ఒక్కో ఇంజనీరింగ్ సీటు రూ.10లక్షలపైనే!

ఒక్కో ఇంజనీరింగ్ సీటు రూ.10లక్షలపైనే!
  • నోటిఫికేషన్​ రాకముందే బీటెక్​ సీట్ల బేరం
  • ఒక్కో ఇంజనీరింగ్ సీటు రూ.10లక్షలపైనే!
  • మేనేజ్‌‌మెంట్ కోటాలో రూ.10 లక్షలకు అమ్ముకుంటున్న ప్రైవేటు కాలేజీలు
  • మేనేజ్‌మెంట్ కోటా సీట్లు అమ్ముకుంటున్న ప్రైవేటు కాలేజీలు
  • కన్వీనర్ కోటా కౌన్సెలింగ్‌ కూడా మొదలుకాక ముందే దందా
  • ఆధారాలతో ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామంటున్న ఆఫీసర్లు

నోటిఫికేషన్​ ఇంకా రానేలేదు.. ప్రైవేట్​ఇంజనీరింగ్ కాలేజీలు అప్పుడే సీట్ల దందా మొదలుపెట్టాయి. నిబంధనలు గాలికొదిలి ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారికి సీట్లు ఇచ్చేస్తున్నాయి. కొన్ని కాలేజీలు సగటున ఒక్కోసీటుకు రూ.10 లక్షల దాకా వసూలు చేస్తున్నాయి. కంప్యూటర్ సైన్స్ లాంటి కోర్సులకు  రూ.15 లక్షల దాకా చెబుతున్నారు. ఇదంతా బహిరంగంగానే సాగుతున్నా సర్కారు తమకేమీ తెలియనట్టు వ్యవహరిస్తోంది.

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. మేనేజ్‌‌మెంట్ సీట్ల భర్తీకి ఇంకా నోటిఫికేషన్ రాకున్నా యాజమాన్యాలు అవేమీ పట్టించుకోవడం లేదు. నిబంధనలు గాలికి వదిలేసి, ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారికి సీట్లను ఇచ్చేస్తున్నాయి. ఇంజనీరింగ్ బ్రాంచ్ ఆధారంగా రేట్లు పెట్టి మరీ అమ్ముకుంటున్నాయి. కొన్ని కాలేజీలు సగటున ఒక్కోసీటుకు రూ.10 లక్షల దాకా వసూలు చేస్తున్నాయి. ఇదంతా బహిరంగంగానే సాగుతున్నా సర్కారు తమకేమీ తెలియనట్టు  వ్యవహరిస్తున్నది.

పేరెంట్స్‌‌తో బేరసారాలు

రాష్ట్రంలో 175 ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా.. వాటిలో 1.05 లక్షల సీట్లకు ఏఐసీటీఈ అనుమతులు ఇచ్చింది. అందులో జేఎన్టీయూ పరిధిలోనే 149 కాలేజీలున్నాయి. ప్రైవేటు కాలేజీల్లో 70% సీట్లు కన్వీనర్ కోటా (ఏ కేటగిరీ) ద్వారా భర్తీ చేస్తుండగా.. మిగిలిన 30% సీట్లు మేనేజ్‌‌మెంట్ కోటా (బీ కేటగిరీ)లో భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మధ్యనే ఎంసెట్ అడ్మిషన్ల షెడ్యూల్‌‌ను ఆఫీసర్లు రిలీజ్ చేశారు. ఈనెల 21 నుంచి అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నది. కన్వీనర్ కోటా పూర్తయిన తర్వాత మేనేజ్‌‌మెంట్ కోటాకు హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ నోటిఫికేషన్ ఇస్తుంది. కానీ కన్వీనర్ కోటా సీట్ల భర్తీ ప్రక్రియ మొదలు కాకముందే.. మేనేజ్‌‌మెంట్ కోటా సీట్ల అమ్మకాలను యాజమాన్యాలు మొదలుపెట్టేశాయి. డిమాండ్ ఉన్న కోర్సుల ఆధారంగా ఫీజులు నిర్ణయించాయి. కొన్ని కాలేజీలు డొనేషన్ల పేరుతో భారీగా వసూలు చేస్తున్నాయి. కంప్యూటర్ సైన్స్ లాంటి కోర్సులకు రూ.5 లక్షల నుంచి రూ.15 లక్షల దాకా ఫీజులు నిర్ణయించాయి. వీటిని ఒక్కో కాలేజీ ఒక్కో రకంగా వసూలు చేస్తున్నది. హైదరాబాద్​లోని ఓ ఉమెన్స్ కాలేజీ రూ.12 లక్షలకు సీటు ఇస్తామంటున్నదని, లంగర్ హౌస్‌‌లోని మరో ప్రైవేటు కాలేజీ రూ.10 లక్షల డొనేషన్ ఇస్తే సీటు ఇస్తామని చెబుతున్నదని పేరెంట్స్ అంటున్నారు. గండిపేటలోని ఓ కాలేజీలో రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల దాకా తీసుకుంటున్నదనే ఆరోపణలున్నాయి. చాలా కాలేజీల్లో మొత్తం ఒకేసారి క్యాష్ రూపంలో కడితేనే ఈ ఫీజులు ఉంటాయని, విడతల వారీగా కడితే ఆ డొనేషన్ మరింత పెరుగుతుందని ఓపెన్‌‌గా పేరెంట్స్‌‌తో బేరసారాలు సాగిస్తున్నాయి.

రూల్స్‌‌ పట్టించుకోవట్లే

కాలేజీల్లో బీ కేటగిరీలో 30% సీట్లను రూల్స్‌‌ ప్రకారమే భర్తీ చేయాలి. మేనేజ్‌‌మెంట్ల సీట్లకు కూడా అప్లికేషన్లను తీసుకొని, జేఈఈ ర్యాంకు ఫస్ట్ ప్రయార్టీ, ఆ తర్వాత ఎంసెట్, ఇంటర్ మార్కులను పరిగణనలోకి తీసుకోవాలి. కానీ ఇవేవీ మేనేజ్‌‌మెంట్లు పట్టించుకోవడం లేదు. నోటిఫికేషన్ టైమ్‌‌లోనూ దరఖాస్తులను స్వీకరించడం లేదు. తీసుకున్నా వాటిని పక్కన పడేస్తున్నాయి. గతేడాది వీటిపై ఫిర్యాదు రావడంతో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్,  టీఏఎఫ్ఆర్సీ స్పందించాయి. దరఖాస్తులు తీసుకోకపోతే తమకు పంపించాలని, వాటిని కాలేజీలకు ఇస్తామని స్పష్టం చేశాయి. సీట్లను ఎలా భర్తీ చేశారనే వివరాలు కౌన్సిల్‌‌కు ఇవ్వాలనే నిబంధన పెట్టారు. అయినా తప్పుడు వివరాలతో కాలేజీలు గట్టెక్కేస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. మేనేజ్‌‌మెంట్ల చర్యలతో తాము కోరుకున్న కాలేజీల్లో సీట్లు పొందలేకపోతున్నామని స్టూడెంట్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయని, వీటిని అరికట్టాలని అధికారులను పేరెంట్స్ కోరుతున్నారు.

కఠిన చర్యలు తీసుకుంటం

మేనేజ్‌‌మెంట్ కోటా సీట్ల భర్తీకి ఇంకా నోటిఫికేషన్ రిలీజ్ చేయలేదు. ఈ టైమ్‌‌లో ఏ కాలేజీ కూడా ఆ సీట్లను భర్తీ చేయొద్దు. ఒకవేళ అలాంటి చర్యలకు పాల్పడితే.. పేరెంట్స్ ఆధారాలతో ఫిర్యాదు చేస్తే ఆయా కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటాం. గతేడాదే మేనేజ్‌‌మెంట్ కోటా సీట్లను ఎలా భర్తీ చేయాలనే దానిపై కాలేజీలకు ప్రొఫార్మా పంపించాం.


- ప్రొఫెసర్ లింబాద్రి, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్

లక్షల్లో డొనేషన్లు

నోటిఫికేషన్ రాకముందే చాలా కాలేజీలు సీట్లకు లక్షల్లో డొనేషన్లు తీసుకుంటున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫీజులను ఏ కాలేజీ కూడా తీసుకోవడం లేదు. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నా.. వాటిల్లో పనిచేసే ఉద్యోగులకు నామమాత్రంగా జీతాలు ఇస్తున్నాయి. ఇలాంటి కాలేజీలపై కఠిన చర్యలు తీసుకోవాలి. 

- సంతోష్ కుమార్,  టీఎస్టీసీఈఏ అధ్యక్షుడు