బీజేపీ డబుల్ ఇంజన్ లో ఆయిల్ ఉందా?: ప్రియాంక

బీజేపీ డబుల్ ఇంజన్ లో ఆయిల్ ఉందా?: ప్రియాంక

హిమాచల్ ప్రదేశ్ లోని ఉనాలో కాంగ్రెస్ పరివర్తన్ ప్రతిక్షా ర్యాలీ నిర్వహించింది.  ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పాల్గొని బీజేపీ పై విమర్శలు చేశారు. రాష్ట్రంలో  డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రావాలని  బీజేపీ పిలుపునివ్వడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఐదేండ్లుగా హిమాచల్ ప్రదేశ్ లో ఏం చేశారో  సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు డబుల్ ఇంజన్ లో ఆయిల్ ఉందా అని ప్రశ్నించారు. 

హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందని ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు.  ఛత్తీస్ ఘఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో మాదిరిగానే హిమాచల్ ప్రదేశ్ లో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే లక్ష ఉద్యోగాలు, పాత పెన్షన్ పథకాన్ని ప్రవేశపెడతామని చెప్పారు. ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఆర్థిక సహాయాన్ని అందజేస్తామన్నారు. యువత ఆందోళన చెందాల్సిన అవసరం లేదని..వారికి తప్పకుండా ఉద్యోగాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. 

ఛత్తీస్ ఘఢ్ సీఎం భూపేష్ బఘేల్ గత మూడేండ్లో 5 లక్షల ఉద్యోగాలు కల్పించారని చెప్పారు. రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం పది లక్షల 30 వేల మందికి ఉద్యోగాలు కల్పించిందని ప్రియాంక గాంధీ తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొదటి కేబినెట్ సమావేశంలోనే లక్ష ఉద్యోగాల కల్పనపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.  హిమాచల్ ప్రదేశ్ లో వివిధ విభాగాల్లో  63 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని..తమ ప్రభుత్వం రాగానే వాటన్నింటినీ భర్తీ చేస్తామని చెప్పారు.