చేయాల్సింది ఇంకా ఉంది..పదేండ్లలో మీరు చూసింది ట్రైలరే : మోదీ

చేయాల్సింది ఇంకా ఉంది..పదేండ్లలో మీరు చూసింది ట్రైలరే : మోదీ
  • మనతో పెట్టుకుంటే శత్రుదేశంలోకి చొచ్చుకెళ్లి దాడిచేస్తాం 
  • పాక్​పై కౌంటర్​ అటాక్స్​తో శత్రు దేశాలకు మనమేంటో తెలిసింది
  • కాంగ్రెస్​ పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం
  • స్కామ్​లతో ఆ పార్టీ దేశాన్ని లూటీ చేసిందని ఫైర్​
  • రాజస్థాన్​లోని చురులో ప్రధాని ఎన్నికల ర్యాలీ

జైపూర్ :  బీజేపీ పదేండ్లలో చేసిన అభివృద్ధి ట్రైలర్​ మాత్రమేనని, చేయాల్సిన అభివృద్ధి ఇంకా ఉన్నదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కాంగ్రెస్​ పార్టీ దేశ సైనికులను అవమానించిందని, ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు కోసం ప్రజల మధ్య విభజన తెచ్చిందని మండిపడ్డారు. రాజస్థాన్​లోని చురులో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మోదీ పాల్గొని, ప్రసంగించారు. ‘ఇప్పటివరకూ ఏంజరిగినా.. ఏంచేసినా అది ట్రైలర్​ మాత్రమే. ఇంకా చేయాల్సిన అభివృద్ధి ముందుంది. ఇంకా ఎన్నో కలలున్నాయి. దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సి ఉన్నది’ అని తెలిపారు. ‘ఇది నయా భారత్​.. మనతో పెట్టుకుంటే సరిహద్దులు దాటి, శత్రువుల ఇంట్లోకి చొచ్చుకెళ్లి మరీ దాడిచేస్తాం. ఇది సరికొత్త ఇండియా అని, ఇక్కడ ఉన్నది మోదీ అని ఇప్పుడు శత్రువులకు కూడా తెలుసు’ అంటూ పాకిస్తాన్​పై జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ ను మోదీ పరోక్షంగా ప్రస్తావించారు. 

కాంగ్రెస్​ పాలనలో దేశం అధోగతి పాలైందని, దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అయ్యిందని మోదీ మండిపడ్డారు. ‘కాంగ్రెస్​ స్కాంలు, దోపిడీ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. ప్రపంచంలో భారత కీర్తి మసకబారింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన దశాబ్దాల తర్వాత కూడా ప్రజలు కనీస అవసరాల కోసం కష్టపడాల్సి వచ్చింది’ అని అన్నారు. ‘2014 వరకు ప్రజలు ఇక ఏమీ మారదని భావించారు. నిరాశలో మునిగిపోయారు. ఆ తర్వాత పేదలకు సేవచేసే అవకాశాన్ని మీ కొడుకు మోదీకి ఇచ్చారు. నిరాశ, నిస్పృహలు మోదీ చుట్టుపక్కలకు రాలేవు. అందుకే దేశంలో నెలకొన్న పరిస్థితిని మార్చాలని అనుకున్నా’ అని చెప్పారు. దేశం మొత్తాన్ని తన కుటుంబంగా భావించానని తెలిపారు. కొవిడ్–19 లాంటి విపత్కర పరిస్థితుల్లో భారత్​ నాశనమవుతుందని ప్రపంచం మొత్తం భావించిందని, కానీ మనమంతా కలిసి దేశాన్ని ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టుకున్నామని చెప్పారు. 

‘అయోధ్య’పై నోరుమూసుకున్న కాంగ్రెస్

అయోధ్య రామమందిర నిర్మాణం విషయంలో కాంగ్రెస్​ఎప్పుడూ మౌనపాత్రే పోషించిందని మోదీ దుయ్యబట్టారు. ఎప్పుడు అయోధ్య రామమందిర నిర్మాణం గురించి చర్చ వచ్చినా.. నోర్లు మూసుకోవాలని అన్ని కాంగ్రెస్​ యూనిట్లకు ఆ పార్టీ హైకమాండ్​ ఆదేశాలు జారీచేసిందని అన్నారు. ఒకవేళ రామనామం ఎత్తుకుంటే.. తమ పార్టీ కి ఎక్కడ రామ్​రామ్​(గుడ్​ బై) అవుతుందోనని భయపడ్డారని కాంగ్రెస్​ను ఎద్దేవా చేశారు. తాను దేశంనుంచి అవినీతిని పారదోలాలని చూస్తుంటే.. ప్రతిపక్ష ఇండియా కూటమి అవినీతిని రక్షించాలని చూస్తున్నదని మండిపడ్డారు. ఆ కూటమి ఎన్నికల కోసం కాకుండా.. అవినీతిపరులను కాపాడాలని ర్యాలీలు చేస్తున్నదని విమర్శించారు.

ఈడీ ఒక్కటే ఈ పదేండ్లలో రూ. లక్ష కోట్లకుపైగా ఆస్తులను జప్తుచేసిందని, అవినీతిపరులపైన చర్యలు తీసుకోకూడదా? అని ఆయన ప్రజలను ప్రశ్నించారు. ప్రతిపక్షాలు తనపై ఎన్ని దుష్ప్రచారాలు చేసినా తాను భయపడబోనని చెప్పారు.  ‘కాంగ్రెస్​, ఇండియా కూటమికి వారి స్వప్రయోజనాలే ముఖ్యం. పేదలు, దళితులు, వెనుకబడిన వర్గాల సంక్షేమం, ఆత్మగౌరవం వారికి పట్టదు. వారు రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్​ అంబేద్కర్​కు కూడా గౌరవం ఇవ్వలేదు. ​ దశాబ్దాలుగా అంబేద్కర్​కు భారతరత్న రాకుండా అడ్డుకున్నది కాంగ్రెస్​ పార్టీనే’ అని పేర్కొన్నారు. కానీ, తాను దశాబ్దాల డిమాండ్లను నెరవేర్చానని చెప్పారు. బీజేపీ.. దేశానికి దళితుడిని, గిరిజన మహిళను రాష్ట్రపతిగా చేసిందని అన్నారు.

దేశమంతటా ‘మోదీ గ్యారెంటీ’ పైనే చర్చ

ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా ‘మోదీ గ్యారెంటీ’పైనే చర్చ నడుస్తున్నదని ప్రధాని మోదీ తెలిపారు. ఇందుకు రాజస్థాన్​ రాష్ట్రమే ఉదాహరణ అని, ఇక్కడ ఎంతో వేగంగా మోదీ గ్యారెంటీని నెరవేర్చామని చెప్పారు. ‘పేదలకు తక్కువ ధరకే వంటగ్యాస్​ సిలిండర్​ ఇస్తానని హామీ ఇచ్చా.. అది నెరవేర్చా. కాంగ్రెస్​ పేపర్​ లీక్​ ఘటనపై విచారణ చేయిస్తానని చెప్పి, చేసి చూపించా’ అని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలో ఉన్నప్పుడు  ఈస్టర్న్​ రాజస్థాన్​ కెనాల్​ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపేసిందని, కానీ.. బీజేపీ అధికారంలోకి రాగానే ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతి ఇవ్వడంతోపాటు పనులు కూడా ప్రారంభించినట్టు చెప్పారు. బీజేపీ ఏం చెప్పిందో అది చేసిందని అన్నారు. మిగతా పార్టీల్లాగా ఎన్నికల హామీలను బీజేపీ కాగితాలకే పరిమితం చేయదని, వాటిని నెరవేరుస్తుందని తెలిపారు. 2019 ‘సంకల్ప్​ పాత్ర’లో ఇచ్చిన దాదాపు అన్ని హామీలను నెరవేర్చినట్టు చెప్పారు.

ఆర్మీ జవాన్లనూ ​అవమానించిన కాంగ్రెస్

కాంగ్రెస్​ పార్టీ దేశ సైనికులనూ  అవమానించిందని ప్రధాని మోదీ మండిపడ్డారు. ఎయిర్​స్ట్రైక్స్​, సర్జికల్​ స్ట్రైక్స్​ జరిగినప్పుడు కాంగ్రెస్​ నాయకులు ప్రూఫ్స్​ అడిగి  ఆర్మీ జవాన్ల పోరాటాన్ని అపహాస్యం చేశారని దుయ్యబట్టారు. తమ స్వలాభం, స్వార్థం, గుర్తింపుకోసం దేశ ప్రజల మధ్య విభజన తెచ్చేందుకు కాంగ్రెస్​ యత్నించిందని మండిపడ్డారు. ఇతరులను ప్రసన్నం చేసుకునేందుకు కాంగ్రెస్​ నాయకులు ఎంతవరకైనా వెళ్తారని ఈ దేశ ప్రజలు చూశారని.. ఏకంగా రాముడినే ఊహాజనిత పాత్ర అని కోర్టులో చెప్పారని గుర్తుచేశారు.

అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తయ్యి దేశ ప్రజలంతా సంబురాలు చేసుకుంటుంటే.. కాంగ్రెస్​ పార్టీ మాత్రం దేశ ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసిందని అన్నారు. ట్రిపుల్​తలాక్​చట్టాన్ని ప్రస్తావిస్తూ.. ఇది ముస్లిం సోదరీమణుల జీవితాలనే కాకుండా.. ముస్లిం కుటుంబాలను కూడా రక్షించిందని చెప్పారు. కాగా, ఈ ఎన్నికల ర్యాలీలో మోదీతోపాటు రాజస్తాన్​ సీఎం భజన్​లాల్​ శర్మ,  చురు బీజేపీ ఎంపీ అభ్యర్థి దేవేంద్ర జఝారియా కూడా మాట్లాడారు.