బార్డర్‌లోని అఖౌరా క్రాస్ బార్డర్ రైల్వే లింక్, ఆ దేశంలోని రాంపాల్‌లో మైత్రీ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్రెండో యూనిట్లను ఇద్దరు ప్రధానులు ఓపెనింగ్ చేశారు. బంగ్లాదేశ్ చేపట్టిన ఈ 3 ప్రాజెక్టులకు మన దేశం సాయం అందిస్తోంది. క్రాస్ బార్డర్ రైల్వే ప్రాజెక్టు ఇరు దేశాల మధ్య వాణిజ్యం, ట్రాన్స్‌పోర్ట్‌ను మరింత పెంచనుంది. గంగాసాగర్ స్టేషన్ నుంచి నిశ్చింతపూర్ రైల్వే స్టేషన్‌దాకా ట్రయల్ రన్‌ను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు.
ప్రాజెక్టుల ప్రారంభం తర్వాత మోదీ మాట్లాడారు. త్రిపురలోని నిశ్చింతపూర్ నుంచి బంగ్లాలోని గంగాసాగర్‌ను కలిపే రైల్వే లైన్(అగర్తల–అఖౌర)ను ప్రారంభించిన ఈ క్షణం చరిత్రాత్మకమని అన్నారు. ఈశాన్య భారత్, బంగ్లాదేశ్ మధ్య చేపట్టిన మొదటి రైల్వే లింక్ ప్రాజెక్ట్ ఇదేనని చెప్పారు. బంగ్లాదేశ్ అభివృద్ధికి సాయం చేయడంలో అతిపెద్ద భాగస్వామిగా భారత్ నిలవడం గర్వంగా ఉందన్నారు.
మరిన్ని విజయాలు సాధిస్తం: షేక్ హసీనా
ఈ ప్రాజెక్టులు ఇండియా, బంగ్లా మధ్య మౌలిక సదుపాయల అభివృద్ధి సహకారాన్ని మరింత బలోపేతం చేస్తాయని షేక్ హసీనా అన్నారు. ఇవి భారత్‌తో తమకున్న బలమైన స్నేహ బంధాన్ని చాటి చెబుతున్నాయని తెలిపారు. పొరుగు దేశాలతో మంచి సంబంధాలు దేశాభివృద్ధిని స్పీడప్ చేస్తాయని నిరూపించామని, ఇది ప్రపంచానికి ఒక ఉదాహరణ అన్నారు. భారత్, బంగ్లా మధ్య సంబంధాలు పరస్పర సాయానికి, అరుదైన స్నేహానికి నిదర్శమన్నారు. అగర్తల–అఖౌర క్రాస్ బార్డర్ లింక్ ప్రాజెక్టు కోసం మనదేశం రూ.393 కోట్లు గ్రాంట్ సాయంగా బంగ్లాకు అందజేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా ఢాకా మీదుగా అగర్తల, కోల్‌కతా మధ్య దూరాన్ని 1600 కిలోమీటర్ల నుంచి 500 కిలోమీటర్లకు తగ్గిస్తుంది.