
ఒక్క కన్నుగీటు వీడియోతో నేషనల్ వైడ్‌గా పాపులర్ అయ్యింది ప్రియా ప్రకాష్ వారియర్. నితిన్ ‘చెక్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఇప్పుడు పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ నటించిన ‘బ్రో’ చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తోంది. సముద్రఖని దర్శకత్వంలో పీపుల్స్ మీడియా సంస్థ నిర్మించిన ఈ మూవీ ఈనెల 28న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ప్రియా ప్రకాష్ వారియర్ ఇలా ముచ్చటించింది.
‘‘సముద్రఖని గారు నా పాత్ర కోసం ఎందరో పేర్లు పరిశీలించి, చివరికి నన్ను సెలెక్ట్ చేశారు. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నాలాంటి నటికి ఇలాంటి బిగ్ ప్రాజెక్ట్‌లో నటించే అవకాశం రావడం చాలా సంతోషం. నా గత చిత్రాలతో పోలిస్తే వీణ అనే హోమ్లీ గర్ల్ పాత్రలో కొత్తగా కనిపిస్తా. మా అమ్మ సూచనతో ఈ సినిమా చేయడానికి ముందే ఒరిజినల్ వెర్షన్ ‘వినోదయ సిత్తం’ చూశా. కానీ ‘బ్రో’లో చాలా మార్పులు చేశారు. ముఖ్యంగా కళ్యాణ్ గారి ఇమేజ్‌కు తగ్గ మార్పులు జరిగాయి. పాత్రల నిడివి కూడా పెరిగింది. నాకు ఇద్దరు హీరోలతోనూ కాంబినేషన్ సీన్స్ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారి లాంటి యాక్టర్‌తో ఒకటి, రెండు సీన్స్‌లో నటించినా అది గర్వంగా భావిస్తాను. తన యాక్టింగ్‌తో ఆయన మేజిక్ చేస్తారు.
ఆయన సెట్‌లో అడుగుపెడితేనే మాటల్లో చెప్పలేని ఏదో అనుభూతి, ఉత్సాహం వస్తాయి. చాలా కామ్ గా ఉంటారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనేది ఆయన నుంచి నేర్చుకున్నాను. తేజ్ సెట్స్‌లో చాలా సరదాగా ఉంటాడు. మంచి ఫ్రెండ్స్ అయ్యాం. కేతిక, రోహిణి గారు, యువ అందరం సెట్‌లో సరదాగా మాట్లాడుకునేవాళ్ళం. ఇక నాకు ఒక్క వీడియోతో ఓవర్‌నైట్ పాపులారిటీ వచ్చింది. కానీ నాది సినిమా బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ కాకపోవడం, కెరీర్ విషయంలో గైడెన్స్ లేకపోవడంతో సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయాను. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటి నేర్చుకుంటూ ముందుకెళుతున్నా. చిన్నప్పటి నుండి గొప్ప నటి కావాలని ఆశ ఉండేది. ఆ వైపుగా అడుగులు వేస్తున్నా’’ .