ఆటగాళ్లను ప్రోత్సహిద్దాం.. మన్ కీ బాత్‌లో ప్రధాని పిలుపు

ఆటగాళ్లను ప్రోత్సహిద్దాం.. మన్ కీ బాత్‌లో ప్రధాని పిలుపు

న్యూఢిల్లీ:  ఒలింపిక్స్​లో పాల్గొంటున్న మన క్రీడాకారులను ప్రోత్సహిద్దామని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. మన ఆటగాళ్లు సత్తా చాటాలని ఆయన ఆకాంక్షించారు. ప్రపంచ వేదికపై మువ్వన్నెల జెండా ఎగురవేసే అవకాశం వాళ్లకు వచ్చిందన్నారు. ఆదివారం మన్​ కీ బాత్ 112వ ఎపిసోడ్​లో మోదీ మాట్లాడారు. మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. డ్రగ్స్ ను నిర్మూలించేందుకు మానస్ హెల్ప్​లైన్​ 1933ని వినియోగించుకోవాలని కోరారు. డ్రగ్స్ సప్లయ్, వినియోగం గురించి తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. 

1.5 లక్షల కోట్లు దాటిన ఖాదీ ఇండస్ట్రీస్ టర్నోవర్

ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ టర్నోవర్ మొదటిసారిగా రూ.1.5 లక్షల కోట్లను అదిగమించడం సంతోషకరమని మోదీ అన్నారు. అమ్మకాల పెరుగుదలతో అనేక కొత్త ఉపాధి అవకాశాలు వస్తాయన్నారు. ఖాదీ పరిశ్రమలో ఎక్కువ మంది మహిళలే పనిచేస్తున్నారని, వారు మరింత లాభాలు పొందుతారని ఆకాంక్షించారు. హర్యానాలోని రోహ్​తక్ జిల్లాకు చెందిన 250 మందికి పైగా మహిళలు జీవితాలను మార్చుకున్నారని  మెచ్చుకున్నారు.  కూలి పనులు చేసుకునే ఆ మహిళలు సంఘాలుగా ఏర్పడి బ్లాక్ ప్రింటింగ్, డైయింగ్​లో అద్భుతంగా రాణిస్తున్నారని కొనియాడారు. అహోం రాజుల సమాధులకు యునెస్కో గుర్తింపు రావడం గర్వకారణమన్నారు.

స్కీంలు పక్కాగా అమలవ్వాలె: బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో మోదీ

సంక్షేమ పథకాలను పక్కాగా అమలు అయ్యేలా చూడాలని బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలకు ప్రధాని మోదీ సూచించారు. కేంద్రంలో మూడోసారి పవర్ లోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ఆయన బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలతో ఆదివారం ఢిల్లీలోని బీజేపీ ఆఫీసులో ‘ముఖ్యమంత్రి పరిషత్’ పేరుతో మీటింగ్ నిర్వహించారు. ఇందులో 13 బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ముగ్గురు ఎన్డీయే పాలిత ఉప ముఖ్యమంత్రులు హాజరయ్యారు.

కేంద్ర మంత్రులు అమిత్​షా, రాజ్​నాథ్​ సింగ్​తోపాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు. వారి వారి రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి పథకాలపై సీఎంలు ప్రజెంటేషన్​ ఇచ్చారు. దాదాపు 3 గంటలకుపైగా సీఎంలతో మోదీ ముచ్చటించారు. ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమంపై చర్చించారు. పేదల కోసం బీజేపీ ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో ప్రజలకు మేలు చేస్తున్న స్కీంలను కూడా అమలు చేయాలని సీఎంలకు ప్రధాని మోదీ సూచించారు.