
రాచరికం కొందరికి పూలబాట, కొందరికి ముళ్ల కిరీటం. అడుగడుగునా రాచరిక కట్టుబాట్లను పాటిస్తూ పంజరంలో చిలుకలా కనబడాలి. సహజమైన ఫీలింగ్స్ అన్నీ వదులుకుని ఆర్టిఫిషియల్‌గా బతికేయాలి. రాజుగారు, వాళ్ల వారసులు ఎవరిదైనా ఇదే లైఫ్. నిలబడితే తప్పు, కూర్చుంటే ముప్పు, గట్టిగా నవ్వరాదు, నలుగురితో చేతులు కలపరాదు…. ఇలాంటివెన్నో కండిషన్లుంటాయి. వీటిని వదిలించుకోవడానికి ప్రయత్నించినవాళ్లు లేకపోలేదు. మోడర్న్ రాచరికంలో బ్రిటన్ సింహాసనం నుంచి వాలంటీర్‌గా దిగిపోయిన ఎనిమిదో ఎడ్వర్డ్ చక్రవర్తి, కాబోయే రాణి హోదాను వదులుకున్న ప్రిన్స్ డయానాలున్నారు. వాళ్లలాగే, డయానా రెండో కొడుకు ప్రిన్స్ హ్యారీకూడా ఇప్పుడు బకింగ్‌హామ్ ప్యాలెస్ నుంచి వెళ్లిపోవాలనుకుంటున్నారు.
బకింగ్‌హామ్ ప్యాలెస్ బ్రిటిష్ రాణి ఎలిజిబెత్ అధికార నివాసం. ఇప్పటికే ఇక్కడ సింహాసనంకోసం అయిదుగురు కాచుకుని ఉన్నారు. ఆ వరుసలో ఆరోవాడు ప్రిన్స్ హ్యారీ. అతను తన భార్య మెగన్ మార్కెల్తోపాటు రాచరికం నుంచి బయటకొచ్చేసి తన సొంత కాళ్ల మీద నిలబడాలనుకుంటున్నారు. ఫైనాన్షియల్‌గా ఎవరిమీద ఆధారపడకూడదని అనుకుంటున్నాడు. హ్యారీ, మెగన్ తమ ఎనిమిది నెలల కొడుకుతో కలిసి ఈ మధ్యనే ఆరు వారాలపాటు కెనడాలో క్రిస్మస్ సెలవులు గడిపి వచ్చారు. ఆ వెంటనే ‘మేము బ్రిటన్, నార్త్ అమెరికాల మధ్య తిరుగుతూ ఫైనాన్షియల్‌గా నిలబడే ప్రయత్నాలు సాగిస్తాం’ అని ప్రకటించారు. ఇది హ్యారీ దంపతులు సొంతంగా తీసుకున్న నిర్ణయమేనని చెబుతున్నారు. హ్యారీ తన అన్న, సింహాసన వారసుడు ప్రిన్స్ విలియంతోగానీ, నానమ్మ ఎలిజిబెత్ రాణితోగానీ ఎలాంటి మాటముచ్చట జరపకపోవడంతో ప్యాలెస్ వర్గాలు నిర్ఘాంతపోయినట్లు బీబీసీ పేర్కొంది. హ్యారీ–మెగన్లు ‘మాలో మేము ఎన్నో నెలలుగా చర్చించుకుని తీసుకున్న నిర్ణయం’గా చెబుతున్నారు. మెగన్ పాపులర్ నటి. ఆమెకు సోషల్ లైఫ్ చాలా ఇష్టం. ఎంతసేపూ ప్యాలెస్‌లో మూగబొమ్మగా ఉండాలంటే చికాకు. ఎప్పుడైనా గొంతెత్తి మాట్లాడితే ఎడాపెడా విమర్శలు ఎదురవుతుంటాయి. ఈ విషయాన్ని ఆమె పోయినేడాది ఐటీవీకిచ్చిన ఇంటర్వ్యూలో… తాను మహల్లో కోకిలలా ఉంటున్నాను’ అని వాపోయింది. ప్యాలెస్‌లో జరిగే ఏ చిన్న కదలికయినా మీడియాకి పెద్ద వార్తే అవుతుంది. దీనికోసం టాబ్లాయిడ్ పాపరాజీలు (వార్తల కోసం వెంటాడేవాళ్లు) వేయి కళ్లతో కాచుకుని ఉంటారు. పోయిన అక్టోబరులోనే ఒక సందర్భంలో… రాచరికం వారసత్వం వల్ల మీడియా తమను ఎప్పుడూ కనిపెట్టుకుని ఉంటుందని ఓపెన్‌గానే అసంతృప్తి వెలిబుచ్చారు. మెగన్ అత్త గారు, హ్యారీ తల్లి డయానాని కూడా పాపరాజీలు ఇలాగే వెంటాడేవాళ్లు. ఆమె ఆఖరు నిమిషంలోనూ పాపరాజీలు వదలలేదు. ఇదే రకంగా హ్యారీ, మెగన్లను కూడా వేధించడాన్ని తట్టుకోలేక ‘మెయిల్ ఆన్ సన్డే’ టాబ్లాయిడ్‌పై లీగల్ యాక్షన్ తీసుకుంటామన్నారు. మెగన్కి చెందిన వ్యక్తిగత ఉత్తరాలకు తమ కథనం జోడించి పబ్లిష్ చేసిందా టాబ్లాయిడ్. ‘మా అమ్మను ఏ పవర్ఫుల్ శక్తులైతే మింగేశాయో, ఇప్పుడు నా భార్యనుకూడా అవే శక్తులు వేధిస్తున్నాయి. నేను ప్రేమించే వ్యక్తి(డయానా)ని అప్పట్లో కనీసం మనిషిగానైనా చూడలేదు. వ్యాపార వస్తువుగా మార్చేశారు’ అని ప్రిన్స్ హ్యారీ ఆవేదన చెందాడు కూడా.
అయితే, హ్యారీ–మెగన్ జోడీ అనుకున్నంత తొందరగా బకింగ్‌హామ్ ప్యాలెస్ నుంచి బయటపడే దారి లేదంటున్నారు. వాళ్ల నిర్ణయం చాలా తొందరపాటుతో కూడుకున్నదని, చాలా కసరత్తు చేయాల్సి ఉంటుందని ప్యాలెస్ అధికార ప్రతినిధి చెబుతున్నారు. ఇదే మాటని బీబీసీ రాయల్ కరస్పాండెంట్ జానీ డైమండ్ కూడా అంటున్నారు. ‘ఈ ఎపిసోడ్లో ప్రిన్స్ హ్యారీ–మెగన్ ఒకవైపు, రాయల్ ఫ్యామిలీ మొత్తం ఒకవైపు ఉన్నాయి. ఇది చాలా పెద్ద తగాదాకి దారి తీస్తుంద’న్నారు జానీ. ఎలిజిబెత్ రాణి రెండో కొడుకు ప్రిన్స్ ఆండ్రూ పోయినేడాది నవంబర్‌లో బలవంతంగా రాచరికానికి దూరం కావలసి వచ్చింది. ఆయన గతంలో శిక్షకు గురైన సెక్స్ అఫెండర్ జెఫ్రీ ఎప్స్టీన్తో సంబంధాలు పెట్టుకున్నారని ఆరోపణలొచ్చాయి. దీనిపై బీబీసీలో న్యూస్‌నైట్ ప్రోగ్రాంలో ఇంటర్వ్యూకూడా వచ్చింది. చిన్నాన్న ఆండ్రూ బకింగ్హమ్ ప్యాలెస్ నుంచి బలవంతంగా బయటకు వెళ్తే, ప్రిన్స్ హ్యారీ తనంతటతానుగానే వెళ్లిపోవాలనుకుంటున్నారు.
మెగన్ను ఆదరించిన రాచ కుటుంబం
ప్రిన్స్ హ్యారీ.. అందరికీ తెలిసిన పేరే. బ్రిటన్ రాచ కుటుంబానికి చెందినవాడు. కానీ, మెగన్ మార్కెల్.. ప్రిన్ హ్యారీని 2018లో పెళ్లి చేసుకునేంత వరకు ఒక నటిగానే తెలుసు. హాలీవుడ్ నటి కావడంతో సెలబ్రిటీ కిందే లెక్క. ప్రిన్స్ హ్యారీని పెళ్లి చేసుకున్నాక మెగన్ వరల్డ్ వైడ్‌గా ఫేమస్ అయింది. మెగన్ మిడిల్ క్లాస్ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. అంతేకాదు ఆఫ్రికన్ మూలాలు ఉన్న అమ్మాయి. మెగన్ తల్లి డోరియా రాగ్లాండ్ ఆఫ్రో–అమెరికన్. తండ్రి థామస్ మార్కెల్ కకాసియన్. మూలాలు నల్లజాతివైనా మెగన్ను పెళ్లి చేసుకుంటానని ప్రిన్స్ హ్యారీ చెప్పినా బ్రిటన్ రాచకుటుంబం అడ్డు చెప్పలేదు. ఆమెను ఆదరించింది. రాయల్ ఫ్యామిలీలో మిగతా అందరితో సమానంగా మెగన్కు కూడా గౌరవం ఇచ్చింది. అప్పటివరకు సొసైటీలో రాచకుటుంబంపై ప్రజలకు అనేక అభిప్రాయాలు ఉండేవి. సామాన్యులను పెద్దగా పట్టించుకోరని, దగ్గరకు రానివ్వరని చాలా మంది చాలా రకాలుగా అనుకునేవాళ్లు. అయితే నల్లజాతి మూలాలు ఉన్న ఓ అమ్మాయికి నిండు మనసుతో రాచ కుటుంబంలోకి వెల్ కం పలకడం చూసి ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. రాయల్ ఫ్యామిలీ పై జనంలో ఉన్న కొన్ని అభిప్రాయాలు అపోహలని తేలిపోయింది.
మునిమనవడిని ఆశీర్వదించిన క్వీన్ ఎలిజిబెత్
ప్రిన్స్ హ్యారీ, మెగన్ దంపతులకు 2019 మేలో కొడుకు పుడితే క్వీన్ ఎలిజిబెత్ భర్తతో కలిసి వచ్చి మునిమనవడిని చూసి సంతోషించింది. పిల్లాడిని ఆశీర్వదించింది. అంతేకాదు. మెగన్ తల్లి డోరియాతో కలిసి ఫొటో కూడా దిగింది.
అమెరికాలో పుట్టి …
ప్రిన్స్ హ్యారీని పెళ్లి చేసుకుని ప్రపంచం దృష్టిని ఆకర్షించిన మెగన్ మార్కెల్ అమెరికాలో 1981 ఆగస్టు 4న పుట్టింది. స్టూడెంట్ గా ఉన్నప్పుడే టీవీ సీరియల్స్ లో నటించింది. అన్ని రంగాల్లో మగవాళ్లతో సమానంగా ఆడవాళ్లకు కూడా హక్కులు ఉండి తీరాలంది. దీనికోసం జరిగిన ఉద్యమాల్లో పాల్గొంది. ఇలా ఒకవైపు పబ్లిక్ లైఫ్‌లో ఉంటూనే మరో వైపు ఫ్యాషన్ వరల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తన మార్క్ స్టైల్‌తో ఒక ఐకాన్‌గా మారింది. ‘గెట్ హిమ్ టు ది గ్రీక్ ’, ‘ రిమెంబర్ మి ’, ‘హారిబుల్ బాసెస్’ వంటి సినిమాలతో సినీ ప్రేక్షకులకు దగ్గరైంది. నటుడు, నిర్మాత అయిన ట్రెవెర్ ఎంజెల్సన్ ను పెళ్లాడింది. రెండేళ్లకు ఇద్దరూ విడిపోయారు. తరువాత ప్రిన్స్ హ్యారీతో ప్రేమలో పడి, పెళ్లి చేసుకుంది. మెగన్కు రాజకీయంగా కొన్ని కచ్చితమైన అభిప్రాయాలున్నాయి. 2016 నాటి అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లో హిల్లరీకి సపోర్ట్ ఇచ్చింది. ‘ఎయిడ్స్ డే’, ‘ఇంటర్నే షనల్ ఉమెన్స్ డే’ వంటివి చాలా గ్రాండ్‌గా చేసుకుంటారు.
బాగా ఆలోచించాం
ఈ నిర్ణయం తీసుకోవడానికి ముందు అనేక నెలల పాటు తర్జనభర్జనలు పడ్డాం. చాలాసార్లు మాలో మేమే మాట్లాడుకున్నాం. చర్చలు జరుపుకున్నాం. చివరకు రాయల్ ఫ్యామిలీలో సీనియర్ మెంబర్లుగా ఉండకూడదన్న నిర్ణయానికి వచ్చాం. డబ్బు కోసం ఎవరిపైనా ఆధారపడకుండా మా కాళ్లపైన మేం నిలబడాలను కుంటున్నాం. క్వీన్ ఎలిజిబెత్‌కు నూటికి నూరు శాతం విధేయులుగా భవిష్యత్తులోనూ కొనసాగుతాం. రాచకుటుంబానికి దూరంగా వెళుతున్నాం. మా చిన్నారి ఆర్కీని రాయల్ ఫ్యామిలీ మెంబర్‌గానే పెంచుతాం. ఉత్తర అమెరికాలో కొత్త జీవితం మొదలెడతాం.
– ప్రిన్స్ హ్యారీ, మెగన్ మార్కెల్
67 ఏళ్లుగా మహారాణి……
క్వీన్ ఎలిజిబెత్.. పేరులోనే ‘క్వీన్’ ఉన్నా ఆమె బ్రిటన్ రాచరికానికి, పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మధ్య ఓ వారధిలా నిలిచారు. బ్రిటన్ రాజ దంపతులు ప్రిల్స్ ఆల్బర్ట్, ఎలిజిబెత్ లకు తొలి సంతానంగా 1926 ఏప్రిల్ 21న లండన్‌లోని అమ్మమ్మ ఇంట్లో పుట్టింది. చిన్నారిగా ఉన్నప్పుడు ఎప్పుడూ గుర్రాలతో ఆడుకునేది. రాజ దంపతులకు కొడుకులెవరూ లేకపోవడంతో బ్రిటన్ సింహాసనానికి ఆమే వారసురాలైంది. 1936లో ఎలిజిబెత్ ను యువరాణిగా ప్రకటించింది రాచకుటుంబం. 13వ ఏట డెన్మార్క్ యువరాజు ప్రిన్స్ ఫిలిప్ ను ఓ ఫంక్షన్ లో కలుసుకుంది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ప్రేమ నడిచింది. ఇద్దరి కుటుంబాలు అంగీకరించడంతో 1947 నవంబర్ 20న పెళ్లి జరిగింది. 1953లో ఎలిజిబెత్ బ్రిటన్ మహారాణి అయ్యారు. అంగరంగ వైభవంగా పట్టాభిషేకం జరిగింది. అప్పటి నుంచి రాచ కుటుంబంలో ఎలిజిబెత్ యుగం మొదలైంది. బ్రిటన్ మహారాణిగా ఎలిజిబెత్ కొనసాగుతున్నారు. 67 ఏళ్లుగా క్వీన్ గా కొనసాగుతూ కొత్త రికార్డును సృష్టించారు ఎలిజిబెత్.