ప్రియాంక చోప్రా సంచలన వ్యాఖ్యలు.. బాలీవుడ్‌లో వేతన అసమానతలపై షాకింగ్ నిజాలు!

ప్రియాంక చోప్రా సంచలన వ్యాఖ్యలు..  బాలీవుడ్‌లో వేతన అసమానతలపై షాకింగ్ నిజాలు!

సినీ పరిశ్రమలో వేతన వ్యత్యాసం అనేది చాలా కాలంగా చర్చనీయాంశంగా ఉంది. బాలీవుడ్‌లో తనకు ఎదురైన చేదు అనుభవాలను ఇటీవల ప్రియాంక చోప్రా పంచుకున్న ఒక త్రోబ్యాక్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమాలో మహేశ్ బాబు సరసన నటిస్తున్న ఈ గ్లోబల్ ఐకాన్ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్‌లో వేతన అసమానతలను మరోసారి బహిర్గతం చేశాయి.

సమాన పనికి సమాన వేతనం ఎక్కడ?
ప్రియాంక మాట్లాడుతూ, "నా కెరీర్ ప్రారంభంలో నాకు నా మేల్ కోస్టార్‌కు ఇచ్చిన పారితోషికంలో పది శాతం కూడా ఇవ్వని రోజులు ఉన్నాయి. సినిమా రంగంలో పారితోషికాల విషయంలో చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతోంది" అని పేర్కొన్నారు. సినిమా కోసం మగ నటులతో సమానంగా కష్టపడతామని, కానీ వేతనం విషయంలో చాలా తేడా ఉంటుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తమ తరం నటీమణులు సమాన వేతనం గురించి అడిగినా ఫలితం లేదని, అది కేవలం ఒక సంప్రదాయంగా మారిపోయిందని ఆమె అన్నారు.

హాలీవుడ్‌లో మార్పు..
బాలీవుడ్‌లో ఎదురైన ఈ అనుభవాలకు భిన్నంగా హాలీవుడ్‌లో తనకు సమాన వేతనం లభించిందని ప్రియాంక తెలిపారు. అక్కడ మగ నటులతో సమానంగా పారితోషికం చెల్లించారని, ఇది ఆమెకు చాలా సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. బాలీవుడ్ అగ్ర నటీమణుల్లో ఒకరిగా ఉన్న ప్రియాంక చోప్రా లాంటి వారు ఈ విషయాలను బహిరంగంగా మాట్లాడటం సీనీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.

►ALSO READ | బిగ్ బాస్ సీజన్ 9: 'అగ్నిపరీక్ష'తో ఆరంభం.. పేడ టాస్క్‌లు, షాకింగ్ కౌంటర్లు!

గతంలో దీపికా పదుకొణె, విద్యా బాలన్ వంటి నటీమణులు కూడా వేతన వ్యత్యాసంపై మాట్లాడారు. నటీమణులకు కేవలం నటనకు మాత్రమే కాకుండా, సినిమా మార్కెటింగ్‌లో కూడా ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. అయినా వారికి తగిన గుర్తింపు లభించడం లేదు. ప్రియాంక వంటి అంతర్జాతీయ తారలు ఈ విషయాన్ని లేవనెత్తడం వల్ల భవిష్యత్తులో బాలీవుడ్‌తో పాటు ఇతర భారతీయ సినీ పరిశ్రమల్లో కూడా సమాన వేతన విధానం అమలులోకి వస్తుందో లేదో చూడాలి.