ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి : ప్రియాంక అల

ప్రజావాణి ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలి : ప్రియాంక అల

భద్రాద్రికొత్తగూడెం/ఖమ్మం టౌన్, వెలుగు : ప్రజావాణిలో ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలని ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్లు వీపీ గౌతమ్, డాక్టర్​ ప్రియాంక అల, ఖమ్మం సీపీ సునీల్​ దత్​ అధికారులకు సూచించారు.  సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వారు అర్జీలు స్వీకరించారు. ఖమ్మం కలెక్టరేట్​లో వంద అర్జీలు అందాయి.

వాటిలో 27 ధరణి, మిగతా 73 సదరం, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళితబంధు, రైతుబంధు, పాస్ పుస్తకాలు, వ్యక్తిగత విషయాలపై ఉన్నాయి. ఈనెల 28 నుంచి జరగనున్న ఇంటర్ ఎగ్జామ్స్ దృష్ట్యా కేజీబీవీ స్టూడెంట్స్ కు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించాలని, ఎగ్జామ్స్ టైమ్ లో ఫీజులు చెల్లించాలంటూ హాల్ టిక్కెట్లు  ఇవ్వకుండా స్టూడెంట్స్ ను ఇబ్బంది పెట్టే కాలేజీలపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్​యూ జిల్లా కార్యదర్శి మస్తాన్ కలెక్టర్​కు వినతిపత్రం అందజేశారు.

గ్రీవెన్స్​లో వచ్చే దరఖాస్తుల పరిష్కారంపై ఆఫీసర్లు ప్రత్యేక దృష్టి సారించాలని భద్రాద్రికొత్త గూడెంలో కలెక్టర్ ప్రియాంక అల​ సూచించారు. మణుగూరు మున్సిపాలిటీలో కమిషనర్​ నాగ ప్రసాద్​ ఆదేశాల మేరకు తాను పలు అభివృద్ధి పనులు చేశానని, బిల్లులు మాత్రం ఇవ్వడం లేదని వేముల లక్ష్మయ్య అనే కాంట్రాక్టర్​ కలెక్టర్​ ఎదుట వాపోయారు. మన ఊరు-మన బడి స్కీంలో భాగంగా లక్ష్మీదేవిపల్లి మండలం బానోజీ తండా ప్రాథమిక పాఠశాలలో పనులు చేశానని, డబ్బులు ఇప్పటికీ ఇవ్వలేదని బి. కృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు రూ. 6లక్షలు అప్పు తెచ్చి పెట్టానని, బిల్లులు ఇప్పించి తనకు న్యాయం 

చేయాలని కలెక్టర్​ను వేడుకున్నారు. 1999 సంవత్సరంలో ఫారెస్ట్​ అధికారులు, వన సంరక్షణ కమిటీల ఆధ్వర్యంలో తమ భూముల్లో 25 హెక్టార్లలో జామాయిల్​ మొక్కలు పెంచామని ఇల్లెందు మండలానికి చెందిన పలువురు గిరిజనులు పేర్కొన్నారు. చెట్లను కట్​ చేసి అమ్మి, వచ్చిన డబ్బులను పంచాల్సి ఉన్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. మార్చి 3వ తేదీ నేషనల్​ ఇమ్యూనైజేషన్​ డే సందర్భంగా జిల్లాలో మూడు రోజుల పాటు పల్స్​ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు కలెక్టర్​ తెలిపారు. 

ALSO READ :యర్రగుంటలో రైల్వే రోడ్డు ఓవర్​ బ్రిడ్జి ప్రారంభం

సీపీ ఆఫీస్​లో.. 

ఖమ్మం సీపీ ఆఫీస్ లో నిర్వహించిన గ్రీవెన్స్ డే కు 22 అర్జీలు అందాయి. వృద్ధాప్యంలో వారసులు పట్టించుకోవడంలేదని, భూ వివాదాలు, కుటుంబ, వ్యక్తిగత సమస్యలతో పాటు ఆర్ధిక లావాదేవీలు, భార్యభర్తల సమస్యలపై వచ్చిన  బాధితుల ఫిర్యాదులను సీపీ సునీల్​ దత్​ పరిశీలించారు. ఫిర్యాదులపై క్షేత్రస్దాయిలో విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత  పోలీస్ స్టేషన్ల ఎస్ హెచ్ఓ అధికారులకు ఆయన ఆదేశించారు.