సిద్దిపేట, వెలుగు: మెస్ సదుపాయం కల్పించాలని పీజీ విద్యార్థులు ప్రిన్సిపల్ ను బంధించిన ఘటన గురువారం సిద్దిపేటలోని ఓయూ పీజీ కాలేజీలో జరిగింది. ఇక్కడి సెంటర్ లో వివిధ కోర్సుల్లో విద్యార్థులకు అడ్మిషన్ల సమయంలో హాస్టల్ తో పాటు మెస్ ఉందని చెప్పడంతో చేరారు. హాస్టల్ వసతి కల్పించినా మెస్ లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తమ సమస్యపై పలుమార్లు వర్సిటీ అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోకపోతుండగా ఆందోళనకు దిగారు. వెంటనే మెస్ కల్పించాలని డిమాండ్ చేస్తూ పీజీ సెంటర్ ప్రిన్సిపల్ రవీంధ్రనాథ్ ను గదిలో బంధించి బైఠాయించి నినాదాలు చేశారు.
వర్సిటీ అధికారులతో ప్రిన్సిపల్ మాట్లాడి త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. రెండు రోజుల్లో తమ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపకుంటే మళ్లీ ఆందోళన తీవ్రం చేస్తామని విద్యార్థులు స్పష్టంచేశారు.
