20 ఏండ్లుగా ఇవ్వని కోటి ఉద్యోగాలు.. ఇప్పుడెలా ఇస్తారు..? బీజేపీ హామీలపై ప్రియాంక ఫైర్

20 ఏండ్లుగా ఇవ్వని కోటి ఉద్యోగాలు.. ఇప్పుడెలా ఇస్తారు..? బీజేపీ హామీలపై ప్రియాంక ఫైర్
  • బిహార్​ పాలన ఢిల్లీ నుంచే..!
  • కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ
  • బిహార్​ ప్రజలకు సమస్యలు చెప్పుకునే వేదికే లేకుండా పోయిందని వ్యాఖ్య  
  • మంచి నేల, గంగానది ఉన్నా ప్రజలు ఇంకా పేదరికంలోనే ఉన్నారని ఆవేదన
  • 20 ఏండ్లుగా ఇవ్వని కోటి ఉద్యోగాలు ఇప్పుడెలా ఇస్తారని నిలదీసిన ఎంపీ

పాట్నా: బిహార్​ ప్రభుత్వాన్ని ఢిల్లీ నుంచి కొనసాగుతోంది.. ఇది డబుల్​ ఇంజిన్​ సర్కారు కాదు, సింగిల్​ ఇంజిన్​ సర్కారు మాత్రమేనని  కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ ప్రియాంక గాంధీ విమర్శించారు. శనివారం ఆమె బిహార్​లోని పలు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె సీఎం నితీశ్‌ కుమార్‌, కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపైనా విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ ‘డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందంటున్నారు. కానీ ఇది డబుల్‌ ఇంజిన్‌ కాదు, సింగిల్ ఇంజిన్‌ మాత్రమే. అది కూడా ఢిల్లీ నుంచే నడుస్తోంది’ అని అన్నారు. 

బిహార్‌ ప్రజలకు తమ సమస్యలు చెప్పుకునే వేదికే లేకుండా పోయిందని. నితీశ్‌ కుమార్‌ కు గౌరవం లేకుండా పోయిందని విమర్శించారు. వాతావరణ సమస్యల కారణంగా ఆమె హెలికాప్టర్​లో కాకుండా రోడ్డు మార్గంలో పాట్నా నుంచి బెగుసరాయ్‌ చేరుకున్నారు. అక్కడ జరిగిన భారీ సభలో ఆమె దాదాపు అరగంటపాటు ప్రసంగించారు. బిహార్​లో సారవంతమైన నేల, పక్కనే గంగానది ఉన్నప్పటికీ ప్రజలు ఇంకా పేదరికంలోనే ఉన్నారన్నారు. 20 ఏండ్లుగా నితీశ్ పాలన కొనసాగుతున్నా, బిహార్‌లో ఉద్యోగాలు, అభివృద్ధి కనబడడం లేదన్నారు. 

ఇప్పుడు ఒక్కసారిగా కోటి ఉద్యోగాలు  ఎక్కడి నుంచి ఇస్తారని ప్రశ్నించారు. అన్ని ఉద్యోగాలే ఉంటే ఇప్పటివరకు ఎందుకివ్వలేదన్నారు. “నెహ్రూ, ఇందిరా గాంధీ కాలంలోనే దేశానికి ఐఐటీలు, ఐఐఎంలు, పెద్ద పరిశ్రమలు వచ్చాయి. ఇప్పుడు బీజేపీ నాయకులు వాటిని మర్చిపోయి మళ్లీ మళ్లీ నెహ్రూనే నిందిస్తున్నారు” అని ప్రియాంక మండిపడ్డారు. “ప్రజల ఓటు హక్కును దొంగిలిస్తున్నారు. 

డబ్బు ఇచ్చి మహిళల ఓట్లు కొనాలనే ప్రయత్నం చేస్తున్నారు. డబ్బు తీసుకోండి.. కానీ ఓటు మాత్రం అమ్ముకోకండి’’ అని పిలుపునిచ్చారు. కులాల మధ్య అసమానతలు ఉన్నాయని, దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం కోసం రాహుల్‌  గాంధీ పోరాడుతున్నారన్నారు. కాంగ్రెస్‌ పాలనలో ఉన్న తెలంగాణతో పాటూ మొన్నటి వరకూ కాంగ్రెస్ పాలనలో ఉన్న రాజస్తాన్‌ రాష్ట్రాలు సామాజిక సంక్షేమంలో ముందున్నాయని ప్రియాంక గాంధీ తెలిపారు.