బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో ఫీజుల వేధింపులు .. ఫీజు బకాయిల చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి

బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో ఫీజుల వేధింపులు .. ఫీజు బకాయిల చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి
  • షోకాజ్ నోటీసులు ఇచ్చినా పట్టించుకోని ప్రైవేటు స్కూళ్లు 
  • జగిత్యాల జిల్లాలో విద్యాశాఖ ఆదేశాలనూ పట్టించుకోని వైనం

జగిత్యాల, వెలుగు: బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో విద్యార్థులపై ఫీజుల పేరిట వేధింపులు కొనసాగుతున్నాయి. బకాయిల పేరుతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఫీజు కట్టమని ఒత్తిడి చేస్తున్నారు. ఈ విషయమై తల్లిదండ్రులు ఇటీవల కలెక్టర్ సత్యప్రసాద్‌‌‌‌ను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు డీఈవో రాము సంబంధిత స్కూల్ యాజమాన్యాలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ కొన్ని స్కూళ్ల తీరు మారలేదు. 

540 మంది విద్యార్థులకు ఫీజు కష్టాలు

జగిత్యాల జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద 9 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. వీటిలో 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 540 మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రభుత్వం డే స్కాలర్స్‌‌‌‌ విద్యార్థికి రూ. 28,000, రెసిడెన్షియల్‌‌‌‌ అయితే రూ. 48,000 చెల్లిస్తుంది. విద్యార్థులకు యూనిఫాం, నోట్ బుక్స్, టెక్ట్స్ బుక్స్, షూస్ కూడా స్కూల్ యాజమాన్యాలే ఇవ్వాల్సి ఉంటుంది. దీనికోసం ప్రతి ఏటా విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రభుత్వం ఫీజు చెల్లిస్తుంది. ప్రస్తుతం జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కూళ్లకు రెండేండ్లకు సంబంధించి రూ. 2.30 కోట్ల బకాయిలు పెండింగ్‌‌‌‌లో ఉన్నాయి.

బకాయిల సాకుతో వేధింపులు 

బకాయిల అంశాన్ని సాకుగా చూపి స్కూల్ యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు సమాచారం. దీనిపై ఇటీవల విద్యార్థుల తల్లిదండ్రులు కలెక్టరేట్‌‌‌‌ ఎదుట నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్‌‌‌‌‌‌‌‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు డీఈవో స్కూల్ యాజమాన్యాలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయినా కొన్ని స్కూల్ యాజమాన్యాలు తీరును మార్చకపోవడం గమనార్హం. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద ఎంపికైన విద్యార్థులను మరో బ్రాంచ్‌‌‌‌కి తరలించడం, క్లాస్‌‌‌‌ నుంచి వేరుచేసి ప్రత్యేకంగా కూర్చోబెట్టడం వల్ల విద్యార్థులు అవమానానికి గురవుతున్నారు. 

అలాగే, కొన్ని స్కూల్స్ తల్లిదండ్రులతో సమావేశాలు పెట్టి, ఫీజులు చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. దీంతో చాలామంది పేరెంట్స్ అప్పులు చేసి ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి. కొందరు విద్యార్థులు ఈ వేధింపులు భరించలేక స్కూల్‌‌‌‌కు వెళ్లడం మానేసి ఇంట్లోనే ఉండిపోతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

షోకాజ్ నోటీసులు జారీ చేశాం

బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ విద్యార్థులను స్కూల్ యాజమాన్యం ఫీజు అడుగుతున్నారని మా దృష్టికి వచ్చింది. యాజమాన్యంతో మాట్లాడి ఫీజులు అడగద్దని సూచించాం. కొన్ని స్కూల్ యాజమాన్యాలకు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేశాం.

రాము, జగిత్యాల డీఈవో