లోక్ సభ ఎన్నికల్లో.. ప్రియాంక పోటీలో లేనట్టే!

లోక్ సభ ఎన్నికల్లో.. ప్రియాంక పోటీలో లేనట్టే!

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా పోటీ చేయట్లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రచారానికే పూర్తి సమయం కేటాయించాలనే ఉద్దేశంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. “ పూర్తి గా ఎన్నికల ప్రచారంపై దృష్టి సారించేందుకు ప్రియాంక గాంధీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. సోనియాగాంధీ, అన్న రాహుల్‌ గాంధీకి ఎన్నికల్లో పూర్తి సహకారం అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు” అని పార్టీ నేతలు చెప్పారు. యూపీలో కాంగ్రెస్‌ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలనే ఆలోచనతో హైకమాండ్ ప్రియాంకను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్ బరేలీ నుంచి ఆమె పోటీ చేస్తారనే వార్తలు వినిపించినప్పటికీ కాంగ్రెస్‌ ఇటీవల ప్రకటించిన మొదటి జాబితాలో రాయ్ బరే లీ స్థానాన్ని సోనియా గాంధీకే కేటాయించింది. అయితే ఆమె వారణాసి నుంచి పోటీ చేస్తారనే వూహాగానాలు వచ్చినా.. ఇప్పుడు దానిపై ఒక స్పష్టత వచ్చిందని నేతలు అన్నారు.