రూ. 26 లక్షలు పెరిగిన మోడీ ఆస్తి

రూ. 26 లక్షలు పెరిగిన మోడీ ఆస్తి

ప్రధాని నరేంద్ర మోడీ ఆస్తులు రూ. 2.23 కోట్లుగా పీఎంవో ప్రకటించింది. గతేడాది మార్చి 2021 చివరి నుంచి  ఈ ఏడాది మార్చి 31 2022 నాటికి మోడీ ఆస్తులు  రూ. 1,97,68,885 నుండి రూ. 2,23,82,504 కోట్లకు పెరిగినట్లు పీఎంవో పేర్కొంది.  మొత్తంగా 2021 -22 సంవత్సరంలో నరేంద్ర మోడీ చరాస్తుల విలువ రూ. 26.13 లక్షలు పెరిగినట్లు పీఎంవో వెబ్‌సైట్ వెల్లడించింది.

అన్నీ చరాస్తులే..
గుజరాత్ రెసిడెన్షియల్ ప్లాట్‌లో ప్రధాని మోడీకి ఉన్న వాటాను విరాళంగా ఇచ్చారని.. దీంతో ఆయన పేరిట ఎలాంటి స్థిరాస్తులు లేవని పీఎంవో తెలిపింది. మార్చి 31 2022 వరకు ప్రధాని మోడీ చరాస్తుల విలువ రూ. 2,23,82,504 కోట్లకు చేరిందని పీఎంవో వెల్లడించింది. ఇందులో ఆర్థిక సంస్థ స్థిరత్వం, నేషన్ వైడ్ ఫైనాన్షియల్ సేవింగ్స్ సర్టిఫికేట్లు, డిపాజిట్ల పెరుగుదల,  జీవిత బీమా కవరేజ్, బీమా పాలసీలు, నగదు ఉన్నాయని పేర్కొంది. 

తగ్గిన బ్యాంక్ బ్యాలెన్స్..
మోడీ  చేతిలో ఉన్న నగదు గతేడాది రూ. 36,900 నుండి రూ. 35,250కి స్వల్పంగా తగ్గింది. ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ మార్చి 31, 2021 నాటికి  రూ. 1,52,480 నుండి రూ. 46,555కు తగ్గింది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (రూ. 8.9 లక్షలు),  రూ. 1.5 లక్షల విలువైన జీవిత బీమా పాలసీలు, ఎల్ అండ్ టీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండ్‌ల రూపంలో మోడీ పెట్టుబడులు పెట్టారని వెల్లడించింది. వీటిని 2012లో రూ. 20,000కు కొనుగోలు చేశారని హిందుస్థాన్ టైమ్స్ 2021లో తన నివేదిక పేర్కొంది. మోడీ డిక్లరేషన్‌లో ఏడాది క్రితం రూ.1.48 లక్షల విలువైన నాలుగు బంగారు ఉంగరాలు కూడా ఉన్నాయి. 

మోడీ ఆస్తుల పెరుగుదలకు కారణం..
ప్రధాని మోడీ ఆస్తులు  పెరగడానికి కారణం.. ప్రభుత్వం నుంచి పొందే జీతాన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టడమే.  వాటి వల్ల వచ్చే వడ్డీని తిరిగి పెట్టుబడి పెట్టడం వల్ల మోడీ ఆదాయంలో వృద్ధి నమోదైంది.  

కేంద్ర మంత్రులు ఆస్తులు ఎన్ని..?
ప్రధాని మోడీ ఆస్తులతో పాటు..పలువురు కేంద్రమంత్రుల ఆస్తుల జాబితాను కూడా పీఎంవో  వెల్లడించింది.  రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేరిట రూ. 2.54 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయని పేర్కొంది. ఈ ఏడాది రాజ్ నాథ్ సింగ్  ఆస్తుల విలువ రూ.29.58 లక్షలు పెరిగిందని ప్రకటించింది. అలాగే ధర్మేంద్ర ప్రధాన్ ఆస్తులు రూ.1.62 కోట్ల నుంచి రూ.1.83 కోట్లకు పెరిగాయని తెలిపింది.  పురుషోత్తం రూపాలా ఆస్తుల విలువ రూ.7.29 కోట్లుగా.. జ్యోతిరాదిత్య సింధియా పేరిట రూ. 35.63 కోట్ల ఆస్తులున్నాయని చెప్పింది. అలాగే సింధియాకు రూ.58 లక్షల అప్పులు ఉన్నాయని ప్రకటించింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆస్తుల విలువ రూ.1.43 కోట్లు అని పేర్కొంది. 

మోడీ ప్రధాని, భారత రత్న అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో.. పబ్లిక్ డొమైన్‌లో పారదర్శకతను కొనసాగించడానికి ప్రతి ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ప్రధాని సహా కేంద్ర మంత్రులందరూ తమ ఆస్తులను ప్రకటించాలని నిర్ణయించారు. అప్పటి నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతోంది.