న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 25, 26 తేదీల్లో ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు. ఆదివారం అమెరికన్ యూదు సంస్థల అధ్యక్షుల సదస్సు ఇజ్రాయెల్ రాజధాని జెరూసలెంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ.."పార్లమెంట్ ప్రసంగం రూపొందుతోంది. వచ్చే వారం ఇక్కడికి నరేంద్ర మోదీ వస్తున్నారు. ఇజ్రాయెల్, భారత్ మధ్య అద్భుతమైన రిలేషన్ షిప్ ఉంది. ఇండియా చిన్న దేశం కాదు. అక్కడ 140 కోట్ల జనాభా ఉంది. ఇండియా చాలా శక్తిమంతమైన దేశం" అని పేర్కొన్నారు.
జెరూసలేంకు చెందిన ఓ అధికారి మాట్లాడుతూ.. ఫిబ్రవరి 25 నుంచి 26 వరకు ఇజ్రాయెల్‌లో ప్రధాని మోదీ పర్యటించే అవకాశం ఉందన్నారు. మోదీకి ఇజ్రాయెల్‌లోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ ఉందని తెలిపారు. ఆయన పర్యటన ప్రభావం చాలా తీవ్రంగా ఉండనుందని వెల్లడించారు. ఈ టూర్ లో మోదీ ఇజ్రాయెల్ నెస్సెట్ (పార్లమెంట్)ను ఉద్దేశించి ప్రసంగించనున్నారని వివరించారు. రెండు రోజుల పర్యటనలో ఇరుదేశాల ద్వైపాక్షిక అంశాలను కూడా చర్చించనున్నట్లు పేర్కొన్నారు.
