ప్రియాంక హత్య కేసు: అంతా 20 నిమిషాల్లోనేనా?

ప్రియాంక హత్య కేసు: అంతా 20 నిమిషాల్లోనేనా?
  • పోలీసుల విచారణ తీరుపై అనుమానాలు
  • ఫిర్యాదు చేయగానే మూడు టీమ్​లు వెళ్లాయన్న డీసీపీ
  • హత్య జరిగిన టైమ్​పై పొంతన లేకుండా వివరాలు
  • అసలు పట్టించుకోలేదంటున్న ప్రియాంక తల్లిదండ్రులు

హైదరాబాద్, వెలుగు:

ప్రియాంక రెడ్డి హత్య కేసులో పోలీసుల విచారణ తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంఘటన జరిగిన టైమింగ్​పై పోలీసు అధికారులే పొంతన లేని వివరాలను చెప్పడం విమర్శలకు దారితీస్తోంది. మృతురాలి తల్లిదండ్రులు లేవనెత్తుతున్న సందేహాలకు, పోలీసు అధికారులు ఇస్తున్న సమాధానాలకు పొసగడం లేదు. బుధవారం రాత్రి సుమారు 9.20 గంటలకు తొండుపల్లి టోల్​ప్లాజాకు సమీపం నుంచి ప్రియాంక తన చెల్లి భవ్యకు ఫోన్​ చేసింది. సుమారు 3 నిమిషాల పాటు మాట్లాడింది. తనకు భయం వేస్తోందని చెప్పింది. అటు తర్వాత ఆమె ఫోన్​ స్విచ్​ ఆఫ్​ అయింది. దీంతో ఆందోళనకు గురైన ప్రియాంక తల్లిదండ్రులు, చెల్లి రాత్రి 11 గంటల ప్రాంతంలో కారులో శంషాబాద్​ పోలీస్టేషన్​కు వచ్చి ఫిర్యాదు చేశారు. తాము ఫిర్యాదు చేసినా పోలీసులు సరిగ్గా స్పందించలేదని, లేనిపోని అనుమానాలతో ప్రశ్నలు వేశారని ప్రియాంక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

వెంటనే స్పందించి ఉంటే తమ బిడ్డను కాపాడే అవకాశం ఉండేదని అన్నారు. అయితే శుక్రవారం రాత్రి నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టిన సీపీ సజ్జనార్​, డీసీపీ ప్రకాశ్​రెడ్డి మాత్రం.. ఫిర్యాదు అందగానే వెంటనే స్పందించామని చెప్పారు. ప్రియాంక తండ్రి శ్రీధర్​రెడ్డితో కలిసి పోలీసులు వెళ్లి గాలించారని,  అదనంగా మూడు టీమ్​లు వాహనాలతో అన్ని ప్రాంతాల్లో గాలించాయని వివరించారు. రాత్రి 9.48 గంటలకు ప్రియాంక ఫోన్​ స్విచ్​ ఆఫ్​ అయిందని, ఆ తర్వాత 20 నిమిషాల్లోనే అంటే రాత్రి 10 గంటల 8 నిమిషాల్లోనే ప్రియాంకను నిందితులు దగ్గర్లోని ఓ గదిలోకి తీసుకెళ్లి, అత్యాచారం చేశారని పోలీసులు చెప్పారు. ఆ సమయంలో ఆమె నోరు, ముక్కు మూయడం వల్ల ఊపిరాడక చనిపోయిందని, ఆ వెంటనే మృతదేహాన్ని బెడ్​షీట్​లో చుట్టి లారీలో తీసుకెళ్లారని ప్రెస్​మీట్​లో చెప్పారు.

లారీలో ఇద్దరు నిందితులు.. ప్రియాంక స్కూటీపై మరో ఇద్దరు నిందితులు బయలుదేరారని వివరించారు. ఇంత తక్కువ టైమ్​లోనే ఇవన్నీ జరిగాయని చెప్పడం అనుమానాలకు దారితీస్తోంది. ప్రియాంక మృతదేహాన్ని నిందితులు కాల్చిన చటాన్​పల్లి అండర్​ బ్రిడ్జికి, తొండుపల్లి టోల్​ప్లాజాకు మధ్య సుమారు 23 కిలోమీటర్ల దూరం ఉంటుంది.  ప్రియాంక తల్లిదండ్రుల ఫిర్యాదు అందిన వెంటనే  తాము టోల్​ప్లాజా వద్ద పరిశీలించామని పోలీసులు చెప్పారు. అయితే.. వెంటనే స్పందించి ఉంటే, టోల్​ప్లాజా సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కదలికలను ఎందుకు గుర్తించలేకపోయారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మూడు టీమ్​లతో గాలించినా.. చటాన్​పల్లి వరకు ఒక లారీ, దాని వెంట స్కూటీ వెళ్లినదాన్ని పసిగట్టలేకపోవడంపైన విమర్శలు వినిపిస్తున్నాయి. చివరికి గురువారం ఉదయం 7 గంటల ప్రాంతంలో అండర్​ బ్రిడ్జి కింద శవం కాలుతున్నట్లు ఓ వ్యక్తి సమాచారం ఇస్తే కానీ పోలీసులు గుర్తించలేకపోయారు. హత్య జరిగిన సమయంపైనా విరుద్ధమైన వివరాలు చెప్పారు. గురువారం పోస్టుమార్టం తర్వాత తెల్లవారుజామున 3గంటల సమయంలో ప్రియాంక చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించినట్లు తెలుస్తోంది. అయితే పోలీసులు మాత్రం బుధవారం రాత్రి 10.30 గంటల్లోపే ఆమె చనిపోయినట్లు వెల్లడించారు. ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్టుకు సమీపంలో ఈ సంఘటన జరగడం సంచలనంగా మారగా, కేసు విచారణలో పోలీసుల తీరు అనుమానాలకు తావిస్తోంది.