దేశంలో కరోనా పరిస్థితిపై ప్రధాని రివ్యూ

దేశంలో కరోనా పరిస్థితిపై ప్రధాని రివ్యూ
  • పండుగలప్పుడు మరింత జాగ్రత్త: మోడీ
  • నిఘా, టెస్టింగ్.. జీనోమ్ సీక్వెన్సింగ్ పెంచాలి
  • కరోనా సంబంధిత సౌలత్‌‌‌‌లపై ఆడిట్ చేయాలని రాష్ట్రాలకు సూచన

న్యూఢిల్లీ, వెలుగు: ప్రపంచంలోని పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిర్లక్ష్యంగా ఉండొద్దని ప్రధాని నరేంద్ర మోడీ హెచ్చరించారు. కరోనా కథ ఇంకా ముగిసిపోలేదని, కొవిడ్ రూల్స్‌‌ను ప్రజలు పాటించాలని, రద్దీ ప్రాంతాల్లో మాస్క్‌‌లు పెట్టుకోవాలని సూచించారు. పండుగల సీజన్‌‌లో అత్యంత జాగ్రత్తగా ఉండాలని కోరారు. ప్రస్తుతం కొనసాగుతున్న సర్వైలెన్స్ చర్యలను పటిష్టం చేయాలని, ముఖ్యంగా అంతర్జాతీయ విమానాశ్రయాల్లో నిఘా పెంచాలని అధికారులకు సూచించారు. దేశంలో కరోనా పరిస్థితి.. ఆరోగ్య మౌలిక సదుపాయాలు.. వ్యాక్సినేషన్‌‌ పరిస్థితి.. కొత్తగా వచ్చిన వేరియంట్లు – ప్రజల ఆరోగ్యంపై అవి చూపించే ప్రభావం తదితరాలను అంచనా వేసేందుకు ప్రధాని అధ్యక్షతన గురువారం ఉన్నత స్థాయి రివ్యూ జరిగింది. గురువారం వర్చువల్‌‌గా జరిగిన మీటింగ్‌‌లో కేంద్ర మంత్రులు మన్సుఖ్ మాండవీయ, అమిత్ షా, జ్యోతిరాదిత్య సింధియా, జైశంకర్, అనురాగ్ ఠాకూర్, హెల్త్ ఎక్స్‌‌పర్టులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో మంత్రులు, హెల్త్ ఎక్స్‌‌పర్టుల నుంచి ప్రధాని సలహాలు, సూచనలు కోరారు. కొత్త వేరియంట్‌‌ను ఎదుర్కొనేందుకు అవసరమైన గైడ్ లైన్స్‌‌ను ఉన్నాతాధికారులు సూచించారు. తర్వాత ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ప్రకటన రిలీజ్ చేసింది. పెద్దలు, అనారోగ్యంతో ఉన్నోళ్లు ప్రికాషనరీ డోసు వేసుకోవాలని ప్రధాని సూచించినట్లు పీఎంవో తెలిపింది. 

రాష్ట్రాల నుంచి శాంపిల్స్‌‌ పంపండి

జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం ఏర్పాటు చేసిన ఇన్సాకాగ్ జీనోమ్ సీక్వెన్సింగ్ లేబొరేటరీస్ (ఐజీఎస్‌‌ఎల్)తో ఎక్కువ సంఖ్యలో శాంపిల్స్‌‌ను ప్రతిరోజూ పంచుకోవాలని రాష్ట్రాలను కోరినట్లు పీఎంవో తెలిపింది. పరికరాలు, మెడికల్ ఉద్యోగుల పరంగా అన్ని స్థాయిల్లో కరోనాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని మోడీ స్పష్టం చేశారు. ఆక్సిజన్ సిలిండర్లు, పీఎస్‌‌ఏ ప్లాంట్లు, వెంటిలేటర్లు, మెడికల్ స్టాఫ్ తదితర సౌలత్‌‌లపై ఆడిట్ చేయాలని రాష్ట్రాలకు ప్రధాని సూచించారు. 

పార్లమెంట్‌‌కు మాస్క్‌‌తో వచ్చిన మోడీ

కొత్త కేసులు నమోదవుతున్నందున గురువారం పార్లమెంట్‌‌కు ఎంపీలందరూ మాస్క్‌‌తో హాజరయ్యారు. రాజ్యసభకు వచ్చిన మోడీ.. మాస్క్‌‌తో కనిపించారు. సభ సాగుతున్న తీరును ఓ అరగంటపాటు గమనించారు. ఆపై అక్కడి నుంచి వెళ్లిపోయారు. సమావేశాలను చూసేందుకు వచ్చే విజిటర్లకు సిబ్బంది మాస్క్​లు అందజేశారు.

విదేశాల నుంచి వచ్చేటోళ్లకు ర్యాండమ్​గా టెస్టులు: మాండవీయ

విదేశాల నుంచి వచ్చే ప్యాసింజర్లకు ఎయిర్ పోర్టుల్లో ర్యాండమ్ గా కరోనా టెస్టులు చేస్తున్నట్లు కేంద్ర హెల్త్ మినిస్టర్ మన్ సుఖ్ మాండవీయ వెల్లడించారు. దేశంలో ప్రస్తుత కరోనా సిచుయేషన్ పై గురువారం పార్లమెంటు ఉభయసభల్లో ఆయన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. విదేశాల నుంచి వస్తున్నవారిలో 2 శాతం మందికి ర్యాండమ్ గా టెస్టులు చేస్తున్నామని చెప్పారు. మున్ముందు పరిస్థితిని బట్టి టెస్టుల శాతం పెంచుతామని, అవసరమైతే అందరికీ టెస్టులు చేయిస్తామన్నారు. చైనా నుంచి ఇండియాకు డైరెక్ట్ ఫ్లైట్లు ఏవీ లేవని, కానీ వేరే రూట్లలో ఇక్కడికి వస్తున్నారని తెలిపారు. వివిధ దేశాలతో పాటు డబ్ల్యూహెచ్ వోతోనూ తాను మాట్లాడానని, కరోనా ఏ దిశలో వ్యాప్తి చెందుతున్నది పరిశీలిస్తున్నానని వెల్లడించారు. దేశంలోకి తెలియని వేరియంట్లు ఏవీ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పారు. మందులు, వ్యాక్సిన్ లు, ఆక్సిజన్ ప్లాంట్ల అందుబాటుపై రివ్యూ కూడా నిర్వహించామన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్రం పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉందన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సహా పలువురికి కరోనా సోకిందంటూ రాజస్థాన్ కు చెందిన పలువురు ఎంపీలు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలోనే తాను కొవిడ్ ప్రొటోకాల్ పాటించాలంటూ రాహుల్ కు లేఖ రాశానని కేంద్ర మంత్రి తెలిపారు.