ప్రజల దృష్టిని మళ్లిస్తున్నరు.. అసలు సమస్యలపై మోదీ మాట్లడ్తలేరు: ప్రియాంక గాంధీ

ప్రజల దృష్టిని మళ్లిస్తున్నరు.. అసలు సమస్యలపై మోదీ మాట్లడ్తలేరు: ప్రియాంక గాంధీ

తిరువనంతపురం :  ప్రధాని నరేంద్ర మోదీ దేశం లోని అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు. బీజేపీ పాలనలో నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని తెలిపారు. బుధవారం ఆమె కేరళలోని వయనాడ్ లోక్‌‌సభ నియోజకవర్గంలో జరిగిన కార్నర్ మీటింగ్‌‌లో మాట్లాడారు. ధరల కట్టడి, నిరుద్యోగం వంటి సమస్యలను పరిష్కరిం చడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. అభివృద్ధి గురించి, అసలు సమస్యల గురించి బీజేపీ నేతలు మాట్లాడటం లేదని మండిపడ్డారు. పైగా ప్రజల జీవితాలతో సంబంధం లేని కొత్త సమస్యలను తెరపైకి తెస్తున్నారని ఫైర్ అయ్యారు. 

ధనబలం, మీడియాతో మాపై దుష్ప్రచారం 

కాంగ్రెస్ పై, తన సోదరుడు రాహుల్ గాంధీపై దుష్ప్ర చారం చేయడానికి బీజేపీ డబ్బు, మీడియాను ఉపయోగిస్తున్నదని ప్రియాంక ఆరోపించారు. రాహుల్ గురించి అన్ని రకాల అబద్ధాలను ప్రచారం చేశారని చెప్పారు. కానీ రాహుల్, దేశ ప్రజలంతా ఒక్కటే అని చాటిచెప్పడానికి భారత్ జోడో యాత్ర చేశాడన్నారు. మోకాళ్ల నొప్పి తీవ్రంగా  ఉన్నా కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచాడని వివరించారు. ఐదేండ్లుగా వయనాడ్ ఎంపీగా ప్రజల అభివృద్ధికి రాహుల్ కృషి చేస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లోనూ మళ్లీ తన సోదరుడికే ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలకు ప్రియాంక విజ్ఞప్తి చేశారు.