అది కూటమి కాదు..దోపిడీ ముఠా

అది కూటమి కాదు..దోపిడీ ముఠా
  • ప్రతిపక్షాలపైప్రధాని మోదీ అటాక్​
  • దేశాన్ని ముక్కలు చేసుడే వాళ్ల పని
  • కూటమిలో ఇండియా పేరునూ ముక్కలు చేశారు
  • తుక్డే గ్యాంగ్​కు ప్రజలే బుద్ధి చెప్తరు 
  • కాంగ్రెస్ అంటేనే నో కాన్ఫిడెన్స్ .. 
  • అవినీతి, వారసత్వ రాజకీయాలకు అది కేరాఫ్ 
  • బంపర్ మెజార్టీతో మళ్లీ అధికారంలోకి వస్తం.. 
  • 2028లోనూ అవిశ్వాసం పెట్టాలని కోరుకుంటున్న
  • మణిపూర్​కు మేమున్నాం.. శాంతిని నెలకొల్పుతాం
  • లోక్​సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చలో ప్రధాని

న్యూఢిల్లీ : యూపీఏ హయాంలో జరిగిన స్కామ్​లు, అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే ప్రతిపక్షాలు ‘ఇండియా’ కూటమిగా ప్రజల్లోకి వెళ్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. దేశాన్ని దోచుకునే వాళ్లంతా కలిసి ఓ ముఠాగా ఏర్పడ్డారని ఆరోపించారు. విపక్షాలది ఇండియా ఘట్ బంధన్ కాదని.. ఘమండియా ఘట్ బంధన్ అని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అంటేనే.. నో కాన్ఫిడెన్స్ అని విమర్శించారు. అది అవినీతికి, వారసత్వ రాజకీయాలకు పుట్టినిల్లు అని మండిపడ్డారు. కాంగ్రెస్​కు నీతి, నిజాయితీ, విజన్ అంటూ ఏదీ లేదన్నారు. ఆ పార్టీ లీడర్ల బుర్ర అవిశ్వాసంతో నిండిపోయిందని, వాళ్లకు పొడి కారం, పచ్చి మిర్చికి తేడా తెలియదని ఎద్దేవా చేశారు. 2018లో అవిశ్వాస తీర్మానం తీసుకొస్తేనే బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చామని, 2028లో కూడా అవిశ్వాస తీర్మానం తీసుకురావాలని, అప్పుడే చరిత్ర తిరగరాస్తామని అన్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా గురువారం లోక్​సభలో ప్రధాని మోదీ మాట్లాడారు. విపక్షాల నిరసనల మధ్యే మోదీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఇండియా టాప్ 5లో ఉందని, 2028లో అధికారంలోకి వచ్చాక టాప్ 3లోకి తీసుకొస్తామని మోదీ అన్నారు. ఇది ఒక ప్రధానిగా మోదీ ఇస్తున్న హామీ అని చెప్పారు.

తిట్టి.. తిట్టి కూల్ అయిపోయిన్నట్టున్నరు

విపక్ష సభ్యులు డిక్షనరీల్లో తిట్లు వెతికి మరీ సభకు తీసుకొచ్చారని మోదీ అన్నారు. సభ జరిగినన్ని రోజులు తిట్టినందుకు, శాపాలు పెట్టినందుకు కొంత కూల్ అయినట్టు కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎలాగో తనను ఎప్పుడూ తిడ్తూనే ఉంటారని, ​‘మోదీ.. తేరీ ఖబ్ర్ ఖుదేగీ (మోదీ.. నీ సమాధి తవ్వుడే)’  అనేది ప్రతిపక్షాలకు ఇష్టమైన నినాదమన్నారు. అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్, తిట్లు, శాపనార్థాలను తాను టానిక్​లా మార్చుకుంటానని చెప్పారు. విపక్ష సభ్యులు ఎవరైతే నాశనం కావాలని కోరుకుంటారో వాళ్లు చాలా బాగుపడ్తారని అన్నారు. 

తనను 20 ఏండ్లుగా తిడుతూనే ఉన్నారని, అందుకే ఇప్పుడు ఈ స్థాయికి వచ్చానని ఎద్దేవా చేశారు. ‘ఇండియన్ గవర్నమెంట్ చెప్తే కాంగ్రెస్​కు నమ్మకం కుదరదు. అదే, పాకిస్తాన్ చెబితే మాత్రం గట్టిగా నమ్ముతారు. సర్జికల్ స్ట్రైక్స్​పై ప్రూఫ్స్ అడిగిన దేశ వ్యతిరేకులు వీళ్లు. ఇండియన్ ఆర్మీని అవమానించారు. ఇండియాకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా.. విదేశీ ఏజెన్సీలు ఏం చెప్పినా.. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తారని విమర్శించారు. ‘‘పాకిస్తాన్ జెండా పట్టుకునేవాళ్లనే కాంగ్రెస్ ప్రేమిస్తది. ఇండియాను బద్నాం చేయడమే వాళ్ల లక్ష్యం. వాళ్లకు విదేశీ వ్యాక్సిన్లపై ఉన్న ప్రేమ.. మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్లపై లేదు”అని మోదీ విమర్శించారు.  కాంగ్రెసోళ్లకు అహంకారం పెరిగిపోయిందని, కాళ్ల కింద భూమి కనిపించడం లేదని మోదీ మండిపడ్డారు. 

కూటమి పేరు మాత్రమే వింటరు.. పనులు చూడరు

ఇండియా అంటే లెక్క చేయమని, తమిళనాడు ఇండియాలోనే లేదంటూ తమిళనాడులో ఓ నేత అన్నారని మోదీ గుర్తు చేశారు. ప్రతీ పేదోడు ‘ఇండియా’ కూటమి పేరు మాత్రమే వింటారని, పనులు చేయరని అన్నారు. ‘‘హాస్పిటల్స్, పార్క్​లు, రోడ్లు, ఖేల్ పురస్కారాలు, ఎయిర్​పోర్టులు, మ్యూజియాలకు కాంగ్రెస్ తమవాళ్ల పేర్లు పెట్టుకుంది. ఆ పేర్లతో స్కీమ్​లు తీసుకొచ్చి లక్షల కోట్లు దోచుకున్నది. కాంగ్రెస్​ పార్టీ సింబల్, జెండా, చివరికి ఆలోచనలు కూడా ఒకరి దగ్గరి నుంచి దోచుకున్నవే అని ఆరోపించారు. కాంగ్రెస్ మొత్తం గాంధీ ఫ్యామిలీ చేతిలోనే బంధీ అయిందన్నారు. అధిర్ రంజన్​ చౌదరిని కాంగ్రెస్ పార్టీ వాళ్లే అవమానిస్తున్నారని, ఆయన్ని చూస్తుంటే చాలా బాధగా ఉందని అన్నారు. బాగున్నంత వరకు చేతిలో చేతేసుకుని తిరుగుతారని, పరిస్థితి తలకిందులైతే అవే చేతుల్లో కత్తులు పట్టుకుంటారని విమర్శించారు. దేశాభివృద్ధి కోసం తీసుకొచ్చిన ఎన్నో బిల్లులను ప్రతిపక్షాలు చర్చ జరగకుండా అడ్డుకున్నాయని ఫైర్ అయ్యారు. యువత, పేదల సంక్షేమం కంటే విపక్షాలకు రాజకీయాలే ఎక్కువ అయ్యాయని విమర్శించారు. 

కాంగ్రెస్ కామెంట్లు బాధాకరం

సభలో కాంగ్రెస్ సభ్యులు వ్యవహరిస్తున్న తీరు, కామెంట్లు దేశం మొత్తం చూస్తున్నదని మోదీ అన్నారు. దేశానికి నిరాశ తప్ప కాంగ్రెస్ ఏం ఇవ్వలేదని విమర్శించారు. 21వ శతాబ్దం ఎంతో ముఖ్యమైందని, వచ్చే వెయ్యేండ్ల భవిష్యత్తు ఈ శతాబ్దంపైనే ఆధారపడి ఉందన్నారు. యువత కన్న కలలు సహకారం చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. భారీగా విదేశీ పెట్టుబడులు వచ్చాయని, ఎగుమతులు పెరిగాయన్నారు. ఐఎంఎఫ్, డబ్ల్యూహెచ్​వో, యూనిసెఫ్  వంటి ప్రపంచ స్థాయి సంస్థలు ఇండియాను పొగుడుతుంటే.. కాంగ్రెస్ మాత్రం విమర్శిస్తున్నదని ఫైర్ అయ్యారు. ప్రపంచ దేశాలన్నీ ఇండియా అభివృద్ధి చూస్తుంటే.. కాంగ్రెస్ వాళ్ల నరాల్లో అవిశ్వాసం, అహకారం నిండిపోయిందన్నారు. బ్యాంకింగ్ సెక్టార్, హెచ్​ఏఎల్, ఎల్​ఐసీ వంటి సంస్థలను నాశనం చేస్తున్నారని విమర్శించారని, ఇప్పుడు అవి హయ్యెస్ట్ రెవెన్యూ జనరేట్ చేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ ఎంత విమర్శిస్తే.. ఆ  సంస్థలు అంత బాగుపడ్తున్నాయని తెలిపారు. అంబేద్కర్, మహాత్మా గాంధీ వంటి ఎంతో మంది వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమన్నారు. అంబేద్కర్ ను ఓడించారని, ఆయన వేసుకునే డ్రెస్సులపై కాంగ్రెస్ కామెంట్లు చేసిందన్నారు. కాంగ్రెస్ అహంకారమే.. ఆ పార్టీని 400 సీట్ల నుంచి 40కి పడేసిందని విమర్శించారు. 

మణిపూర్​లో శాంతి స్థాపిస్తాం

మణిపూర్ అంశంపై మోదీ తన ప్రసంగం ప్రారంభించే ముందే విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. మణిపూర్ ప్రజలకు మోదీ భరోసా ఇస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. హోంమంత్రి అమిత్​షా రెండు గంటల పాటు మణిపూర్ హింసపై క్లారిటీ ఇచ్చారని మోదీ అన్నారు. రాజకీయాలకు అతీతంగా ఆయన మాట్లాడారని తెలిపారు. ‘‘మణిపూర్ ప్రజలారా మీ వెంట దేశం మొత్తం ఉంది. హింస కారణంగా చాలా మంది ఇబ్బంది పడ్డారు. మహిళలు లైంగిక వేధింపులకు గురయ్యారు. దోషులను కఠినంగా శిక్షిస్తాం. దీని కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ముందుకెళ్తాయి. మణిపూర్​లో కచ్చితంగా శాంతి స్థాపన చేస్తాం. కొత్త ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తాం. మణిపూర్ ప్రజలకు చెప్పేది ఒక్కటే.. దేశం మొత్తం మీ వెంటే ఉంది. అందరూ కలిసి మణిపూర్​ను పునర్ నిర్మిస్తాం. సమస్యకు పరిష్కారం చూపుతాం. అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని భరోసా ఇస్తున్నా”అని మోదీ అన్నారు. 

భరతమాతపై కామెంట్లు బాధించినయ్

కాంగ్రెస్​ లీడర్లు భరతమాత గురించి మాట్లాడిన విధానం సరిగ్గా లేదని, ప్రతీ భారతీయుడిని ఆ కామెంట్లు బాధించాయని మోదీ అన్నారు. ‘అధికారం లేకపోతే బతకలేరా.. సభలో ఇంత నీచంగా మాట్లాడుతున్నారు. భరతమాత చనిపోవాలని కొందరు అనుకుంటున్నారు. రాజ్యాంగం, ప్రజాస్వామ్యం హత్య గురించి మాట్లాడుతారు. మనసులో ఏం అనుకుంటున్నారో.. అదే చేస్తున్నారు. ఆగస్టు 14ని ఎప్పుడూ మరిచిపోలేం. భరతమాతను మూడు ముక్కలు చేశారు. బానిస సంకెళ్లు తెంచాల్సింది.. భరత మాత భుజాన్ని నరికేశారు. స్వార్థ రాజకీయాల కోసం వందేమాతరం గీతాన్ని కూడా ముక్కలు చేశారు. ఇండియాను కూడా ముక్కలు చేయాలని తుక్డే గ్యాంగ్ చూస్తున్నది’ అని మోదీ విమర్శించారు.

ఈశాన్య రాష్ట్రాల ద్రోహి కాంగ్రెస్

1966, మార్చి 5న ఇందిరా ప్రధానిగా ఉన్నప్పుడు మిజోరంపై వైమానిక దాడులు జరిగాయని మోదీ గుర్తు చేశారు. ఆ బాధ ఇప్పటికీ అక్కడి ప్రజలు మరిచిపోలేదన్నారు. ఇక్కడ నీతులు చెబుతూ నార్తీస్ట్ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశారని విమర్శించారు. ఇండియా – చైనా వార్ టైమ్​లో అస్సాం ప్రజలను చావండి అని వదిలేశారని, అప్పుడు నెహ్రూ అధికారంలో ఉన్నారన్నారు. నార్తీస్ట్​ను ఇండియా నుంచి విడదీయాలని నెహ్రూ ప్లాన్ చేసినట్లు లోహియానే స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. ఈశాన్య రాష్ట్రాల ద్రోహి కాంగ్రెస్​ అని విమర్శించారు. ‘మణిపూర్ గవర్నమెంట్ ఆఫీసుల్లో మహత్మా గాంధీ ఫొటో పెట్టనీయలేదు. స్కూల్స్ లో జాతీయ గీతం పాడించే వాళ్లు కాదు. ఆలయాలు 6 గంటల కల్లా మూయించేసేవారు. ఇంఫాల్​లోని ఇస్కాన్ టెంపుల్​పై బాంబు దాడి జరిగింది. మణిపూర్​లో పని చేసే ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు తమ జీతంలో కొంత అక్కడి వేర్పాటువాదులకు ఇవ్వాలి. ఇవన్నీ ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు జరిగాయి. ఆరేండ్ల నుంచి అలాంటి పరిస్థితి లేదు. సమస్య పరిష్కారానికి శాశ్వత పరిష్కారం చూపుతాం”అని మోదీ అన్నారు.

వీగిపోయిన అవిశ్వాస తీర్మానం

కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం లోక్ సభలో వీగిపోయింది. మూజువాణి పద్ధతిలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్  నిర్వహించారు. ప్రతిపక్షాలకు చాలినంత సంఖ్యా బలం లేకపోవడంతో తీర్మానం వీగిపోయింది. తీర్మానం వీగిపోయిన అనంతరం ఈ విషయాన్ని లోక్ సభ స్పీకర్  వెల్లడించారు. 
కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

ప్రతిపక్ష సభ్యులు ఫీల్డర్లుగానే మిగిలిపోయారు. మా వాళ్లు ఫోర్లు, సిక్సులతో సెంచరీలు కొడుతుంటే.. వాళ్లు మాత్రం నో కాన్ఫిడెన్స్ మోషన్​పై నో బాల్ వేసుకుంటూ పోతున్నరు. ప్రాక్టీస్ చేయకుండా గ్రౌండ్​లోకి ఎట్ల దిగుతరు? 2018లో అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు కూడా ఇదే చెప్పిన. ఐదేండ్లు టైమ్ ఇచ్చిన. 2023లో కూడా చెప్తున్న.. 2028లో అవిశ్వాస తీర్మానం పెట్టే టైమ్​లో ప్రాక్టీస్ చేసి గ్రౌండ్​లో దిగండి. మీ కసరత్తు చాలా దరిద్రంగా ఉంది.

‘ఇండియా’ (ఐ.ఎన్.డీ.ఐ.ఏ) కూటమితో దేశాన్ని విడగొట్టారు. మాది ఎన్​డీఏ కూటమి, ప్రతిపక్షాల కూటమిలో రెండు ‘ఐ’లు ఎక్కువ చేరాయి. ఒక ‘ఐ’ 26 పార్టీల అహంకారాన్ని, మరో ‘ఐ’ గాంధీ పరివార్ అహంకారాన్ని తెలియజేస్తున్నది. అది కూటమి కాదు.. దోపిడీ ముఠా. బెంగళూరులో ప్రతిపక్ష సభ్యులందరూ యూపీఏకు అంత్యక్రియలు చేసేశారు. ప్రజాస్వామ్యబద్ధమైన దేశ ప్రధానిగా అప్పుడే సంతాపం తెలియజేయాల్సి ఉన్నా.. కొద్దిగా లేట్ అయింది.