
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాందీ ఢిల్లీలోని లోటియెన్స్ జోన్ లో ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేశారు. ఆగస్టు 1 లోగా లోటియెన్స్ జోన్ లో నివాసాన్ని ఖాళీ చేయాలని ప్రియాంకకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసిన ప్రియాంక కొన్ని రోజుల పాటు గుర్గావ్ లోని ఓ ఇంట్లో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో ఆమె అద్దెకు తీసుకున్న నివాసంలో మరమ‍్మతు పనులు జరుగుతున్నందున కొద్ది రోజుల పాటు గుర్గావ్ లోని ఓ ఇంట్లో ఉండనున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే పలు గృహోపకరణాలు, వస్తువులను గుర్గావ్ కు తరలించారని, భద్రతా తనిఖీల ప్రక్రియ కూడా ముగిసిందని చెప్పాయి. ప్రియాంక నివాసం దగ్గర సీఆర్‌పీఎఫ్ సెక్యూరిటీ చెక్‌ను చేపట్టినట్టు తెలిసింది.
ప్రియాంక 1997 నుంచి తన కుటుంబంతో కలిసి ఢిల్లీలోని లోటియెన్స్ జోన్ బంగ్లాలో నివసిస్తున్నారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రియాంకకు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) భద్రతను ఉపసంహరించుకోవడంతో ఆమె ఆ బంగ్లా నుంచి ఆగస్టు 1లోపు ఖాళీ చేయాలని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ జూలై 1న నోటీసులు జారీ చేసింది. ఈ నివాసాన్ని అనిల్ బలూనికి కేటాయించింది.