వచ్చే 10 ఏళ్లలో..ఆర్‌‌‌‌బీఐకి 3 టార్గెట్స్‌‌

వచ్చే 10 ఏళ్లలో..ఆర్‌‌‌‌బీఐకి 3 టార్గెట్స్‌‌
  •     క్యాష్‌‌లెస్ ఎకానమీని ప్రమోట్ చేయాలన్న ప్రధాని మోదీ
  •     అందరికీ ఆర్థిక ఫలాలు అందేలా  చేయాలని పిలుపు
  •     90 ఏళ్లు పూర్తి చేసుకున్న ఆర్‌‌‌‌బీఐ  

న్యూఢిల్లీ : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌‌‌‌బీఐ) మరిన్ని లక్ష్యాలను సాధించాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సంస్థ సోమవారంతో 90 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా వచ్చే పదేళ్లలో  చేరుకోవాల్సిన గోల్స్‌‌ను పీఎం  ప్రకటించారు. క్యాష్ లెస్ ఎకానమీని ప్రమోట్ చేయాలని,  డిజిటల్ ట్రాన్సాక్షన్లు పెంచాలని ఆర్‌‌‌‌బీఐకి సూచించారు. ఆర్థిక సేవలు అందరికీ అందేలా చేయాలని,  చిన్న వ్యాపారాలకు  అప్పులు  అందడంలో ఇబ్బందులు ఉండకూడదని తెలిపారు.  ఆర్‌‌‌‌బీఐ 90 వ యానివర్సరీ  సెలబ్రేషన్స్‌‌  ముంబైలో జరిగాయి.

ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌‌, ఆర్‌‌‌‌బీఐ గవర్నర్‌‌‌‌ శక్తికాంత దాస్‌‌  ఈ ఈవెంట్‌‌లో మాట్లాడారు.  అంతేకాకుండా 90 వ యానివర్సరీ గుర్తుగా కాయిన్‌‌ను విడుదల చేశారు. ఆర్‌‌‌‌బీఐ 1935, ఏప్రిల్‌‌1 న ఏర్పాటయ్యింది.  యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌‌‌‌ఫేస్ (యూపీఐ) ను  మోదీ  పొగిడారు. అందరూ వాడుతున్న ప్లాట్‌‌ఫామ్‌‌గా ఎదిగిందని అన్నారు.  గ్లోబల్ సంక్షోభాలను ఎదుర్కొనడానికి  ఇండియా తన కాళ్లపై తాను నిలబడాలని, రానున్న పదేళ్లలో  ఈ స్థాయికి చేరుకోవాలని అన్నారు.  రూపాయిని ప్రపంచం మొత్తం అంగీకరించేలా చేయాలన్నారు. 

ఎంపీసీ భేష్‌‌

ఇన్‌‌ఫ్లేషన్‌‌ను కంట్రోల్ చేయడంలో ఆర్‌‌‌‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) పాత్రను మోదీ కొనియాడారు. ధరల పెరుగుదలను జాగ్రత్తగా గమనించడం, ద్రవ్యపరమైన చర్యలతో ఇన్‌‌ఫ్లేషన్‌‌  పెద్దగా పెరగలేదని అన్నారు.  ‘కరోనా పాండమిక్‌‌, ఉక్రెయిన్‌‌ – రష్యా యుద్ధం వంటి సంక్షోభాల టైమ్‌‌లోనూ ఇన్‌‌ఫ్లేషన్ కంట్రోల్‌‌లో ఉంది.  ప్రయారిటీస్‌‌ క్లియర్‌‌‌‌గా ఉంటే దేశం  వృద్ధి చెందడాన్ని ఎవరూ ఆపలేరు’ అని మోదీ అన్నారు.  వరల్డ్ జీడీపీ గ్రోత్‌‌లో 15 శాతం ఇండియా నుంచే ఉందని పేర్కొన్నారు.  ‘ కరోనా సంక్షోభం నుంచి చాలా దేశాల ఎకానమీలు ఇంకా రికవరీ అవుతుంటే, ఇండియా మాత్రం రికార్డ్‌‌లు క్రియేట్‌‌ చేస్తోంది’ అని వివరించారు. స్పేస్‌‌, టూరిజం వంటి కొత్త, పాత తరం సెక్టార్ల అవసరాలను తీర్చేందుకు బ్యాంకులు, రెగ్యులేటర్లు సిద్ధంగా ఉండాలని మోదీ అన్నారు.

ప్రపంచంలోనే  అతిపెద్ద  రెలిజియస్ టూరిజం సెంటర్‌‌‌‌గా అయోధ్య ఎదుగుతుందని  అంచనా వేశారు. జాతీయ ప్రాజెక్ట్‌‌లకు ఫండ్స్‌‌ అందివ్వాలని బ్యాంకింగ్ ఇండస్ట్రీని కోరారు.  బ్లాక్‌‌ చెయిన్‌‌, ఆర్టిఫీషియల్‌‌ ఇంటెలిజెన్స్ (ఏఐ), సైబర్ సెక్యూరిటీ వంటి టెక్నాలజీల సాయంతో  డిజిటల్ బ్యాంకింగ్ సిస్టమ్‌‌ వేగంగా వృద్ధి చెందుతోందని  అన్నారు.  ‘2014 నాటికి  ఆర్‌‌‌‌బీఐ 80 ఏళ్లు పూర్తి చేసుకుంది.  అప్పటికి మొండిబాకీల సమస్యలు బ్యాంకులను వెంటాడాయి. స్టెబిలిటీ లేదు.  ఇప్పుడు ప్రపంచంలోనే బలమైన బ్యాంకింగ్‌‌ సిస్టమ్‌‌గా  మన బ్యాంకులు ఎదిగాయి. రికార్డ్ లెవెల్లో ప్రాఫిట్స్ సాధిస్తున్నాయి. అప్పులు ఇస్తున్నాయి’ అని మోదీ వివరించారు.  2018 లో బ్యాంకులు గ్రాస్ ఎన్‌‌పీఏలు 11.25 శాతం ఉంటే, కిందటేడాది సెప్టెంబర్ నాటికి 3 శాతానికి తగ్గాయని గుర్తు చేశారు. 15 శాతం క్రెడిట్ గ్రోత్‌‌ నమోదయ్యిందని అన్నారు.