
- నాటి ఆర్జేడీ ఆటవిక పాలనవల్లే నేటికీ బిహారీల వలసలు..
- పాట్నాలో 62 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించిన మోదీ
- గత రెండేండ్లలోనే 50 లక్షల మంది యువతకు ఉపాధి
- కర్పూరీ ఠాకూర్ జన్ నాయక్ బిరుదును కొట్టేసే యత్నం
- రాహుల్ గాంధీపై పరోక్ష విమర్శలు
న్యూఢిల్లీ: ఓబీసీ నేత, మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్‌కు ఉన్న జన్నాయక్ బిరుదును కొట్టేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీపై ప్రధాని నరేంద్ర మోదీ పరోక్ష విమర్శలు చేశారు. కర్పూరీ ఠాకూర్‌ను సోషల్ మీడియా ట్రోల్స్ ‘జన్ నాయక్’ను చేయలేదని, బిహార్ ప్రజలు ఆయన జీవితాన్ని చూసి అలా పిలిచారని గుర్తుచేశారు.
ఈ బిరుదును ఎవరూ దొంగిలించలేరని అన్నారు. జన్ నాయక్ బిరుదును దొంగలించాలనుకునేవారి పట్ల బిహార్ ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. శనివారం బిహార్ రాజధాని పాట్నాలో స్కిల్స్, ఎడ్యుకేషన్‌కు సంబంధించి రూ.62 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు.
అలాగే, ఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో పీఎం-సేతు పథకాన్ని వర్చువల్‌గా స్టార్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇది విద్యార్థుల విద్యా, నైపుణ్యాభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పారు. ముఖ్యంగా బిహార్ యువతకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. గత రెండేండ్లలోనే బిహార్ ప్రభుత్వం 5ం లక్షల మంది యువతకు ఉపాధి కల్పించిందని మోదీ పేర్కొన్నారు.
ఆర్జేడీ హయాంలో కుంటుపడిన విద్యావ్యవస్థ
ఆర్జేడీ హయాంలో బిహార్‌లో విద్యావ్యవస్థ నిరాధరణకు గురై, కుంటుపడిందని ప్రధాని మోదీ తెలిపారు. ఆ పార్టీ ఆటవిక పాలన కారణంగా యువత వలసలు వెళ్లాల్సి వచ్చిందని అన్నారు. పిల్లలకు సరైన విద్యావకాశాలు దొరకలేదని ఆరోపించారు. అభివృద్ధి లేకపోవడంతో పేదరికంలో ఉన్న పేరెంట్స్ పిల్లలను బడులకు బదులుగా పనులకు పంపారని చెప్పారు. బిహార్ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదని మండిపడ్డారు.
ఓ కాంగ్రెస్ నేత మాత్రం ఎన్నికలు ఎక్కడుంటే అక్కడ వాలిపోతారని, అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేస్తారని రాహుల్‌గాంధీని పరోక్షంగా విమర్శించారు. నితీశ్‌కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు హయాంలోనే బిహార్ ప్రగతి పరుగులు పెడుతున్నదని, ఎంతో అభివృద్ధి చెందిందని ప్రశంసించారు. ఇప్పుడు ఆ కాంగ్రెస్ నాయకుడి అబద్ధపు ప్రచారాలను బిహారీలు నమ్మే పరిస్థితి లేదన్నారు.
తమ ప్రభుత్వం గత దశాబ్దంలో దేశంలో 5 వేల ఐటీఐలను ప్రారంభించిందని, అవి ఇండస్ట్రియల్ఎడ్యుకేషన్కు ముఖ్యమైన కేంద్రంగా మాత్రమే కాకుండా ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యానికి వర్క్‌షాప్‌లుగా పనిచేస్తున్నాయని తెలిపారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చాకే దేశం వేగంగా అభివృద్ధి చెందుతున్నదని అన్నారు. ప్రస్తుతం ప్రపంచంలోనే భారత్ మూడో అతిపెద్ద ఆర్థికశక్తిగా రూపుదిద్దుకునేందుకు సిద్ధమవుతున్నదని వెల్లడించారు.