కాంగ్రెస్​లో జోష్​ నింపిన ప్రియాంక పర్యటన .. సభకు భారీగా తరలివచ్చిన జనం

కాంగ్రెస్​లో జోష్​ నింపిన ప్రియాంక పర్యటన .. సభకు భారీగా తరలివచ్చిన జనం

ఖానాపూర్/ఆసిఫాబాద్​, వెలుగు: కాంగ్రెస్​ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ ఆదివారం చేపట్టిన ఖానాపూర్, ఆసిఫాబాద్​పర్యటన ఆ పార్టీ శ్రేణుల్లో జోష్​ నింపింది. సభలకు జనం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రియాంక గాంధీ ఖానాపూర్​లో తన ప్రసంగం ప్రారంభించే ముందు ఇండియా క్రికెట్​జట్టుకు విషెస్ చెప్పగా.. యువకులు కేరింతలు కొట్టారు. ఆ తర్వాత ఆమె స్థానిక అంశాలతో పాటు రాజకీయ అంశాలపై ఆకట్టుకునే రీతిలో ప్రసంగించారు.

తన నాయనమ్మ ఇందిరా గాంధీతో జిల్లాకే కాకుండా జిల్లాలోని ఆదివాసీలతో ఎంతో అనుబంధం ఉందన్నారు. దీంతో సభ చప్పట్లతో మార్మోగింది. ఇందిరమ్మ హయాంలోనే ఐటీడీఏ ఏర్పాటైందని, అలాగే ఆమె హయాంలోనే గిరిజనులకు పోడు భూములకు పట్టాలు ఇచ్చారంటూ ఆ వర్గాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్​ అధికారలోకి రాగానే జాబ్​క్యాలెండర్​విడుదల చేసి 2లక్షల ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించారు. గిరిజనులు, మైనార్టీలు, యువకులు, మహిళలను ఆకట్టుకునే రీతిలో సాగిన ప్రియాంక గాంధీ ప్రసంగం కాంగ్రెస్ ​పార్టీకి ఊపునిచ్చింది.

ఆసిఫాబాద్​లో ప్రియాంక మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి  వస్తే జాబ్ క్యాలండర్ రిలీజ్ చేస్తామని, ఆరు గ్యారంటీ లను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని హామీ ఇచ్చారు. అధికారం లోకి వస్తే రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని,  అమరవీరుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని హామీ ఇవ్వడంతో సభ చప్పట్లతో మార్మోగింది . కేసీఆర్ సర్కార్ రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి మరిచిందని.. తాము అధికారంలోకి వస్తే రూ.2లక్షల వరకు మాఫీచేస్తామని వెల్లడించారు.