
గాంధీనగర్ : గుజరాత్ రాష్ట్రం గాంధీనగర్ లో ఏర్పాటుచేసిన కాంగ్రెస్ జన సంకల్ప సభలో ఆ పార్టీ ఆశాకిరణం, కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంకాగాంధీ మాట్లాడారు. కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల ప్రచార భేరిని మొదలుపెట్టిన ఈ సభలో పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రియాంక ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్నారు. తొలి బహిరంగ సభలోనే ప్రధానమంత్రి నరేంద్రమోడీ టార్గెట్ గా ఆమె విమర్శలు చేశారు. దేశం కోసం… దేశ అభివృద్ధి తమ పార్టీ , తమ కుటుంబం పనిచేస్తుందని ఆమె చెప్పారు.
“ప్రేమ, దయ, సోదరభావం అనే పునాదులమీద ఈ దేశం నిర్మితమైంది. వీటిని దెబ్బతీస్తూ దేశంలో జరుగుతున్న పరిణామాలు చాలా బాధాకరమైనవి. దేశ ప్రజల్లో ద్వేషభావం పెంచేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. వాటిని తిప్పికొట్టాలి. ఈ ఎలక్షన్ అంటే ఏంటో మీరు ఓసారి కచ్చితంగా ఆలోచించాలి. మీ భవిష్యత్తును ఈ ఎన్నికలతోనే తేల్చుకోబుతున్నారన్న సంగతి మరిచిపోవద్దు. పనికిరాని అంశాలపై దృష్టిపెట్టవద్దు. మీ సంక్షేమాన్ని కాంక్షించే అంశాలపైనే ఆలోచన చేయండి. మీకు ఏది కావాలో దానిపైనే దృష్టిపెట్టండి. మీ క్షేమానికి, సంక్షేమానికి ఏ పార్టీ భరోసా ఇస్తుందో దానికే ఓటేయండి” అని ప్రియాంకా గాంధీ వాద్రా అన్నారు.
ఉద్యోగాలు, మహిళల రక్షణ, రైతుల కష్టాలే ఎన్నికల్లో ప్రధానమైనవి
దేశంలోని యువతకు ఉద్యోగాలు దక్కుతున్నాయా.. మహిళలకు రక్షణ ఉందా… రైతులకు ఏం మేలు జరుగుతోంది.. ప్రతి పేదవాడి అకౌంట్లో రూ.15లక్షల హామీ ఎక్కడకు పోయింది.. ఈ అంశాలపై ఓటర్లు కచ్చితంగా దృష్టిపెట్టాలనీ.. ఈ సమస్యల గురించి ఆలోచించి ఓటేయాలని ప్రియాంకాగాంధీ గాంధీనగర్ సభలో కోరారు.