కరోనా ట్రీట్ మెంట్ కు రోజూ రూ.150 కోట్లు

కరోనా ట్రీట్ మెంట్ కు రోజూ రూ.150 కోట్లు
  • 50 రోజుల్లో రూ. 7,500 కోట్లు
  • లక్షల కుటుంబాలపై ఆర్థిక భారం
  • ఫీజుల కట్టడిలో సర్కార్ ఫెయిల్
  • ప్రభుత్వ దవాఖాన్లలో ట్రీట్​మెంట్
  • ​తీసుకుంటున్నవాళ్లు 30 శాతమే
  • 70 శాతం మంది ప్రైవేట్​కే

హైదరాబాద్, వెలుగు: కరోనా సెకండ్ వేవ్‌తో కుటుంబాలు రోడ్డునపడుతున్నాయి. ప్రైవేటు హాస్పిటళ్లు ఇష్టమొచ్చినట్లు బిల్లులు గుంజుతున్నాయి. ఇందుకోసం కొందరు అప్పుల మీద అప్పులు జేస్తుంటే.. ఇంకొందరు ఉన్న ఆస్తులు, భూములు అమ్ముకుంటున్నారు. సగటున రోజూ రాష్ట్రంలో రూ. 150 కోట్ల వరకు కరోనా ట్రీట్‌మెంట్, మందుల కోసం జనం ఖర్చు చేస్తున్నారు. రాష్ట్రంలో సెకండ్ వేవ్‌లో ఇప్పటివరకూ లక్షన్నర మంది ప్రైవేట్ దవాఖాన్లలో ట్రీట్​మెంట్​ తీసుకున్నారు. ఇందులో ఒక్కో పేషెంట్ సగటున రూ. 5 లక్షల చొప్పున, లక్షన్నర మంది రూ. 7,500 కోట్లు ప్రైవేట్ సంస్థలకు ఫీజులుగా చెల్లించారు. మార్చి మధ్య నుంచి మన రాష్ట్రంలో కరోనా  సెకండ్  వేవ్‌  మొదలైంది. ఏప్రిల్ ఫస్ట్​ వీక్​ నాటికి కరోనా పేషెంట్లతో దవాఖాన్లు కిక్కిరిసిపోవడం స్టార్టయింది.  అప్పటి నుంచి ఇప్పటివరకూ అంటే  50 రోజుల్లో సగటున రోజూ రూ. 150 కోట్లు ప్రజలకు ఖర్చయింది. ట్రీట్​మెంట్​ కోసం ఇటు ప్రభుత్వ దవాఖాన్లకు వెళ్లలేక, అటు ప్రైవేట్ హాస్పిటళ్లలో బిల్లుల భారాన్ని తట్టుకోలేక జనం ఆగమవుతున్నారు.

రాష్ట్రంలో కరోనా ట్రీట్​మెంట్​ కోసం ఇప్పటికీ రోజూ రూ. వంద కోట్లకు పైగా జనం ఫీజులు కడుతున్నారు. ఆదివారం సాయంత్రానికి రాష్ట్రంలో కరోనా ఇన్‌‌ పేషెంట్లు 25,485 మంది ఉండగా, ఇందులో 17,461 మంది ప్రైవేట్ దవాఖాన్లలో ఉన్నారు. ప్రైవేట్​లో ఉన్న ఒక్కో వ్యక్తి సగటున రూ. 70 వేలు బిల్లు కడుతున్నారు. లక్షల్లో ఫీజులు కడుతున్నవాళ్లు కూడా వేలల్లో ఉన్నారు. ఈ లెక్కన 17,461 మంది కలిసి ఆదివారం ఒక్కరోజే తక్కువలో తక్కువ రూ. 122 కోట్లు కట్టారు. ఇవిగాక అంబులెన్స్‌‌లు, మెడికల్ కిట్లు, ఆక్సిమీటర్లు, ఆన్‌‌లైన్ డాక్టర్ కన్సల్టేషన్లు, మాస్కులు, శానిటైజర్లు చేసే ఖర్చు అదనం.

నలిగిపోతున్న మిడిల్​  క్లాస్‌‌

కరోనా ట్రీట్​మెంట్​ కోసం ఇటు ప్రభుత్వ దవాఖాన్లకు వెళ్లలేక, అటు ప్రైవేట్ హాస్పిటళ్లలో వేసే అధిక బిల్లుల భారాన్ని తట్టుకోలేక మిడిల్ క్లాస్ కుటుంబాలు నలిగిపోతున్నాయి. తమ వారిని బతికించుకునేందుకు అప్పులు చేసి, ఆస్తులు అమ్మి బిల్లులు కట్టి ప్రైవేట్​ దవాఖాన్ల దోపిడీకి బలవుతున్నాయి. కొంతమంది ఏండ్లకు ఏండ్లు కష్టపడి కూడబెట్టిన ఆస్తులు అమ్ముకుంటున్నారు.  ఇంకొంతమంది స్నేహితులు, బంధువుల వద్ద అప్పులు చేస్తున్నారు. బంగారం, ఇండ్లు తాకట్టు పెట్టి లోన్లు తీసుకుంటున్నారు. కరోనా ట్రీట్​మెంట్​ను ఆరోగ్యశ్రీలో చేర్చితే చాలా మందికి కొంతైనా ఖర్చు తగ్గేది. కానీ, రాష్ట్ర సర్కార్ ఆ దిశగా చర్యలే తీసుకోలేదు. 

చేతులెత్తేసిన సర్కార్‌‌‌‌

కరోనా సెకండ్‌‌ వేవ్‌‌లోనూ ప్రైవేట్ హాస్పిటళ్లను కట్టడి చేయడంలో రాష్ట్ర సర్కార్ పూర్తిగా ఫెయిల్ అయింది. ఫస్ట్‌‌ వేవ్‌‌లో ఫీజుల నియంత్రణ జీవో పేరిట, సగం బెడ్ల స్వాధీనం పేరిట హడావుడి చేసింది. ఈసారి ఆ హడావుడి కూడా లేకుండా పూర్తిగా చేతులెత్తేసింది. అడ్డగోలు బిల్లులపై ఆధారాలతో పాటు వేల మంది ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. సర్కార్ ఇచ్చిన జీవో ప్రకారం సాధారణ ఐసోలేషన్‌‌కు రోజుకు రూ. 4 వేలు, ఐసీయూ అయితే రోజుకు రూ. 7,500, వెంటిలేటర్‌‌‌‌ పెడితే రోజుకు రూ. 9 వేలు చార్జ్‌‌ చేయాలి. కానీ, ఈ జీవోను ఒక్క హాస్పిటల్‌‌ కూడా లెక్క చేయడం లేదు. లెక్క చేయని ఏ హాస్పిటల్​పై కూడా సర్కారు సీరియస్​ యాక్షన్​ తీసుకోవడం లేదు. 

70 శాతం మంది ప్రైవేటుకే

కరోనా సోకి సీరియస్ అవుతున్న ప్రతి వంద మందిలో 30 శాతం మంది ప్రభుత్వ దవాఖాన్లకు పోతే, 70 శాతం మంది ప్రైవేట్‌‌ హాస్పిటళ్లకు  పోతున్నారు. హెల్త్ డిపార్ట్‌‌మెంట్‌‌ బులెటిన్‌‌లోని వివరాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అందులోనూ అత్యంత పేదలు, కొద్ది మంది మిడిల్ క్లాసు వ్యక్తులు మాత్రమే ప్రభుత్వ దవాఖాన్లకు వెళ్తుండగా, మిగతవాళ్లంతా ప్రైవేట్ హాస్పిటళ్లలోనే అడ్మిట్ అయ్యారు. ప్రభుత్వ దవాఖాన్లలో కేవలం మెషీన్లు, బెడ్లు ఉంటేనే పేషెంట్లు రారని, సరిపడా స్టాఫ్‌‌ను రిక్రూట్ చేయాలని మొదట్నుంచి డాక్టర్లు చెబుతూనే ఉన్నారు. కానీ, ఈ విషయాన్ని సర్కార్ పెద్దగా పట్టించుకోలేదు. గాంధీ వంటి పెద్ద దవాఖాన్లలో తక్కువ మంది స్టాఫ్ ఉండడం, ఎక్కువ మంది పేషెంట్లు రావడంతో డాక్టర్లు, స్టాఫ్‌‌పై తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఆ క్రమంలో జరిగిన అనేక ఘటనలు జనాలకు ప్రభుత్వ దవాఖాన్లపై నమ్మకం కోల్పోయేలా చేశాయి. ప్రభుత్వ దవాఖాన్లలో కార్పొరేట్ స్థాయి వైద్యం ఇస్తున్నామంటూ ప్రకటనలు చేస్తూనే ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు.. ఆఖరుకు సీఎం కేసీఆర్‌‌‌‌ కూడా తమకు పాణం మంచిగలేకుంటే కార్పొరేట్‌‌ హాస్పిటళ్లనే ఆశ్రయిస్తున్నారు. దీంతో సర్కారు దవాఖన్లపై ప్రజలకు నమ్మకం కలుగడం లేదు. ప్రైవేటు హాస్పిటళ్లకే క్యూ కడుతున్నారు. దీంతో ప్రైవేటులో ఇష్టారీతిగా ఫీజులు గుంజుతున్నాయి. 

బాండ్ రాసిస్తేనే డెడ్​బాడీ ఇచ్చిన్రు

హైదరాబాద్​లోని నిజాంపేటకు చెందిన బ్యాంకు ఉద్యోగి కె.దుర్గా ప్రసాద్ కుమార్తెకు కరోనా సోకింది. ఈ నెల మొదటి వారంలో  ఆమెను నిజాంపేటలోని ఎస్ ఎల్ జీ హాస్పిటల్ లో చేర్పించగా.. ఐదు రోజులకు చనిపోయింది. ట్రీట్ మెంట్​కు  రూ. 4 లక్షలు కట్టాల్సి వచ్చింది. ఈ నెల రెండో వారంలో దుర్గా ప్రసాద్ కు కూడా కరోనా సోకడంతో అదే హాస్పిటల్ లో చేరారు. ఆయన కూడా  ట్రీట్​మెంట్​ తీసుకుంటూ  ఐదో రోజు మృతిచెందారు. పది రోజుల వ్యవధిలో కుమార్తె, తండ్రి మృతిచెందడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. అప్పటికే దుర్గాప్రసాద్​కు  ట్రీట్ మెంట్ కోసం కుటుంబసభ్యులు రూ. 5 లక్షలు చెల్లించారు. హాస్పిటల్ నిర్వాహకులు మాత్రం హాస్పిటల్ బిల్లు మరో రూ. 4  లక్షలు అయిందని, అవి చెల్లిస్తేనే దుర్గా ప్రసాద్ డెడ్ బాడీ ఇస్తామనడంతో చేసేది లేక ఇంకో రూ. 2 లక్షలు చెల్లించారు. మరో రూ. 2 లక్షలకు పేపర్ రాసిస్తే డెడ్ బాడీ అప్పగించారు.

లక్షలకు లక్షలు పోసినా..

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం  గోగువారిగూడెం గ్రామానికి చెందిన బండ్ల సైదయ్య చౌదరికి ఈ నెల 1న కరోనా పాజిటివ్ వచ్చింది. ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో ఆయన కుటుంబ సభ్యులు మిర్యాలగూడ లోని ప్రైవేట్ హాస్పిటల్​లో  రెండు రోజుల పాటు చూపించారు. అనంతరం హైదరాబాద్ కాంటి నెంటల్ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ చేయించారు. 20 రోజుల  పాటు ట్రీట్​మెంట్​ జరిగింది. అయినప్పటికీ ప్రాణం దక్కలేదు. హైదరాబాద్ కాంటి నెంటల్ హాస్పిటల్​లో  మొత్తం రూ. 28 లక్షల బిల్ వేయగా.. 23 లక్షల 89 వేల 559 చెల్లించినట్లు వారి సోదరుడు బండ్ల మట్టయ్య చౌదరి  చెప్పారు. ‘బిల్లు తగ్గించాలని హాస్పిటల్ యాజమాన్యానికి చాలామందితో చెప్పించినం. ఉదయం నుంచి సాయంత్రం వరకు డెడ్ బాడీ ని ఉంచుకొని కొద్ది మొత్తంలో బిల్లు తగ్గించారు. ట్రీట్​మెంట్ కోసం తెలిసిన వాళ్ల దగ్గర అప్పులు తెచ్చినం. ఇప్పుడు పొలాలు అమ్మి అప్పులు కట్టాలి” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

20 రోజుల ట్రీట్​మెంట్​కు రూ. 20 లక్షలు

సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణానికి చెందిన అల్లాడి శ్రీనివాస్ కరోనా సోకడంతో హైదరాబాద్  లోని ఓ  ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్​మెంట్ తీసుకున్నాడు.  దాదాపు  20 రోజుల పాటు  కరోనాతో పోరాడి, చనిపోయాడు. కానీ ఆయన ట్రీట్​మెంట్​ కోసం శ్రీనివాస్ కుటుంబం దాదాపు రూ. 20 లక్షల వరకు ఖర్చు చేసింది. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే  శ్రీనివాస్ ఆసుపత్రి ఖర్చులకు వారి కుటుంబ సభ్యులు తెలిసినవారి వద్ద అప్పులు చేశారు. శ్రీనివాస్ బంధువులతోపాటు ఫ్రెండ్స్ కూడా సాయం చేశారు.  

9 లక్షలు పెట్టినా ప్రాణం దక్కలేదు

మాది రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం. భార్య, ఇద్దరు పిల్లలతో ఉన్నంతలో బతికినం. రోజూ అంగళ్లు తిరుగుతూ ఆలుగడ్డలు, ఉల్లి గడ్డలు అమ్ముకుని కుటుంబాన్ని పోషించుకుంటూ వచ్చిన. నా భార్య రాధకు కరోనా వచ్చింది. జగిత్యాల, మంచిర్యాలలోని ప్రైవేట్ హాస్పిటళ్లలో చూపించిన. సీరియస్  ఉన్నదని అడ్మిట్ చేసుకున్నరు. ఆమెను బతికించుకోవడం కోసం దాదాపు రూ. 9 లక్షలు ఖర్చు పెట్టిన. కానీ, ఈ నెల 16న ట్రీట్​మెంట్​ తీసుకుంటూ చనిపోయింది. వైశ్య సంఘం, స్వచ్ఛంద సంస్థల వాళ్లు రూ. 2 లక్షల వరకు ఆర్థిక సాయం చేసిన్రు. మిగిలిన రూ. 7 లక్షలు అప్పు తెచ్చిన. ఇప్పుడు అప్పు ఎట్ల తీర్చాల్నో, పిల్లల్ని ఎట్ల సాదుకోవాల్నో అర్థమైతలేదు. 
- చింతల ఆంజనేయులు, లక్సెట్టిపేట, మంచిర్యాల జిల్లా

మూడెకరాలు కుదువపెట్టిన్రు

భూపాలపల్లి జిల్లా అంబట్ పల్లికి చెందిన వావిలాల సమ్మయ్య(42) కు ఇటీవల కరోనా సోకింది. లంగ్స్ ఇన్ఫెక్షన్ తీవ్రం కావడంతో కుటుంబసభ్యులు ప్రైవేట్​ హాస్పిటల్​లో ట్రీట్​మెంట్​ చేయించారు. కోలుకుంటున్న టైంలో బ్లాక్ ఫంగస్ సోకింది. కుడి కన్ను పూర్తిగా దెబ్బతినడంతో ఆపరేషన్ చేసి తీసేశారు. కరోనా, బ్లాక్ ఫంగస్ ట్రీట్ మెంట్ కోసం సమ్మయ్యకు ఇప్పటికే రూ. 15 లక్షలు ఖర్చయింది. ఇందుకోసం ఆయన కుటుంబ సభ్యులు మూడెకరాల పొలం కుదువపెట్టి అప్పులు తెచ్చిన్రు. బ్లాక్ ఫంగస్  ట్రీట్​మెంట్​ కోసం రోజుకు రూ. 60 వేల మందులు అవుతున్నాయని, ఉన్న పొలం పెట్టి ఇప్పటికే అప్పులు చేశామని, ఇప్పుడు ఏం చేయాలో తెలుస్తలేదని ఆ కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  సమ్మయ్యకు ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు.

రూ. 25 లక్షలు ఖర్చు పెట్టినా..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన బాల్య మిత్ర ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బొందుగుల సంతోష్ (40)కు కరోనా సోకడంతో ఏప్రిల్​ 15న కరీంనగర్ లోని సీవీఎం హాస్పిటల్​లో  జాయిన్ చేశారు. అనంతరం ఏప్రిల్ 20న హైదరాబాద్​లోని కామినేని హాస్పిటల్ కు తరలించారు. మొత్తంగా రెండు హాస్పిటళ్లలో కలిపి రూ. 25 లక్షలకు పైగా ఖర్చు చేశామని, అయినా ప్రాణాలు దక్క లేదని సంతోష్​ తండ్రి మార్కండేయ ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది లాక్ డౌన్ సమయంలో వలస కూలీలు, కరోనా బాధితులకు ఆహార పదార్థాలను అందించి ఆదుకున్న సంతోష్ సేవలను గుర్తు చేసుకుని ఆయన దోస్తులు కన్నీళ్లు పెట్టుకున్నారు.