- చార్జీలు, ట్యాక్సులు తక్కువ కావడంతో ఈశాన్య రాష్ట్రాలు, యూటీల్లో రిజిస్ట్రేషన్లు, పర్మిట్లు
- తనిఖీలు చేయకుండానే ఇస్తుండడంతో
- అక్కడి నుంచే ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు
- మన అధికారులు తనిఖీలు చేస్తే..
- వేధిస్తున్నారంటూ ఫిర్యాదులు
- డామన్ డయ్యూలో వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు రిజిస్ట్రేషన్..
- దానిపై 16 చలాన్లు పెండింగ్
హైదరాబాద్, వెలుగు: కర్నూల్ జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంతో హైదరాబాద్ కేంద్రంగా నడిచే ట్రావెల్ ఏజెన్సీల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడ్తున్నాయి. ఆయా ట్రావెల్బస్సులను ఈశాన్య రాష్ట్రాలు, యూటీల్లో రిజిస్ట్రేషన్ చేయిస్తున్న యాజమాన్యాలు.. అక్కడే ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు, నేషనల్పర్మిట్లు తీసుకొని ఇక్కడ నడుపుతున్నాయి.
ఇక్కడితో పోలిస్తే ఆయా రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్, నేషనల్పర్మిట్లకు చార్జీలు, ఇతర ట్యాక్స్‌లు తక్కువగా ఉండడం, ఎలాంటి తనిఖీలు లేకుండా ఈజీగా సర్టిఫికెట్లు జారీ చేస్తుండడమే ఇందుకు కారణమని తెలుస్తున్నది. ప్రమాదాలు జరిగినప్పుడు ఫైర్‌సేఫ్టీ పరికరాలు లేకున్నా, ఆఖరికి కిటికీలు పగులగొట్టేందుకు హ్యామర్లు లేకున్నా, ఇంజిన్లు, బ్రేకులు కండీషన్‌లో లేకున్నా, బస్సులను తనిఖీలు చేయకుండానే ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఇవ్వడం వల్ల ప్రయాణికుల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారుతున్నాయి.
మరోవైపు అనుమతులు ఇతర రాష్ట్రాల్లో పొంది, చార్జీలు, టాక్సులు ఆయా రాష్ట్రాలకే చెల్లించి.. మన దగ్గర ప్యాసింజర్స్‌ను తిప్పుతూ లాభాలు గడిస్తున్నా మన ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. కర్నూల్‌లో ప్రమాదానికి గురైన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు రిజిస్ట్రేషన్ కూడా డామన్ అండ్ డయ్యూ పేరుతో ఉండడం చర్చనీయాంశంగా మారింది.
ఫిట్‌నెస్ సర్టిఫికెట్లూ అక్కడి నుంచే..
ప్రస్తుతం హైదరాబాద్కేంద్రంగా -బెంగుళూరు, ముంబై, నాగ్‌పూర్, విజయవాడ, చెన్నై రూట్లలో వెయ్యికి పైగా స్లీపర్బస్సులు నడుస్తున్నాయి. ఇక్కడి నుంచి నిత్యం వేల మంది ప్రయాణికులను తరలిస్తూ భారీగా లాభాలు ఆర్జిస్తున్నాయి. కానీ వీటి రిజిస్ట్రేషన్మన రాష్ట్రంలో చేయించడం లేదు. ఇక్కడి నుంచి నేషనల్ పర్మిట్లు గానీ, ఫిట్నెస్సర్టిఫికెట్లు గానీ తీసుకోవడం లేదు. ఈ బస్సులన్నింటినీ అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్లాంటి ఈశాన్య రాష్ట్రాల్లో, పాండిచ్చేరి, డామన్డయ్యూ, లక్షదీప్లాంటి కేంద్రపాలిత ప్రాంతాల్లోనే రిజిస్ట్రేషన్చేయిస్తున్నారు.
మన రాష్ట్రంతో పోలిస్తే అక్కడి రిజిస్ట్రేషన్చార్జీలు 30శాతం లోపే ఉండడమే ఇందుకు కారణమని రవాణా శాఖ అధికారులు అంటున్నారు. మూడు నెలల కాలానికి ఇచ్చే నేషనల్పర్మిట్కు మన దగ్గర ఒక్కో సీటుకు రూ.4వేల చొప్పున 40 సీట్ల బస్సుకు రూ.1.60లక్షలు ఉండగా, ఆయా చోట్ల రూ.15వేలు, ఆలోపు మాత్రమే ఉంటుందని చెప్తున్నారు. అలాగే మన దగ్గర ఫిజికల్‌గా ఇంజిన్, బ్రేకులు, ఫైర్‌సేఫ్టీ లాంటివన్నీ సరిగ్గా ఉంటే ఫిట్నెస్సర్టిఫికెట్లు ఇస్తారు.
కానీ ఆయా ప్రాంతాల్లో వీటిని పట్టించుకోరని, అందువల్లే అక్కడి నుంచి ఫిట్నెస్సర్టిఫికెట్లు తెచ్చుకుంటున్నారని రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ప్రమాదానికి గురైన కావేరి ట్రావెల్స్‌లో ఎలాంటి ఫైర్‌సేఫ్టీ పరికరాలు లేవు. కనీసం అద్దాలు పగులగొట్టేందుకు హ్యామర్‌లు కూడా లేని పరిస్థితి. దీనికంతటికీ యాజమాన్యాల కాసుల కక్కుర్తే కారణమని స్పష్టమవుతున్నది.
కావేరి బస్సుపై 16 చలాన్లు పెండింగ్..
ఆయా రాష్ట్రాల్లో సీట్లకు పర్మిట్లు తెచ్చుకుంటున్న యాజమాన్యాలు, ఇక్కడికి వచ్చిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా వాటిని స్లీపర్లుగా మారుస్తున్నాయి. వాస్తవానికి టూరిస్టు బస్సుల్లో యాత్రికులను మాత్రమే అదీ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలకే తీసుకెళ్లాలి. కానీ టూరిస్టు పర్మిట్లు తీసుకొని నగరాల నడుమ ప్యాసింజర్లను తిప్పుతున్నారు. ఈ ట్రావెల్స్నడిపే డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో రోడ్డుపై వెళ్లేవారితోపాటు ప్రయాణికుల ప్రాణాలనూ తీస్తున్నారు. వీరికి సరైన శిక్షణ లేకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
ఉదాహరణకు శుక్రవారం తెల్లవారుజామున ప్రమాదానికి గురైన వేమూరి కావేరి ట్రావెల్స్‌బస్సు ట్రాఫిక్ రూల్స్ ఏమాత్రం పాటించడం లేదు. అతివేగం, డేంజరస్ డ్రైవింగ్‌తో పాటు నో ఎంట్రీ జోన్.. ఇలా ఈ బస్సుపై 2024 జనవరి 27 నుంచి ఈ ఏడాది అక్టోబర్ 9 వరకు తెలంగాణలో 16 చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో తొమ్మిది నో ఎంట్రీ జోన్‌వి కాగా, మిగిలినవి హైస్పీడ్, డేంజరస్ డ్రైవింగ్ ఉల్లంఘనలు ఉన్నాయి. మొత్తం రూ.23,120 ఫైన్లు కట్టకుండానే బస్సును హైదరాబాద్, బెంగళూరు నడుమ తిప్పుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. దీనికితోడు సిటీలో అడ్డగోలుగా పికప్పాయింట్లు పెట్టుకొని ట్రాఫిక్సమస్యలకు కారణమవుతున్నారు. ఉదాహరణకు హైదరాబాద్సిటీలో మాసబ్‌ట్యాంక్ నుంచి మెహదీపట్నం హైట్రాఫిక్జోన్గా ఉంది.
శంషాబాద్ఎయిర్పోర్ట్కు వెళ్లే పీవీ ఫ్లైఓవర్ఉండడంతో అర్ధరాత్రి దాటాక కూడా ఇక్కడట్రాఫిక్అధికంగా ఉంటుంది. కానీ బెంగళూరు వెళ్లే ట్రావెల్స్ బస్సులన్నీ సరోజనిదేవీ హాస్పిటల్ ఎదురుగా, పీవీ ఫ్లైఓవర్పక్కనే బాజాప్తా నిలిపి ప్యాసింజర్స్‌ను, గూడ్స్‌ను ఎక్కించుకుంటున్నాయి. దీని వల్ల ఒక్కోసారి మాసబ్ట్యాంక్దాకా ట్రాఫిక్‌జామ్ ఏర్పడుతున్నా అటు ఆర్టీఏ అధికారులు గానీ, ఇటు ట్రాఫిక్పోలీసులు గానీ పట్టించుకోవడం లేదు. ఆయా ట్రావెల్స్ యజమాన్యాల నుంచి ప్రతి నెలా మామూళ్లు ముడ్తుండడమే ఇందుకు కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రాజకీయ పలుకుబడితో ఇష్టారాజ్యం
ప్రముఖ ట్రావెల్స్యజమానుల్లో పలువురు ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఉండగా, మిగిలినవారు సైతం రాజకీయ అండదండలతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మన రాష్ట్రంలో ఆర్టీఏ అధికారులు, వెహికల్ఇన్స్పెక్టర్లు ఎక్కడైనా తనిఖీలు చేపడ్తే.. తెలంగాణ అధికారులు తమను వేధిస్తున్నారంటూ ఆయా రాష్ట్రాల ప్రభుత్వాధినేతలకు ఫిర్యాదులు చేసి, ఇక్కడి ప్రభుత్వ, అధికార యంత్రాంగంపై ఒత్తిడి తెస్తున్నట్టు తెలిసింది.
అడపాదడపా కేసులు పెడ్తే యాజమాన్యాల తరఫు లాయర్లు.. తమకు నేషనల్పర్మిట్లు సహా అన్ని సర్టిఫికెట్లు సరిగ్గా ఉన్నప్పటికీ మామూళ్ల కోసం వేధిస్తున్నారంటూ వాదనలు వినిపిస్తున్నారు. ఈ క్రమంలో రెగ్యులర్డ్యూటీలను వదిలి తాము కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందని, ఇంత చేస్తే చివరికి యాజమాన్యాల వాదనే నెగ్గుతోందని ఓ అధికారి ‘వెలుగు’ తో వాపోయారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏ రాష్ట్రంలో తిరిగే వాహనాన్ని ఆ రాష్ట్రంలోనే రిజిస్ట్రేషన్చేసుకోవాలని, అక్కడి నుంచే అన్ని పర్మిట్లు, సర్టిఫికెట్లు పొందాలని కేంద్రం నిబంధనలు తెస్తే తప్ప ట్రావెల్స్యాజమాన్యాల ఆగడాలకు అడ్డుకట్ట పడదని ఆయన పేర్కొన్నారు. కాగా ప్రైవేట్ట్రావెల్స్బస్సుల కారణంగా టీఎస్ఆర్టీసీకి వివిధ రూట్లలో ఆక్యుపెన్సీ రేషియో పడిపోయి వందల కోట్ల నష్టం వాటిల్లుతున్నా, వాటి కట్టడికి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి.
