రాష్ట్రపతి ఎన్నికల్లో తొలి ఓటు వేసిన మోడీ

రాష్ట్రపతి ఎన్నికల్లో తొలి ఓటు వేసిన మోడీ

రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ మొదలైంది. పార్లమెంట్ లో ప్రధాని మోడీ, పలువురు కేంద్రమంత్రులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.  తమిళనాడు అసెంబ్లీలో సీఎం స్టాలిన్, యూపీ అసెంబ్లీలో  సీఎం యోగి ఆదిత్యానాథ్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.  ఎంపీలు పార్లమెంట్ లో, ఎమ్మెల్యేలు  ఆయా రాష్ట్రాల అసెంబ్లీలో తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.

ఎన్నికల రిటర్నింగ్  అధికారి అయిన రాజ్యసభ సెక్రెటరీ జనరల్ ఆధ్వర్యంలో 21న పార్లమెంటులో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అదే రోజు రాత్రి ఫలితారు ప్రకటిస్తారు. ఈనెల 25న 15వ రాష్ట్రపతిగా గెలిచిన అభ్యర్థి ప్రమాణస్వీకారం చేస్తారు. NDA తరఫున గిరిజన మహిళ ద్రౌపది ముర్ము, విపక్షాల నుంచి యశ్వంత్  సిన్హా బరిలో ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓటు వేసి రాష్ట్రపతిని ఎన్నుకోనున్నారు. మెజారిటీ ఓట్లు సాధించిన వ్యక్తి రాష్ట్రపతి పీఠాన్ని దక్కించుకోనున్నారు.



ఎంపీలు, ఎమ్మెల్యేల ఓటు విలువ వేర్వేరుగా ఉండటం వల్ల వారి ఓట్లను గుర్తించేందుకు వీలుగా గ్రీన్, పింక్ బ్యాలెట్  పేపర్లను అందుబాటులో ఉంచింది EC. గ్రీన్ బ్యాలెట్  పేపర్ లో ఎంపీలు, పింక్  పేపర్ లో ఎమ్మెల్యేలు తమ ఓటు వేయనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎంపీల ఓటు విలువలను 1971 జనాభా లెక్కలకు అనుగుణంగా నిర్ధారిస్తారు. జనాభా, శాసనసభ స్థానాలను బట్టి ఆయా రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓటు విలువ మారుతుంటుంది.

అధికంగా ఉత్తరప్రదేశ్ కు చెందిన సగటు ఎమ్మెల్యే ఓటు విలువ 208 కాగా.. ఝార్ఖండ్ -తమిళనాడు రాష్ట్రాలకు అది 176గా ఉంది. అలాగే మహారాష్ట్రలో 175, సిక్కిం 7, మిజోరాం 8, నాగాలాండ్ లో 9గా ఎమ్మెల్యే ఓటు విలువ ఉంది. ప్రస్తుతం రాష్ట్ర ఎమ్మెల్యే ఓటు విలువ 132 కాగా.. ఏపీ ఎమ్మెల్యే ఓటు విలువ 159గా ఉంది. ప్రస్తుతం సగటు ఎంపీ ఓటు విలువ 700గా ఉంది. దేశంలో ప్రస్తుతం ఎమ్మెల్యేలు, ఎంపీల ఓటు విలువ మొత్తంగా... 10 లక్షల 86 వేల 431గా ఉంది. ఇందులో మెజారిటీ ఓట్లు సాధించిన అభ్యర్థి రాష్ట్రపతిగా ఎన్నికవుతారు. 

రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రధాన అభ్యర్థుల్లో NDA కూటమి నిలబెట్టిన ముర్ముకే విజయవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. NDA కూటమిలోని పార్టీలతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీలు సైతం ముర్ముకే మద్దతు ప్రకటించాయి. బిజు జనతా దళ్, అన్నా డీఎంకే, YSRCP, BSP, TDP, JDS, JMM, శివసేన, శిరోమణి అకాలీదళ్, జనసేన లాంటి ప్రాంతీయ పార్టీలు ముర్ముకే మద్దతు ప్రకటించాయి. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు కాంగ్రెస్ సహా తృణమూల్ కాంగ్రెస్, NCP, TRS, ఆమ్ ఆద్మీ పార్టీ, DMK, CPI, CPI-M, సమాజ్ వాద్ పార్టీ, RJD లాంటి పార్టీలు యశ్వంత్ సిన్హాకు మద్దతిస్తున్నాయి. దీంతో మూడోవంతు ఓట్లు ఎన్డీఏ అభ్యర్థికే దక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి. 

ఇప్పటికే ఏకంగా 60 శాతానికి పైగా ఓట్లు కూడగట్టుకున్న ముర్ముకు మూడింట రెండొంతుల మెజారిటీ సాధించేలా కన్పిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు చెందిన 10 లక్షల 86 వేల 431 ఓట్లలో 6 లక్షల 67వేల ఓట్లు ముర్ముకే వస్తాయని అంచనా. దీంతో రాష్ట్రపతి పదవికి ఎన్నికైన తొలి గిరిజన మహిళగా ముర్ము రికార్డు సృష్టించనున్నారు. అంతేగాక ప్రతిభా పాటిల్ తర్వాత ఈ అత్యున్నత పదవి చేపట్టనున్న రెండో మహిళ అవుతారు.

రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలక్టోరల్  కాలేజీలో ఎన్నికైన పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు ఉంటారు. నామినేటెడ్  ఎంపీలు, ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులకు ఓటు హక్కుండదు. సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్  జరుగుతుంది. ఫలానా అభ్యర్థికే ఓటేయాలంటూ పార్టీలు తమ ఎంపీలు, ఎమ్మెల్యేలకు విప్  జారీ చేయలేవు. కాబట్టి క్రాస్ ఓటింగ్ కు అవకాశముంటుంది.